Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

flag

*బాల్యవివాహాలు, పనిచేసే పిల్లలు, చిన్నారులపై హింసలు దృష్టికి వస్తే 1098 నెం.కు ఫోన్ చేయాలి
*పిల్లలు చదువుకునే వయస్సులో పనిచేయొద్దు
*బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రంలో మారథాన్ వాక్

మనతెలంగాణ/మెదక్ : బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ భారతిహోళికేరి అభిప్రాయపడ్డారు. శుక్రవారం నాడు జిల్లా కేంద్రంలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా స్థానిక ధ్యాన్‌చంద్ చౌరస్తా నుండి రాందాస్ చౌరస్తా వరకు మారథాన్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన అనంతరం బాలబాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ… బాలల హక్కులను అందరూ కలిసి రక్షించాలని వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన హక్కుల మాదిరిగానే బాలల హక్కులను సైతం భంగం కలుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యూనివర్సల్ ఎన్‌రోల్‌మెంట్ వచ్చిన అనంతరం మన దేశంలో సైతం బాలలకు ఉచిత నిర్భంద విద్య అనేది హక్కుగా మారిందన్నారు. చదువుకుంటే జ్ఞానం వస్తుందని దాని ద్వారా తప్పుఒప్పులను నిర్థ్దారణ చేసుకునే వీలుంటుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా చదువుకోవాలని సూచించారు. మనం చదువుతున్నట్లే ప్రతి బాలబాలికలు తప్పనిసరిగా చదువుకోవాలని, ఎక్కడైనా చదువుకోకుండా పనిచేస్తున్న బాలలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. బాల్యవివాహాలు, పనిచేసే పిల్లలు, చిన్నారులపై హింస వంటి ఘటనలు మీ దృష్టికి వస్తే 1098 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని బాలబాలికలకు సూచించారు. చిన్నారులు ఆట, పాట ఆడే వయస్సులో చదువుకోవాలని పనిచేయడం వారి భవిష్యత్తుకు మంచిది కాదని, ప్రతి ఒక్కరూ బాలల హక్కుల పరిరక్షణకు కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌వో రాములు, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి జ్యోతిపద్మ, గిరిజన సంక్షేమాధికారి కోటాజి, బిసి సంక్షేమాధికారి సుధాకర్, ఇరిగేషన్ అధికారి ఏసయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments