Search
Wednesday 22 November 2017
  • :
  • :

ఇటలీ ఆశలు ఆవిరి

football

మిలాన్: వచ్చే ఏడాది రష్యాలో జరిగే ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో నాలుగు సార్ల విశ్వ చాంపియన్ ఇటలీ విఫలమైంది. వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇటలీ డ్రాతో సరిపెట్టుకుంది. దీంతో 2018కు అర్హత సాధించలేక పోయింది. ఇటలీ ప్రపంచకప్‌కు అర్హత సాధించక పోవడంతో 60 ఏళ్లలో ఇదే తొలి సారి కావడం విశేషం. వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇటలీ యూరప్‌కు చెందిన మరో అగ్రశ్రేణి జట్టు స్వీడన్‌తో తలపడింది. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఇటలీ ఆశలు ఆవిరయ్యారు. ఈ డ్రాతో స్వీడన్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది. స్వీడన్ చివరి సారిగా 2006లో ఫిఫా ప్రపంచకప్‌లో ఆడింది. తొలి లెగ్‌లో ఇటలీపై విజయం సాధించడంతో స్వీడన్‌కు వరల్డ్‌కప్ బెర్త్ లభించింది. మరోవైపు కచ్చితంగా గెలవాలనే ఒత్తిడిలో బరిలోకి దిగిన అగ్రశ్రేణి ఇటలీ జట్టు డ్రాతోనే సరిపెట్టుకొని రేసు నుంచి నిష్క్రమించింది. చివరి వరకు తీవ్రంగా పోరాడిన ఇటలీ ఒక్క గోల్ కూడా సాధించలేక పోయింది. స్వీడన్ అద్భుతమైన డిఫెన్స్‌తో ఇటలీని నిలువరించి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఇదిలావుండగా తమ జట్టు

ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో విఫలం కావడంతో ఇటలీలో అభిమానుల అక్రందనలు మిన్నంటాయి. వీధుల్లోకి వచ్చిన అభిమానులు ఫుట్‌బాల్ ఆటగాళ్ల దిష్టి బొమ్మలను దహనం చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇటలీ చివరి 1958లో వరల్డ్‌కప్ అర్హత సాధించడంలో విఫలమైంది. అప్పటి నుంచి దాదాపు ఆరు దశాబ్దాలుగా ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తూనే ఉంది. అయితే ఈసారి మాత్రం వరల్డ్‌కప్ బెర్త్‌ను దక్కించుకోవడంలో ఘోరంగా విఫలమైంది. కాగా, ఈ మ్యాచ్ అనంతరం ఇటలీ స్టార్ గోల్ కీపర్, కెప్టెన్ గియాన్ లూగి బఫన్ అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బఫన్ 175 మ్యాచుల్లో ఇటలీకి ప్రాతినిథ్యం వహించాడు. 2006లో వరల్డ్‌కప్ సాధించిన ఇటలీ జట్టులో బఫన్ సభ్యుడిగా ఉన్నాడు. ఇదిలావుండగా ఇటలీ 1934, 1938, 1982, 2006లలో ఫుట్‌బాల్ విశ్వ విజేతగా నిలిచింది. అయితే ఈసారి మాత్రం కనీసం వరల్డ్‌కప్‌కు అర్హత కూడా సాధించలేక పోయింది.

Comments

comments