Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని మోసం చేయడం తగదు

darna

రైతాంగానికి దశాబ్ద కాలంగా విశిష్ట సేవలందిస్తున్న సెర్ఫ్ ఉద్యోగులు
మహిళా సంఘాల ఏర్పాటు, ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర
అసెంబ్లీలో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : సిఎల్‌పి ఉపనేత జీవన్‌రెడ్డి

మనతెలంగాణ/జగిత్యాల : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ అనేది లేకుండా చేస్తానని, కొనసాగుతున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్దీకరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్  మోసం చేయడం తగదని సిఎల్‌పి ఉపనేత, జగిత్యాల ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 5 రోజులుగా సమ్మె బాట పట్టిన సెర్ఫ్ ఉద్యోగులకు జీవన్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆర్‌డిఓ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని శుక్రవారం సందర్శించిన ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాల ఐక్య ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కాంట్రాక్టు వ్యవస్ధను నిర్మూలించడంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులందరిని క్రమబద్దీకరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ధిష్టమైన కార్యచరణ రూపొందించకపోవడం వల్లే అవాంతరాలు ఏర్పడ్డాయన్నారు. రిజర్వేషన్ సమతుల్యత  పాటించాలని సూచించాయే తప్పా క్రమబద్దీకరించవద్దని ఎక్కడా చెప్పలేదన్నారు. న్యాయవ్యవస్ధపై నెపం వేసి తప్పించుకోవడం సరికాదన్నారు. సెర్ఫ్ ఉద్యోగులను 58 సంవత్సరాల వరకు వినియోగించుకుంటామని చెబుతూనే ఐదేళ్ల వరకే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయడం సెర్ఫ్ ఉద్యోగులను మోసం చేయడమే అవుతుందన్నారు. రైతాంగానికి మద్దతు ధర అందించడంలో, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు మహిళా సంఘాలను బలోపేతం చేసి వారి ఆర్థికాభివృద్ది కోసం దశాబ్దకాలంగా విశిష్ట సేవలందిస్తున్నారన్నారు. అలాంటి వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా వారి పట్ల వివక్ష చూపి రోడ్డున పడేయడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న సెర్ఫ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని వారికి సంక్షేమ సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం నిర్వహించే  సమావేశాలకు గ్రామాల నుంచి మహిళలను తరలించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ప్రసార మాధ్యమాలుగా పనిచేస్తున్నారన్నారు. సెర్ఫ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే విషయమై వారితో చర్చలు జరపకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయనుకుంటే టిఆర్‌ఎస్ ప్రభుత్వ తీరు అందుకు పూర్తి విరుద్దంగా ఉందన్నారు. మీలో ఒకడిగా ఉంటూ మీ న్యాయమైన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, అలాగే సెర్ఫ్ ఉద్యోగుల డిమాండ్లను అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జీవన్‌రెడ్డి ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శంకర్, సెర్ఫ్ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

Comments

comments