Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

నోట్ల రద్దు తెరవని అవినీతి పద్దు

tha

*పెద్దనోట్ల రద్దుతో చితికిన చిన్న బతుకులు
*కొనుగోళ్లు లేక సాగిలపడ్డ వ్యాపారం
*తీవ్ర ఇబ్బందులు పడ్డ సామాన్యుడు
*పనులు మానుకుని గంటల తరబడి క్యూలైన్లోనే….
*నేటితో నోట్ల రద్దుకు ఏడాది

2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు అవుతున్నట్లు ప్రకటించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు… ఆ తరువాత పెద్ద నోటు మార్పు కోసం బ్యాంకుల ఎదుట పడిగాపులు.. మరోవైపు  డబ్బులు తీసుకునేందుకు బ్యాంకులు, ఎటిఎం సెంటర్ల వద్ద బారెడంత క్యూలైన్లు… ఇలా సామాన్యులు అష్టకష్టాలు పడగా, వ్యాపారులు కొనుగోళ్లు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలా నాలుగైదు నెలల నోటు కష్టాలు అందరినీ వెంటాడాయి.. నేటితో నోట్లు రద్దై ఏడాది పూర్తి అయినసందర్భంగా ప్రత్యేక కథనం….మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : పెద్దనోట్ల రద్దు కారణంగా వత్సర కాలంగా ప్రజలు వడిదొడుకులను ఎదుర్కొంటూనే వున్నారు. గత ఏడాది నవంబర్ 8న మోడి సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశ, రాష్ట్ర ప్రజల జీవితాలను కుదిపి వేసింది. ముఖ్యంగా రైతులు, కూలీలు, చిరువ్యాపారుల పై పెను ప్రభావం పడింది. నోట్ల రద్దు తరువాత భవిష్యత్ అవసరాల కోసం తాము దాచి పెట్టుకొన్న నోట్లను మార్చడానికి, కొత్తనోట్లను పొందడానికి రోజుల తరబడి బ్యాంకుల ముందు పడిగాపులు కాశారు. ఆధార్ కార్డుల జీరాక్స్‌లను చేతపట్టుకొని వృద్దులు, పనులు మానుకొని వ్యవసాయకూలీలు, చిరు వ్యాపారులు, ఉద్యోగస్థులు గంటల తరబడి లైన్ల వేచివుండాల్సి వచ్చింది. కొత్తనోట్ల సమస్య యాభై రోజుల్లో సర్దుకుంటుందని ఆర్‌బీఐ ప్రకటించింది. ఆర్‌బీఐ ఆదేశాలు ఒకరీతిగా, క్షేత్రస్థాయిలో బ్యాంకుల పనితీరు మరొక తీరుగా ఉండే సామాన్యులు ఇప్పటికీ ఇబ్బందులెదుర్కొంటూనే ఉన్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించిన ఆర్‌బీఐ జీరో అకౌంట్ల ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలను చేపట్టాలని సూచించింది. దీనికి బిన్నంగా జీరో అకౌంట్‌ను ప్రారంభించడానికి కొన్ని బ్యాంకులు నిరాకరించాయి. దీని వల్ల సామాన్యుడికి సమస్యలు తప్పలేదు. గతంలో జీరో అకౌంట్‌ల నుండి ఎటువంటి లావాదేవీలుజరగక పోవడంతో బ్యాంకులు జీరో అకౌంట్‌లను వృధాప్రయాసగా భావించాయి. బ్యాంకులకు, ఆర్‌బీఐకి మధ్య సమన్వయం లేకపోవడంతో సామాన్యులు నలిగిపోయారు. జనవరి 1,2017 నుండి అన్ని రకాల లావాదేవీలను నగదు రహితంగా మార్చడానికి ప్రయత్నాలు చేశామని అధికారులు ప్రకటించినా గ్రామాల్లో, చిన్నచిన్న పట్టణాల్లో అమలు అసాధ్యంగా మారింది. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులు గ్రామాలను దత్తత తీసుకొని నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం, ఆర్‌బీఐ సూచించినప్పటికి క్షేత్రస్థాయిలో అందుకు సంబందించిన సాంకేతిక పరిజ్జానం అందుబాటులో లేకపోవడంతో ముందుకు సాగలేదు. వారానికి రూ.24వేల నగదును బ్యాంకుల ద్వారా పొందవచ్చునని ఆర్‌బీఐ ఆదేశాలు జారిచేసినప్పటికీ వాస్తవంలో సుమారు 6నెలలకు పైగా బ్యాంకులు దానిని పరచలేదు. పెద్దనోట్లు రద్దైన తర్వాత బ్యాంకుల్లో పాతనోట్లుతీసుకోవడం కొత్తనోట్లు ఇవ్వడం తప్ప మరో పని జరగలేదు. రైతుకు పంట రుణాలు, రుణమాఫి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ కార్పోరేషన్ల రుణాలు, ముద్ర, పారిశ్రామిక ప్రోత్సాహక రుణాల గ్రౌండింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. రైతులకు పంట రుణాలు బ్యాంకులనుండే రావాల్సి ఉంది. ప్రరిశ్రమల శాఖ ద్వారా మంజూరైన రుణాలను పారిశ్రామికవేత్తలకు బ్యాంకులే చెల్లిస్తాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆర్‌ఎండ్‌బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలు చేపట్టే నిర్మాణ పనుల బిల్లులను ఆన్‌లైన్ పద్ధతిలోనే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి ఉంది. ప్రతీ సంక్షేమ అభివృద్ధి పనులకు సంబంధించి అన్ని లావాదేవీలు బ్యాంకుల ద్వారానే నడుస్తాయి. ఇవన్నీ 2016 నవంబర్ 8 నుండి ఆపివేయబడ్డాయి. 2017డిసెంబర్ 31 వరకు ఆన్‌లైన్ లావాదేవీలపై ప్రభుత్వం సర్‌చార్జిలను ఎత్తివేసినప్పటికీ కొన్ని బ్యాంకులు ఖాతాదారుల నుండే సర్‌చార్జిలు వసూలు చేసాయి. గత రెండు మూడు నెలలుగా బ్యాంకు కష్టాల నుండి ప్రజలు తెరిపిన పడ్డప్పటికి పెద్దనోట్ల రద్దుతో ప్రభుత్వం ఆశించిన లక్షం మాత్రం నెరవేరలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఒక్క పైసా నల్లధనం వెలికి తీసినట్టు కనపడకపోగా లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పుపడ్డ వారంతా లబ్ధిపొందినట్లు కనపడుతోందని మద్యతరగతి ప్రజలు ఆరోపిస్తున్నారు.

Comments

comments