Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అమానుష ‘మానస్’

edt3

పపువా న్యూ గినియా 1973 డిసెంబర్ 1న స్వీయ పాలన కిందకు వచ్చింది. 1975లో ఐక్యరాజ్యసమితిలో చేరింది. 1977లో జాతీయ ఎన్నికలు జరిగి మైఖేల్ సొమారే ప్రధాని అయ్యారు. ఆ తర్వాత అనేక ప్రభుత్వాలు మారి నేడు పీటర్ ఓనీల్ పాలనలోకి పిఎన్‌జి వచ్చింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నియమాలను ఆ దేశం మానస్ శరణార్థి బందీల విషయంలో ఉల్లంఘించడాన్ని పలు దేశాలు విమర్శిస్తున్నాయి.  

పపువా న్యూ గినియా (పిఎన్‌జి)లోని ‘మానస్’ దీవిలో ఆస్ట్ట్రేలియా నడుపుతున్న శరణార్థి బందీ ల కేంద్రంలో తీవ్ర మానవతా సంక్షోభం గత 11 రోజులుగా నెలకొంది. ఆ కేంద్రంలో దాదాపు 600 మంది పురుష శరణార్థులు దుర్భర పరిస్థితులలో ఉన్నారు. ఆశ్రయం కోరి వచ్చిన వారిని తమదేశంలో అడుగుపెట్టకుండా వెనక్కి తరలించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వారిని వెళ్లిపోవలసిందిగా పపువా న్యూ గినియా ప్రభుత్వం బెదిరిస్తోంది. అమానవీయ పరిస్థితులు ఉన్న అక్కడి నుంచి మరింత దుర్భర పరిస్థితులు ఉన్న ఇతర చోట్లకు తమను తరలించే ప్రభుత్వ యత్నాలకు భయపడి వారంతా తమకు తాము గిరి గీసుకొని ఆ బందీల కేంద్రంలో ఉంటున్నారు. తమను అక్కడినుంచి తరలించే యత్నాలనువారు గట్టిగా నిరసిస్తున్నారు. పిఎన్‌జి వలస-పౌరసత్వ సర్వీసుల అథారిటీ ఆ బందీలను తరలి పోవాలని హెచ్చరించింది. ఇంతకు ముందు గడువును ఆ దేశం ఒక్కరోజు పొడిగించడంతో ఆదివారందాకా ఆ బందీలకు గడువు లభించింది.
ఆ దీవిలో ఇది అత్యంత తీవ్ర మానవతా సంక్షోభాన్ని రగిల్చినట్లు ఆస్ట్రేలియా రాజకీయ కార్యకర్త ఇయాన్ రింటోల్ హెచ్చరించారు. అక్కడ చాలా దుర్భర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఉద్రిక్తత కూడా తీవ్రంగా ఉంది. మానస్ దీవిలోని ఇతర ప్రాంతాలకు తమను తరలిస్తారని శరణార్థులు భయపడుతున్నారు. ఆస్ట్రేలియా, పిఎన్‌జి ప్రభుత్వాలు ఆ వలస బందీల కేంద్రాన్ని శాశ్వతంగా మూయించడానికి ప్రయత్నిస్తూ బందీలతో తలపడుతున్నాయి. ఇది తీవ్ర మానవతా సంక్షోభానికి దారి తీస్తోంది. తాము బయటకు వచ్చీరాగానే మానస్ దీవి స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని వారు భయపడుతున్నారు. స్థానికుల దాడిలో ఇటీవల ఒక శరణార్థుడు మరణించడమే వారి భయాలకు కారణం.
తరలింపును యత్నాలకు నిరసన
ఆ శిబిరంనుంచి మూడు మజిలీల ద్వారా తమ ను తరలించే యత్నాలను వారు అందుకే ప్రతిఘటిస్తున్నారు. ఆ తరలింపు కూడా తాత్కాలిక కేంద్రాలకే. మానస్ కేంద్రంలో అన్ని సేవలను అక్టోబర్ 31న బంద్ చేశారు. విద్యుత్, నీటి సరఫరాను కూడా మూసివేశారు. అక్కడ మరుగుదొడ్లు లేనే లేవు. మంచి నీరు కూడా అందకుండా చేశారు. ‘ఈ కేంద్రం ఆవరణ నుంచి స్వచ్ఛందంగా వేరే కేంద్రాలకు తక్షణం తరలి వెళ్లాలి. లేకుంటే బల ప్రయోగం తప్పదు. పొంగి పొరలుతున్న మురుగు నీటి కాల్వలు, పేరుకున్న చెత్తా చెదారం, పరిశుభ్ర నీటి సరఫరా లోపం, ఆహారం, విద్యుత్ కొరవడిన ఇప్పటి పరిస్థితులలో వ్యాధులు ప్రబలే ప్రమాదం పెరిగింది’ అని హెచ్చరిస్తూ పిఎన్‌జి అధికారులు ఆ శరణార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.
అఫ్గానిస్థాన్, ఇరాన్, మయన్మార్, పాకిస్థాన్, శ్రీలంక, సిరియాలనుండి ఆశ్రయం కోరి వచ్చిన పురుషులు ఆ బందీల శిబిరంలో ఉన్నారు. దానిని మూసివేసే యత్నాలనువారు గట్టిగా ప్రతిఘటిస్తున్నారు. తమ ఆహార నిల్వలు తరిగిపోయాయని, నీటికోసం వర్షాలపై ఆధారపడుతున్నామని, దాదాపు 100 మందిదాకా రోగ గ్రస్థులయ్యారని వారు మొరపెడుతున్నారు. ఆ కేంద్రం చుట్టూగల దడిని కూల్చేసే పనిని అధికారులు ప్రారంభించారు. ఇరాన్ నుంచి వచ్చిన ఒక కుర్దిష్ జర్నలిస్ట్ మానస్ దీవిలో 4ఏళ్ల నుంచి బందీగా ఉన్నారు. కేంద్రాన్ని ఎత్తివేసే పని మొదలైనట్లు ఆయన చెప్పారు. ఆ పనిని బందీలు ఎంతో భయాందోళనలతో తిలకిస్తున్నారు.
‘భారమైతే వేరే దేశానికి పంపండి’
అయినప్పటికీ ఆ ప్రదేశాన్ని వీడి వెళ్లేదిలేదని గట్టి గా చెబుతున్నారు. ఐదేళ్ళనుంచి వారు అక్కడ నానా కష్టాలు పడుతున్నారు. ‘మీకు మేము అంత భారంగా తోస్తే వేరే దేశానికి పంపించండి’ అని ఆ బందీలు ఆస్ట్రేలియా, పపువా న్యూగినియా ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. సముద్రాన్ని దాటివచ్చే శరణార్థులకు ఆశ్ర యం నిరాకరిస్తున్న ఆస్ట్రేలియా మానస్ దీవిలో వలసబందీల కేంద్రాన్ని నడుపుతూ వారు ఎన్నటికీ తమ దేశంలోకి అడుగు పెట్టలేరని కఠినంగా చెబుతోంది. వారు శరణార్థులని గుర్తించినప్పటికీ అనుమతించబోమని, అలా చేస్తే ఆసియా నుంచి దొంగ రవాణాదారులు కూడా వచ్చి పడతారని ఆస్ట్రేలియా చెబుతోంది.
మానస్ కేంద్రం అక్రమమని పిఎన్‌జి హైకోర్టు గత ఏడాది తీర్పు చెప్పింది. దానితో ఆస్ట్రేలియా నిధులతో నడుస్తున్న భద్రతా సిబ్బందిని ఉపసంహరించాక అక్టోబరు 31న అది సేవలను నిలిపివేసింది. 2001లో అది ప్రారంభమయి కొంతకాలం పిఎన్‌జి సైన్యం అధీనంలో నడిచింది. తిరిగి సైన్యానికి ఆ కేంద్రం నిర్వహణను అప్పగిస్తామని ఆ ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన వారిని అరెస్టు చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వపనికి అడ్డుతగిలిన వారిని తగిన విధంగా అరెస్టు చేసేందుకు చర్య లు తీసుకుంటున్నామని పిఎన్‌జి ప్రధాని పీటర్ ఓనీల్ హెచ్చరించారు. ఆ కేంద్రం వద్ద పరిస్థితి అవాంఛనీయంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని ఆస్ట్రేలియా వలసల శాఖామంత్రి పీటర్ డ్యూటన్ చెప్పారు.
ఆ కేంద్రం వద్ద సేవలను పునరుద్ధరించాలని కోరుతూ బందీ ఒకరు అప్పీల్ చేసుకోగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆహారం, నీరు, వైద్యసేవలు తక్షణం పునరుద్ధరించాలని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసినప్పటికీ సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. బందీలతరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు తీర్పును త్వరలో సవాలు చేయనున్నారు.ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆశ్రయం కోరి వచ్చినవారిపట్ల క్రూరంగా వ్యవహరించడాన్ని అంతర్జాతీయ క్షమా సంస్థ, ఐక్యరాజ్య సమితికి చెందిన పలు సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆ దేశపు కఠిన వైఖరి శరణార్థులకు అనుకూలంగా ఆ దేశంలో పెద్ద ఉద్యమం తలెత్తడానికి కారణమయింది. శరణార్థులపట్ల దాయదాక్షిణ్యాలు లేని క్రూరవైఖరిని అవలంబించడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఆస్ట్రేలియా మితవాద ప్రభుత్వం ఆశిస్తోం ది.
ఆస్ట్రేలియాలో బందీల అనుకూల ప్రదర్శనలు
శరణార్థుల అనుకూల ప్రదర్శనలు ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి. అయితే మానస్ దీవిలో స్థానికులు కొందరు శరణార్థులను వ్యతిరేకిస్తూ దాడులు జరుపుతున్నా, చాలా మంది పిఎన్‌జి ప్రభుత్వాన్నే తప్పుబడుతున్నారు. శరణార్థులను తిరిగి ఆస్ట్రేలియాకే నేరుగా తరలించాలని కూడా స్థానికులు కోరుతున్నారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో సీటును ఇటీవల సంపాదించిన ఆస్ట్రేలియా ఆశ్రయం కోరి వచ్చిన వివిధ దేశాల ప్రజలపట్ల అనుసరిస్తున్న వైఖరిని ప్రపంచంలోని అనేక దేశాలు తప్పుపడుతున్నాయి. మానవ హక్కులను అవహేళన చేయడంగా దీనిని అభివర్ణిస్తున్నాయి. ఏ రకంగానూ రక్షణలేనివారిపై ఆస్ట్రేలియా క్రూరంగా వ్యవహరించడాన్ని దేశాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. పపువా న్యూ గినియా 1973 డిసెంబర్ 1న స్వీయ పాలన కిందకు వచ్చింది. 1975లో ఐక్యరాజ్యసమితిలో చేరింది. 1977లో జాతీయ ఎన్నికలు జరిగి మైఖేల్ సొమారే ప్రధాని అయ్యారు. ఆ తర్వాత అనేక ప్రభుత్వాలు మారి నేడు పీటర్ ఓనీల్ పాలనలోకి పిఎన్‌జి వచ్చింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నియమాలను ఆ దేశం మానస్ శరణార్థి బందీల విషయంలో ఉల్లంఘించడాన్ని పలు దేశాలు విమర్శిస్తున్నాయి.
      * కోలిన్ పాక్‌హామ్, టామ్ వెస్ట్ బ్రూక్

Comments

comments