Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

మెట్రో సిటిలో పరుగు

Metro

శతాబ్దాల చరిత్ర కాలం ఒడిలో దాచుకుని వైభవానికి ప్రతీకగా నాటి శిలలు, శిల్పాలు మౌనగీతాలు ఆలపిస్తుంటే … కాకతీయుల మట్టికోటతో ప్రారంభమై కుతుబ్ షాహీల గోల్కొండరాజ్యంగా ఘనకీర్తిని సొంతం చేసుకున్న హైదరాబాద్‌లో దశలవారీగా అభివృద్ధ్ది జరుగుతోంది. భాగమతి పేరుతో నిర్మించిన హైదరాబాద్ కుతుబ్‌షాహిలు, ఆసఫ్ జాహీల శతాబ్దాల పాలనలో అభివృద్ధికి ఆనవాలుగా చార్మినార్‌తో పాటు అనేక నిర్మాణాలు చారిత్రక బావుటాలుగా నిలిచి అందాల హైదరాబాద్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది. సుధీర్ఘ చరిత్రను పుణికిపుచ్చుకుని విశనగరంగా అవతరించింది. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. నా నగరంలో మనుషులు సముద్రంలో చేప

పిల్లల్లా తిరగాలన్న కుతుబ్ షాహి రాజుల ప్రార్థనలు నెరవేరి భాగ్యనగరం రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. బస్సులు, రైళ్ళు, ఆటోలు, క్యాబ్‌లు, కార్లు, టూవీలర్లు ఇలా ఎన్నో రవాణాసాధనాలు లక్షలాది ప్రయాణీకులను ఒక మూల నుంచి మరో మూలకు తీసుకువెళ్తున్నా జనం సుఖంగా, వేగంగా వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందిని తీర్చి శరవేగంతో ఈ మూల నుంచి ఆ మూలకు కాలుష్యంలేని పరుగులు తీసేందుకు మెట్రోరైలు పరిగెత్తుకు వస్తోంది. దినదిన ప్రవర్థమానమవుతున్న హైదరాబాద్ నగరం అభివృద్ధి దారుల్లో కూతవేసేందుకు గొంతు సవరించుకుంటోంది. ట్రయల్న్ పేరుతో గగనతల విహారాలు చేస్తూ నగరవాసులను ఊరిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కీర్తి కిరీటానికి అనేక రికార్డులద్ది ఆధునిక హంగులు సొంతం చేసుకుంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తలకెక్కింది.

తూర్పు పడమరల అనుసంధానం
హైదరాబాద్ అందాలకు సరికొత్త నగిషీలు దిద్దుతూ కీర్తి తోరణంగా రాణిస్తోంది..నగరమంతా పరుగులు తీయాల్సిన మెట్రో తొలిదశలో తూర్పుపడమరలను ఏకం చేస్తూ నాగోలు నుంచి మియాపూర్ వరకు సిద్ధమైన 30 కి.మీ. మెట్రో కారిడార్‌లో సేవలందించేందుకు సిద్ధమైంది. ఈ మార్గంలో 24 రైల్వేస్టేషన్ల నిర్మాణం జరిగింది. ఇప్పుడున్న ఇరుకు దారులు, గోతులు, స్పీడుబ్రేకర్లు, ఇరుక్కుపోయే వాహనాలను ఛేదించుకుంటూ నాగోలుమియాపూర్ వెళ్ళాలంటే అథమ పక్షం 2గంటల సమయం సమయంపడుతుంది. అదే మెట్రోలో వెళ్తే గంటలో చేరతారు. ప్రయాణాలు కుదుటపడ్డాక ఈ సమయాన్ని 45 నిమిషాలకు కుదిస్తారు. అలాగే ఆరంభంలో ప్రతి 10 నిమిషాలకు ఒక మెట్రోను నడిపి సగటున రోజుకు రెండులక్షల మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చాలని సంకల్పించారు. కానీ జనంలో ఉన్న క్రేజువల్ల ఈ సంఖ్య 3 లక్షలకు చేరే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

విమానంలాంటి ప్రయాణం
ఇతర నగరాలలో తిరుగుతున్న మెట్రోరైళ్ళకు భిన్నంగా మరింత ఆధునికంగా మెట్రోరైళ్ళను, స్టేషన్లను నిర్మించారు. సదుపాయాల విషయంలో కానీ, భద్రతా పరమైన అంశాలలో కానీ అనేక జాగ్రత్తలు చేపట్టారు. మెట్రో ప్రయాణం ఒక మరపురాని అనుభవంగా ఉండిపోవాలని బలంగా కోరుకుంటూ అనేక చర్యలు తీసుకున్నారు. హుందై షోరూంనుంచి 57 రైళ్ళను కొనుగోలు చేశారు. ఒక్కో మెట్రో రైలుకు మూడు కార్లు ఉంటాయి. ఉంటాయి..(మెట్రోరైలు పరిభాషలో బోగీని కారు అంటారు) ఇప్పటికే 1800 కోట్ల రూపాయలు వెచ్చించి 171 కార్లు కొనుగోలుచేశారు. ఇప్పటికే ఇవి ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోలకు చేరాయి. డిమాండ్ పెరిగితే మరిన్ని రైళ్ళు తెప్పించేందుకు సన్నాహాలు చేశారు.

సమాచారం…సౌకర్యం
ఏ.సి. మెట్రో కోచ్ లో నిమిషాల వ్యవధిలో ప్రయాణం ఉండటంతో ప్రయాణికులు అలసటకు దూరంగా ఉంటారు. అలాగే ప్రయాణికులకు సంబంధించిన ప్రకటనలతో పాటు రాబోయే స్ట్టేషన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రకటిస్తారు. ప్రయాణీకులకు టైమ్ పాస్ కోసం వినోదచిత్రాలు ప్రదర్శిస్తారు. గమ్యస్థానం ఇంకెంత దూరంలో ఉందో చెప్పేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ల్యాప్‌టాప్, సెల్ పోన్ ఛార్జింగ్ పాయింట్స్ రైళ్ళలో ప్రత్యేకంగా అమర్చారు. విద్యుత్ అంతరాయం కలిగితే గంటపాటు పనిచేసే బ్యాటరీ బ్యాకప్ ఉంది. గంటకు 80 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే మెట్రో కు కిలో మీటరుకు ఒక స్టేషన్ ఉంది. కొన్ని చోట్ల ఈ దూరం పెరిగింది. మరికొన్నిచోట్ల తగ్గింది. కనుక రైలు ప్రయాణ వేగం33 కిలో మీటర్లకు కుదించారు. సాధారణ రైల్వేస్టేషన్ల లో 20 సెకన్లు, టర్మినల్ స్టేషన్ల లో 30 సెకన్లు ఆగుతూ మెట్రో ప్రయాణిస్తుంది. ట్రైన్ లో 126 మంది కూర్చోడానికి 848 మంది నిలబడి ప్రయాణించేందుకు వీలుగా బోగీలను డిజైన్ చేశారు.

కాలుష్యంలేని పరుగులు
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కాలుష్యం సవాళ్ళను విసురుతుంది. విశ్వనగరస్థాయికి చేరే నగరాల్లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. నగరజీవనాన్ని చుట్టుముట్టే అనేక రకాల కాలుష్యాలలో ఆటోమెుబైల్ కాలుష్యం ప్రధానమైనది. ఆ తర్వాత స్థానంలో పారిశ్రామిక కాలుష్యం నిలుస్తోంది. కాలుష్యం వెదజల్లని రవాణావ్యవస్థ కోసం గాలిస్తున్న సమయంలో మెట్రో అందివచ్చింది. హైదరాబాద్ నగర విస్తీర్ణం 625 చ.కి.మీ. జనాభా 10 మిలియన్లు. అంటే కోటి మంది. 2021 నాటికి ఇది 1.36 కోట్లకు చేరే అవకాశముందని అంచనా! అలాగే హైదరాబాద్ నగరంలో 5మిలియన్ల వ్యక్తిగత వాహనాలున్నాయి. యేటా 0.50 మిలియన్ల వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్ళు, దుకాణాలు బద్దలుకొట్టుకుంటూ రోడ్లను వెడల్పు చేస్తూ పోవడం దీర్ఘకాలంలో సాధ్యంకాకపోవచ్చు. రోడ్లు విస్తరించకపోతే కారు కాదు కదా మనిషి కాలు కూడా కదపలేని పరిస్థితి ఎదురవుతుంది. ఈ స్థితిలో కాలుష్యానికి చెక్‌పెడుతూ కాలహరణం లేకుండా ప్రయాణాలు చేయగల నేర్పు ప్రస్తుతానికి ఒక్క మెట్రోకే దక్కింది. భవిష్యత్తులో పాడ్‌ట్యాక్సీ వస్తే మరోసారి నగరం సంచలనంగా మారుతుంది.

ప్రతిక్షణం నిఘానేత్రం….
సుసంపన్నమైన వారసత్వ కట్టడాలను, నింగికెగిసిన ఆకాశహర్మాలను విభిన్న కోణాల్లోంచి చూపిస్తూ ,హైదరాబాద్‌ను మల్టీడైమెన్షన్‌లో చూపించేందుకు మెట్రో ఒక సాధనమవుతుంది. ఎన్ని సుందరస్వప్నాలను కంటి ముందు సాక్షాతరింపజేసినా ప్రయాణికుల భద్రత, క్షేమం విషయంలో మెట్రో ఏ రకంగానూ రాజీ పడడంలేదు. ఆధునిక డేగ కళ్ళతో మెట్రోనగరాన్ని వీక్షిస్తూ ఆపరేటర్‌కు సంకేతాలు పంపుతూ అప్రమత్తం చేస్తుంది. మెట్రో రైలు ఆపరేషన్ కంట్రోల్ రూం అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా సాంకేతికతను ఏర్పాటుచేసుకుంది. మెట్రో రైలు నెట్ వర్క్ 3 కారిడార్ల లో 72 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. ప్రతి కారిడార్‌లో రైలు ప్రయాణాన్ని ఆపరేషన్ కంట్రోల్ రూం పర్యవేక్షిస్తుంది.

రైలు కదలిక, విద్యుత్ సరఫరా, స్టేషన్ పనితీరు, పరికరాలను, పరిసరాలను సి.సి. టి.వి ల ద్వారా ఇంజనీర్లు పర్యవేక్షిస్తుంటారు. ఇక్కడ అత్యాధునిక సిమిలేటర్లు ఉన్నాయి. వీటిని ఆపరేట్ చేయడంలో అత్యంత నిపుణులైన శిక్షకుల వద్ద సిబ్బంది శిక్షణ పొందారు. రైలు కదలికలను వివిధ కమ్యూనికేషన్ మాధ్యమాల ద్వారా ఒ.సి.సి తో అనుసంధానం చేశారు. స్టేషన్ నుంచి రైలు బయలు దేరేముందు ప్రతి ట్రైన్ ఆపరేటర్ తప్పనిసరిగా శ్వాస పరీక్ష చేయించుకుంటారు. అలాగే ట్రైన్ ఆపరేటర్ వెళ్ళే గమ్యస్థానం సూచనలు చదవాలి. రూట్ మ్యాప్‌ను పరిశీలించాలి. అనంతరం ఇంజనీర్ల సూచనల మేరకు సలహాలను గౌరవిస్తూ రేడియోసెట్, తాళాలు తీసుకుని ట్రైన్ ఎక్కాలి. నిర్ణీత సమయంలో ట్రైన్లను తనిఖి చేసేందుకు, మైంటెనెన్స్ వ్యవహారాలు చూసేందుకు నిర్వహణ షెడ్లు, ఇన్స్‌క్షన్ లైన్లు ఉన్నాయి. డిసిల్ సెంటర్లు, రిస్క్ ఆపరేషన్స్ వాహనాలు, వర్క్ షాపులు ఉన్నాయి.

రిస్క్ ఆపరేషన్స్….
ఎలాంటి అత్యవసరపరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రిస్క్ ఆపరేషన్ బృందాలు 24 గంటలు అప్రమత్తంగా ఉంటాయి. రైలు బయలు దేరినప్పటినుంచి గమ్యస్థానం చేరేంతవరకు పటిష్టమైన నిఘా ఉంటుంది. రైలు కదలికలన్నీ నిఘా బృందాల కనుసన్నలలోనే ఉంటాయి. అత్యవసర పరిస్థితులలో ఉపయోగించడానికి ప్రత్యేకమైన ఆపరేషన్ వాహనాలున్నాయి. ఈవాహనాల్లో అత్యవసరపరికరాలు, నిపుణులైన సిబ్బంది ఉంటారు. తనిఖీ ఇంజనీర్లు ఉంటారు. ఈ అత్యవసరవాహనాలు ట్రైన్ పట్టాలపై సాధారణ విద్యుత్తు, సోలార్ విద్యుత్తు, బ్యాటరీతో నడుస్తాయి. రైలు పట్టాల పైనే కాకుండా అవసరమైతే రోడ్ల పై కూడా నడిచేందుకు ప్రత్యేక వాహనం కూడా ఉంది. రోడ్లు, రైలుపట్టాలన్న తేడా లేకుండా అత్యవసర సహాయం అందించేందుకు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వాహనం ఉండం హైదరాబాద్ మెట్రోకే సాధ్యమైంది. మెట్రో ట్రైన్లు, స్టేషన్లు పరిశుభ్రంగా ఉంచేందుకు సైతం హైఎండ్ టెక్నాలజీని వినియోగించనున్నారు. రైలు నడుస్తుండగానే శుభ్రం చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ఇందువల్ల ఎంతో సమయం ఆదా అవుతుంది.

వేగమే విద్యుత్తు
ఆధునిక సాంకేతిక పద్ధతులతో వేగాన్ని విద్యుత్‌గా మార్చి ట్రైన్ కు వినియోగించే సరికొత్త విధానం మన మెట్రోకు ఉంది. 132 రిసీవింగ్ సబ్ స్టేషన్ నుంచి 25 కె.వి. బఫర్ హెడ్ పరికరాలకు విద్యుత్ సరఫరా చేస్తారు. ఈవిద్యుత్ తో ఎక్స్ లేటర్స్, ఎ.సి .విద్యుత్ సరఫరా లో అంతరాయం కలగకుండా ప్రత్యేక జాగ్రతలు తీసుకుంటారు. ట్రైన్ ఆపరేటర్ ట్రైన్ ఎక్కగానే మెుదట అన్ని పరికరాలను తనిఖీచేస్తారు. ఇందుకోసం ప్రధానంగా మూడుపద్ధతులను అనుసరిస్తారు. ఇందులో ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్, ఆటోమేటిక్ రక్షణ, నియంత్రణపద్ధతి ఉంటాయి.

విద్యుత్ రీజనరేటర్.. విద్యుత్ బ్రేకింగ్ విధానంలో వేగాన్ని విద్యుచ్ఛక్తిగా మార్చి తిప్పి పంపుతారు. ఈవిధానం వల్ల గ్రిడ్ నుంచి విద్యుత్ తీసుకునే అవసరం తగ్గుతుంది. అతి తక్కువ మైంటెనెన్స్ తో ప్రయాణికులకు అత్యంత ఎక్కువ సౌకర్యాలు ఉండేవిధంగా మెట్రో రూపుదిద్దుకుంది. సంప్రదాయ సిగ్నలింగ్ వ్యవస్థకు భిన్నంగా రైలు కచ్చితంగా ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు సి.వి.టి.సి టెక్నాలజీ ఉంది. ఈ ఘనత ఒక్క హైదరాబాద్ మెట్రోకే దక్కుతుంది. దేశంలో ఇంకెక్కడా ఇలాంటి సాంకేతికతను వినియోగించలేదు. ప్రయాణికులు రైలు ఎక్కడానికి అనేక మార్గాలున్నాయి. ఎక్స్ లేటర్స్, మెట్ల ద్వారా, ఎలివేటర్స్ ద్వారా మెట్రో స్టేషన్ కు చేరుకోవచ్చు. అలాగే ప్రయాణికుడు స్టేషన్‌కు చేరుకోగానే భద్రతాపరమైన చర్యలు మెుదలవుతాయి. బ్యాగులను, లగేజిని స్క్రీనింగ్ చేస్తారు. ప్రజాసమాచారం, పబ్లిక్ సెక్యూరిటీ, ఫైర్ సర్వీసు అడుగడుగునా అగుపిస్తాయి. ప్రతిస్టేషన్ లో 64 సి.సి.కెమేరాలున్నాయి. వీటి ద్వారా రికార్డు చేసిన ఫుటేజ్ మూడునెలల పాటు భద్రంగా ఉంటుంది.

మహిళా ఆపరేటర్స్….
హైదరాబాద్ అందాలను సృజిస్తూ వేగవంతంగా ప్రయాణించే మెట్రో రైలు ఆపరేటర్స్ గా మహిళలకు ఎల్.ఎన్.టి.సి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులను దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేశారు. కమెండోల కంటే కఠిన శిక్షణ ఇచ్చి ఆపరేటర్లుగా నియమించారు. అన్నిరంగాల్లో సముచితస్థానాన్ని ఆక్రమించుకున్న మహిళలు మెట్రో ఆపరేటర్స్‌గా దేశంలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. విపత్కర పరిస్థితులను సైతం ఎదుర్కొనే ఆత్మస్థైర్యం, వృత్తి నైపుణ్యం. ఆధునిక శిక్షణ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్న మహిళలు మెట్రో ఆపరేటర్లుగా విధులు నిర్వహించడం ప్రత్యేకత.

Comments

comments