Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఆడపిల్లను కన్నందుకు గెంటేశాడు

trs

రెండవ భార్యను కొట్టి తరిమేసిన అధికార పార్టీ యువనేత
మూడవ భార్యతో కాపురం
పిల్లతో సహా ఇంటి బయట బైఠాయించిన ఓ తల్లి
పోలీసులూ భర్తకే సహకరిస్తున్నారని ఆరోపణ, బోడుప్పల్‌లో ఘటన

 హైదరాబాద్ సిటీబ్యూరో: ఆడ పిల్లను కన్నందు కు ఆమెను భర్త, అత్తామామలు జుట్టుపట్టుకొని నిర్ధాక్షిణ్యంగా ఇంట్లో నుంచి గెంటేశారు. సభ్య సమాజం తల దించుకునే విధం గా చేసిన అత్తారింటి ఘాతుకం మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. కూతురితో కలిసి ఆ మహిళ న్యాయం చేయాలంటూ అత్తారింటి ముందు బైఠాయించింది. దీంతో ఇంటికి తాళం వేసి భర్త, అత్తామామలు పరారయ్యా రు. తన భర్త టిఆర్‌ఎస్ నేత కావడంతో ఈ కేసులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. బోడుప్పల్‌లోని శ్రీనగర్‌కాలనీకి చెందిన శ్రీనివాస్ టిఆర్‌ఎస్ యు వజన విభాగంలో పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం ఇతనికి ఓ అమ్మాయితో పెళ్లి జరిగింది. రెండేళ్ల తరువాత వీరి కాపురంలో విభేదాలు రావడంతో ఆ అమ్మాయి శ్రీనివాస్ నుంచి విడాకులు పొందింది. ఆ తరువాత  నాలుగేళ్ల క్రితం చందానగర్‌కు చెందిన సంగీతను శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల పాప కూడా ఉంది. ఆడ పిల్ల పుట్టిందని సంగీతపై శ్రీనివాస్ కక్ష పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఆమెను నిర్లక్షం చేయడం, ఇంట్లో వేధించేవాడు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ మరో అమ్మాయితో పెళ్లి చేసుకుని ఆమెను ఏకంగా ఇంటికి తీసుకువచ్చాడు. దీంతో అవాక్కైన సంగీత..శ్రీనివాస్‌ను నిలదీసింది. ఆడపిల్లను కన్నందుకే తాను మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని శ్రీనివాస్ ఖరాకండిగా  చెప్పేశాడు. దీంతో సంగీత రెండు నెలల క్రితం మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్‌తో పాటు అతని మూడో భార్య జగదీశ్వర్‌దేవి, చెల్లెల్ని, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీనివాస్ తల్లిదండ్రులు మాత్రం ముందస్తు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. జైలు నుంచి  విడుదలై వచ్చిన తరువాత కూడా శ్రీనివాస్ బుద్ధ్ది మారలేదు. మూడో భార్యను ఇప్పటికి ఇంట్లోనే పెట్టుకుని కాపురం చేస్తుండడంతో రెండో భార్య సంగీత జీర్ణించుకోలేక పోయింది. ఆదివారం ఈ విషయంపై భర్త శ్రీనివాస్‌ను మందలించింది. దీంతో ఆవేశం పెంచుకున్న శ్రీనివాస్ సంగీత జుట్టుపట్టుకుని ఇంట్లో నుంచి కన్నకూతురితో పాటు ఆమెను గెంటివేశాడు. సంగీతను కొడుతున్న దృశ్యాలు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతో శ్రీనివాస్ అసలు స్వరూపం బయట పడింది. అత్తారింటి ముందు ఆమె బైఠాయించి నిరసన తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమె నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనకు న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని సంగీత మీడియాకు చెప్పింది. స్థానిక పోలీసులు కూడా తన భర్తకే సహకరిస్తున్నారని ఆమె ఆరోపించింది.

Comments

comments