Search
Monday 19 March 2018
  • :
  • :
Latest News

కొత్త ఏడాది కానుకగా నిరంతర విద్యుత్తు

burka*ఆరుతడి పంటలపై దృష్టి
*సింగూరు జలాలపై పనికి మాలిన రాజకీయం
*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

మన తెలంగాణ/బాన్సువాడ : రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సర కానుకగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతర విద్యుత్తును సరఫరా చేయనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ మండల పరిషత్ సమావేశం హాలులో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరై ప్రసంగించారు. భవిష్యత్తులో ఇక రైతాంగానికి కరెంట్ సమస్య ఉండబోదన్నారు. రైతులు పెట్టుబడి లేని వ్యవసాయానికి అలవాటుపడాలన్నారు. ప్రతి రైతు దేశీ ఆవును కొనుగోలు చేసి వాటి ద్వారా వచ్చే పేడ, మూత్రంలో బెల్లం, శెనగలు కలిపి కంపోస్ట్ ఎరువులను తయారు చేసి పంట సాగుకు వినియోగిస్తే ఖర్చు లేకుండా వ్యవసాయం చేయవచ్చునన్నారు. రసాయనిక ఎరువులను అధికంగా వాడటం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని, త ద్వారా దిగుబడులు తగ్గిపోతున్నాయని చెప్పారు. వాటి స్థానంలో సేంద్రీయ ఎరువులను వాడ టం ఎంతో శ్రేయస్కరమని తెలిపారు. ప్రతి రైతు తప్పనిసరిగా పంటపై ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లించుకోవాలని, ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలతో పంటలు చేజారిపోతే ఇన్సూరెన్స్ ద్వారా ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. రైతులు ప్రతిసారి వేసే వరి సాగుకే ప్రాధాన్యత నివ్వకుండా ఆరుతడి పంటలను కూడా సాగు చేసుకోవాలన్నారు. ఆరుతడి పంటలపై అధిక లాభాలున్నాయని, రైతులు ఆర్ధికంగా ఎదిగే అవకాశం ఉన్నట్లు మంత్రి వివరించారు. 1931లో నిజాంపాలనలో భూ ప్రక్షాళన జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు భూసర్వేలు నిర్వహించలేదన్నారు. కాని తమ ప్రభు త్వం భూప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టి వివాదాస్పద, సానుకూల భూముల సమస్యలను పరిష్కరించేందుకు మార్గం సుగుమం చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 70 శాతం భూ సర్వే పూర్తయిందని త్వరలోనే వంద శాతం సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సర్వే ద్వారా వచ్చిన గణాంకాలను బట్టి అసలైన రైతులకు రెండు పంటలకు గాను ఎకరాకు ఎనిమిది వేల రూపాయలను పెట్టుబడి కింద అందించనున్నామని చెప్పారు.
సింగూర్ జలాలపై పనికి మాలిన రాజకీయం చేస్తున్నారు
సింగూర్ జలాలను శ్రీరాంసాగర్ నుండి కరీంనగర్ తరలించడాన్ని ప్రతిపక్ష రాజకీయ నాయకులు పనికిమాలిన రాజకీయం చేస్తున్నారని అన్నారు. కరీంనగర్ తమ తెలంగాణాలోనిదేనని, ఆంధ్రలో లేదని మన రాష్ట్రానికి నీరు ఇచ్చుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో కాళేశ్వరం నుండి నిజాంసాగర్‌కు నీటిని తెచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. భవిష్యత్ ఆలోచనతోనే సిఎం కెసిఆర్ సింగూర్ జలాలను శ్రీరాంసాగర్ మీదుగా మిడ్ మానేరు డ్యాంకు తరలించడం జరిగిందన్నారు.
బాన్సువాడకు మరో వంద పడకల ప్రసూతి ఆసుపత్రి
బాన్సువాడ వంద పడకల ఏరియాసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగిపోవడంతో గర్భిణీలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అందుకోసం మరో వంద పడకల ప్రసూతి ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
నూతన భవన నిర్మాణం కోసం 17 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. అలాగే బాన్సువాడ ప్రధాన రహదారి విస్తరణ కోసం ముందుగా 8 కోట్ల రూపాయల నిధులను మం జూరు చేశామని, వాటితో పనులు జరుగగా, మిగిలిన పనులను పూర్తి చేసేందుకు రూ.30 కోట్ల నిధులను మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ రాజేశ్వర్, ఎంపిడిఓ నగేష్, తహశీల్ధార్ గోపి, ఎఎంసీ చైర్మెన్ నార్ల సురేష్ గుప్త, వైస్ ఎంపిపి జిన్న రఘు, బాబా, సింగిల్ విండో చైర్మెన్ ఎర్వల కృష్ణారెడ్డి, జంగం గంగాధర్, అంజిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు , ఎంపిటిసీలు పాల్గొన్నారు.

Comments

comments