Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

కార్మికులు రోడ్డున పడుతుంటే స్పందించరేం?

Chada-venketreddy

సిపిఐ పోరు యాత్రలో ప్రశ్నించిన చాడ
మనతెలంగాణ/మంగపేట: బిల్ట్ కార్మికులపై ప్రభుత్వానికి, కెసిఆర్‌కు ప్రేమలేదని, కార్మికులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన పోరుబాటలో భాగంగా కమలాపురంలో బిల్ట్ కార్మికులతో మాట్లాడారు. బిల్ట్ గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే తమ కలలు సాకారం అవుతాయని, కార్మికులు ఎదురు చూసిన ఆశలను కెసిఆర్ విచ్ఛిన్నం చేశారని ఆరోపణలు చేశారు. అధికారంలోకి రాక ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన అనంతరం తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం కలువడంలేదని చెబుతున్న ప్రభుత్వం మెడలు వంచి తీసుకు వచ్చే ప్రయత్నం ఎందుకు చేయడంలేదని నిలదీశారు.

కర్మాగారంలోని కార్మికులు అధైర్య పడి సుమారు 10 మంది కార్మికులు గుండెలు ఆగిపోయి మృతి చెందగా మరి కొంతమంది కార్మికులు అనారోగ్యాలతో మృత్యువాత పడ్డారని, అయినా కార్మికులపై ప్రభుత్వానికి మనసు రావడంలేదని అన్నారు. కార్మికులకు సిపిఐ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. కార్మికులు అధైర్య పడాల్సిన పనిలేదని హామీ ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వంలోని మంత్రులతో చర్చించి బిల్ట్ భవిష్యత్ ఏమిటో తెలుసుకుని కార్మికులకు తెలుపుతామన్నారు. కార్మికులు ఉద్యమాలతోనే సమస్యలు సాధించు కోవచ్చని ఉద్యమాలకు ముందు ఉండాలని ఆయన కోరారు. కర్మాగారం తెరుచుకునేంత వరకు ప్రభుత్వంపై ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి అపర గజినీ అని ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెలే, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూనం నేని సాంబశివరావు అన్నారు. కెసిఆర్ ముందుగా గుర్తు వచ్చినప్పుడు ప్రకటనలు చేసి అనంతరం వాటిన మర్చి పోయి గజినీని తలపిస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. నాయకులు రవిందర్, బాలి మల్లేష్, సుజన, పాండు రాంబాబు, రాం యాదవ్, అంజయ్య,లక్ష్మయ్య, నర్సింహారావు, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments