Search
Wednesday 22 November 2017
  • :
  • :

నవ్యమైన సినిమాలు చేసి మంచి నటుడిగా పేరుతెచ్చుకుంటా

రక్షిత్, స్వాతి జంటగా మారుతి టాకీస్ బ్యానర్‌పై చిన్ని కృష్ణ దర్శకత్వంలో మారుతి నిర్మించిన చిత్రం ‘లండన్ బాబులు’. ఎవిఎస్ స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు రక్షిత్ చెప్పిన విశేషాలు…

Rakshith

మారుతే కారణం…
నేను హీరో కావడానికి కారణం మారుతినే. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన నేను విదేశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ ఓ రోజు మారుతి కలిసి ‘సినిమాల్లోకి రా… నువ్వు హీరోగా చేస్తే బాగుంటుంది ’అని ఆయన చెప్పారు. దీనికి తోడు మా నాన్న, మా కుటుంబం నన్ను బాగా ప్రోత్సహించింది. ఆవిధంగా సినిమాల్లోకి రావడం జరిగింది.
లండన్ వెళ్లే ప్రయత్నంలో…
అంతర్వేది గ్రామం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు కుర్రాళ్ల కథే ఈ చిత్రం. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన హీరో(నేను), అతని స్నేహితుడు డబ్బు సంపాదించేందుకు ప్రయత్నిస్తారు. విదేశాలకు వెళ్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని భావించి లండన్ వెళ్లానుకుంటారు. వీసా, పాస్‌పోర్టు తెచ్చుకోవడం కోసం బ్రోకర్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో చిన్న తప్పు చేయడం జరుగుతుంది. దీంతో వాళ్లిద్దరు లండన్ వెళ్లారా? లేదా? అసలు ఏం జరిగిందనేదే సినిమా.
లవ్ ఎంటర్‌టైనర్…
కామెడీ ప్రధానంగా సాగే లవ్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ఇందులో నేను గాంధీ పాత్రలో కనిపిస్తా. అదేవిధంగా రిపోర్టర్‌గా పనిచేసే స్వాతి పాత్ర కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
అద్భుతంగా తెరకెక్కింది…
తమిళ్‌లో హిట్టయిన ‘ఆండవన్ కట్టలై’ చిత్రానికి రీమేక్ ఇది. దర్శకుడు చిన్నికృష్ణకిది మూడవ సినిమా. అతను అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. కామెడీ, ఎమోషన్స్‌తో సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందింది. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది.
నెక్స్ మూవీ…
ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకముంది. ఇక మంచి కథలతో కూడిన నవ్యమైన సినిమాలు చేసి మంచి నటుడిగా పేరుతెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నా నెక్స్ మూవీ మారుతితో ఉంటుంది. వచ్చే ఏడాది ఆ సినిమా తెరకెక్కుతుంది.

Comments

comments