Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

ట్రంప్ ఆటలో భారత్ ఓ పావు!

modi-cartoon

చైనాను అడ్డుకోవడానికి జపాన్, ఆస్ట్రేలియాతోపాటు భారత్ కూడా తన మిత్రకూటమిలో చేరాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారు. అయితే అమెరికాలో నివసిస్తున్న భారతీయుల ప్రయోజనాలను పరిరక్షించడాన్ని మాత్రం ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఈ ద్వంద్వవైఖరి విస్మయం గొలుపుతోంది. ఒక పక్క అమెరికాకు మిత్రదేశంగా భారత్ ఉండాలని కోరుకుంటూ భారతదేశానికి గాని, భారతీయులకు గాని సహాయం చేయడానికి మాత్రం ఆయన తయారుగా లేరు. కేవలం చైనాతో శతృత్వం దృక్కోణంలో భారత్ గురించి ఆయన ఆలోచిస్తున్నారు తప్ప భారత్ ప్రయోజనాల దృక్కోణంలో కాదు. ముస్లిం దేశాలపై విరుచుకుపడుతున్న ట్రంప్ పాకిస్థాన్ పట్ల మాత్రం మెతకవైఖరి అవలంబిస్తున్నారు. టెర్రరిస్టుల స్వర్గధామంగా మారిందని మాత్రమే దానిని తప్పుపడుతున్నారు. అమెరికా అధ్యక్ష పదవిని ట్రంప్ చేపట్టాక భారత్‌పట్ల మిత్ర వైఖరిని మానేశారు. అమెరికాలో నివసిస్తున్న పెద్దసంఖ్యలోని భారతీయులు తగిన ఉద్యోగం దొరికితే భారత్‌కు తిరిగి వచ్చేయాలని అనుకుంటున్నారు. హెచ్1బి వీసాలపట్ల కూడా ట్రంప్ వైఖరి మోసపూరితంగా ఉంది. భారత్‌పట్ల ఆయన కనబరుస్తున్న ప్రేమ చేతలలో ఎంతమాత్రం లేదు. కేవలం జాతి, రంగు దృష్టితో భారత్‌ను దూరంపెట్టే వైఖరిని ఆయన అవలంబిస్తున్నారు.
భారత్‌లో ఉద్యోగాలు ఆశిస్తున్న ఇండియన్‌అమెరికన్‌ల సంఖ్య డిసెంబర్‌మార్చి మధ్యలో పదిరెట్లు పెరిగింది. డెలాయిట్ టచ్ తోమత్సు ప్రైవేట్ లిమిటెడ్ అధ్యయనంలో ఈ సంగతి తేలింది. నిపుణ కార్మికులకు ఉద్యోగ వీసాలను విపరీతంగా ట్రంప్ ప్రభుత్వం కట్టడి చేస్తున్న తరుణంలో ఈ విశ్లేషణ వెలువడింది. హెచ్1బి వీసా కార్యక్రమాన్ని సమీక్షించాలని ఆయన పిలుపు నిచ్చారు. అమెరికన్ కార్మికులను తొలగించి విదేశీ కార్మికులతో కంపెనీలను నింపేలా ఆ వీసా కార్యక్రమం ఉండకూడదన్నది ఆయన లక్షం. భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు తీవ్రస్థాయిలో పడిపోతున్న తరుణంలో అమెరికానుండి వెనక్కి రావాలని భారతీయులు కోరుకుంటున్నారు. దీనితో వారి రాక పెద్ద గుర్తింపు సంక్షోభానికి కారణమయ్యే నేపథ్యం నెలకొంది. అమెరికాతో పోలిస్తే భారత దేశంలో వేతనాల వ్యవస్థ అత్యంత కనాకష్టం. ఉద్యోగాలు కోరుకుంటున్న అమెరికా భారతీయులు మన యాజమాన్యాలు, కంపెనీలకు స్వదేశీ నిరుద్యోగుల కంటే అత్యంత ఆకర్షణీయంగా మారారు. ఈ రకంగా అమెరికా నుంచి తిరిగి
వస్తున్న భారతీయులు స్వదేశంలో నిరుద్యోగ యువత భారీ ఎత్తున పెరగడానికి కారణమౌతున్నారు. ‘స్వేచ్ఛాయుత, దాపరికం లేని ఇండోపసిఫిక్’ ప్రాంతం నిర్మాణానికి పిలుపునిస్తూ ట్రంప్ ఇటీవల తన ఆసియా పర్యటనను ప్రారంభించారు. ఆసియా పట్ల అమెరికా కొత్త కార్యాచరణ ప్రణాళికను చైనా ఒక సవాలుగా చూడవచ్చు. అసలు ఇండోపసిఫిక్ సహకార సూత్రం మొదటగా జపాన్ సూచించింది. తరువాత ఆ సూచనను ఆ ప్రాంతంలోని మరిమూడు ప్రజాస్వామ్య దేశాలైన ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాలను కూడా కలుపుకోవడం ద్వారా చైనాను కట్టడి చేయడానికి అమెరికా విదేశాంగమంత్రి టిల్లర్‌సన్ సొంతం చేసుకున్నారు. భారతదేశపు 110 బిలియన్ డాలర్ల ఐటి సేవల ఎగుమతి పరిశ్రమకు అమెరికా పెద్ద మార్కెట్ కావడంతో దాని కొత్త వలసల నిరోధ బిల్లు వల్ల భారత బడా ఐటి కంపెనీలు దెబ్బతింటున్నాయి. వాటిలో ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో కూడా ఉన్నాయి. వాటన్నింటిలో 35 లక్షలమంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికా కాలేజీలలో భారతీయ విద్యార్థుల చేరికను కూడా ఆ బిల్లు దెబ్బతీసింది. అమెరికా కొలీజియేట్ రిజిస్ట్రార్‌లు, ఎడ్మిషన్స్ అధికారుల సంఘం(ఎఎసిఆర్‌ఎఒ) జరిపిన ఒక సర్వేలో అక్కడి 25 శాతం కళాశాలలకు భారత్‌నుంచి దరఖాస్తులు బాగా తగ్గినట్లు తేలింది. చైనాతో మధ్య భారత్ విధించిన యాంటీ డంపింగ్ సుంకాలతో అక్కడి బీజాలు పడినట్లు కనిపిస్తోంది. 93 రకాల చైనా ఉత్పత్తుల దిగుమతులపై భారతప్రభుత్వం ఈ సుంకాన్ని ఇటీవల విధించడంతో రెండింటి మధ్య వాణిజ్య విముఖత మొదలైంది.
మోడీ ప్రభుత్వ తప్పుడు ఆర్థిక విధానాలు, ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు, ఉభయ దేశాల వాణిజ్య సంబంధాలలో చైనాకు పై చేయి కట్టబెట్టింది. చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ మహాసభలు జరుగుతుండగా భారత్ వ్యతిరేక సూచనలను అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్లోబల్ టైమ్స్ పత్రిక రాసింది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడంలోని ప్రమాదాలను చైనా గమనించాలని, భారతప్రభుత్వం అనాలోచితం గా విధించిన సుంకాల పర్యవసానాలకు సిద్ధంగా ఉండాలని ఆ పత్రిక సూచించింది. పాలకుల అనుమతి లేకుండా ఆ పత్రిక ఆ సూచనలు చేసి ఉండదు. చైనాకు భారతీయ ఎగుమతులు ఏటేటా 11.75బిలియన్ డాలర్లు(12.3శాతం)తగ్గిపోతున్నట్లు కూడా ఆ పత్రిక రాసింది. మరోపక్క చైనా నుంచి భారత్‌కు దిగుమతులు మాత్రం రెండు శాతం పెరిగి 59 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో ఇరుదేశాల మధ్య 47 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడింది.
చైనాతో ఆర్థిక యుద్ధాన్ని భారత్ కొనసాగిస్తే దాని ఆర్థిక వ్యవస్థ కొద్దిగా ఆటుపోట్లకు గురికావచ్చు. కాని భారత్ మాత్రం తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో అమెరికా తన స్వప్రయోజనాలు ఆశించి చైనాతో వైరాన్ని పెంచుకుంటూ, భారత్‌ను చైనాకి వ్యతిరేకంగా చేరదీయాలని చూస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా చర్యలను అమెరికా తప్పుపడుతోంది. అమెరికా, భారత్‌లు సమర్థిస్తున్న అంతర్జాతీయ సూత్రాలకు అది విరుద్ధమని వాదిస్తోంది. ప్రస్తుతం భారతదేశ పాలకులు అమెరికా చెప్పుచేతల్లోకి దేశాన్ని తీసుకుపోతున్నారనడం ముమ్మాటికీ నిజం. భారత్‌పై అందుకు ఒత్తిళ్లు ఏమీ లేనప్పటికీ ఇది సాగుతోంది. అమెరికా భారత్ ప్రయోజనాల కోసం సమ్మిళిత వైఖరిని ట్రంప్ చేపడుతారన్న భరోసా లేదు. మోడీ జరిపిన అనేక అమెరికా యాత్రలవల్ల ఒరిగినదేమీ లేదన్నది వాస్తవం. 1990దశకంనుంచి చైనా ఎదుగుదల అప్రతిహతంగా సాగుతుండడంతో అమెరికా క్రమంగా భారత్‌ను చేరదీయడం మొదలుపెట్టింది. చైనాతో సరిహద్దు సమస్యను భారత్ ఇంతకుముందు స్వయంగా చూసుకోగలిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో చైనానుంచి వస్తున్న సంకేతాలు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పకతప్పదు.
                                                                                                                                                                                    * అరుణ్ శ్రీ వాస్తవ (ఐపిఎ సర్వీస్)

Comments

comments