Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

త్వరితగతిన మార్గదర్శకాల అమలు

schహైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ‘స్వచ్ఛ్ సర్వేక్షన్-2018’ మార్గదర్శకాలను త్వరితగతిన అమ లు చేయాలని మున్సిపల్ శాఖ స్థానిక సంస్థలను అప్రమత్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పొందుపర్చిన సుమారు 37 అంశాలను నిర్ధేశించిన గడువులోపు పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశించింది. కేంద్ర మార్గదర్శకాలను అమలు చేసిన స్థానిక సంస్థలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ర్యాంకులను నిర్ధారించనుంది. స్థానిక సంస్థలు మంచి ర్యాంకు లు సాధించాలని మున్సిపల్ శాఖ భావిస్తున్నది. మార్గదర్శకాల్లో ప్రధానంగా పారిశుధ్య అంశాలకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగం గా ఇదివరకే స్థానిక సంస్థలు అనేక కార్యక్రమాలను, పారిశుధ్య పనులను చేపడుతున్న స్థానిక సంస్థలకు అదనంగా “స్వచ్ఛ్ సర్వేక్షన్–2018” మార్గదర్శకాలు అమలు చేయడం కష్టసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. సిబ్బంది కొరతతో రోజువారి కార్యకలాపాలను నిర్వహించడమే ఇబ్బందిగా మారిన నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయడం పెద్ద సవాలుగా మారుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా కేంద్ర మార్గదర్శకాల అమలుపై స్థానిక సంస్థల కమిషనర్లు, ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షించాలని మున్సిపల్ శాఖ సూచించింది. స్థానికంగా జరుగుతున్న పనుల తీరును ప్రాంతీయ ఉన్నతాధికారులు నిత్యం ఆరా తీయాలని స్పష్టం చేసింది. గృహ సముదాయాల మొత్తం వివరాలు, మరుగుదొడ్లు, మంచినీటి కనెక్షన్ల వివరాలకు సంబంధించిన నివేదికను సిద్ధం చేయాల్సి ఉంటుంది. కేంద్ర మార్గదర్శకాలు ఇవే: స్థానిక సంస్థల పరిధిలో తడి, పొడి చెత్తను వేరు చేయడంతోపాటు దీనిపై పబ్లిక్ హెల్త్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. వార్డులవారీగా వాణి జ్య ప్రాంతాల నుంచి వచ్చే చెత్త, అందుకు ఉపయోగిస్తు న్న సిబ్బంది, వారి హాజరు శాతం తదితర వివరాలను సేకరించాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలుగా వార్డుల వారీగా వాణిజ్య, నివాస ప్రాంతాల నుంచి సేకరిస్తున్న చెత్త వివరాలనూ జత చేయాల్సి రోజువారి చెత్త సేకరణ, అందుకు ఉపయోగిం చే రవాణ ట్రిప్పులు, క్షేత్రస్థాయిలో చెత్త పేరుకుపోతున్న ప్రాంతాన్ని గుర్తించి, వాటి సుందరీకరణకు తగిన చర్య లు తీసుకోవాలి. పారిశుధ్య పనులపై క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిపై జరిమాన విధించి, వాటి నుంచి వచ్చే మొత్తం నిధులను లెక్క చూపాలి. పార్కులు, గార్డెన్‌లలో సేకరిస్తున్న చెత్త సామర్థంతోపాటు చెత్త సేకరణకు స్థానిక సంస్థలు తీసుకుంటున్న చర్యల పత్రాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు అందజేయాలి. సానిటరి ఇన్‌స్పెక్టర్లు, ఆపై స్థాయి అధికారులు ‘ఈలెర్నింగ్’లో స్వచ్ఛ్ భారత్ మిషన్ పోర్టల్‌లో శిక్షణ తీసుకోవల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం నిబంధలను విధించింది.

Comments

comments