Search
Friday 20 April 2018
  • :
  • :

కరువు అంచున ఉమ్మడి జిల్లా

LAND

* అత్యల్ప వర్షపాతం నమోదు 8 రబీ పంటలపై తీవ్ర ప్రభావం
* భూగర్భ జలాలకు ముప్పు

కోటి కష్టాలను ఎదుర్కొని ఖరీఫ్ సీజన్ గటెక్కబోతుండగా రాబోయే రబీ కాలం మాత్రం ఇప్పటి నుండే ఆందోళనకు కారణమవుతోంది. ఈ సారి వర్షాకాలం దోబూచులాడడంతో జలాశయాలలో నీరు ఆశించిన మేరకు చేరుకోలేదు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల రిజర్వాయర్‌లలో ఆశించిన మేరకు నీరు చేరుకోలేదు. గరిష్ట మట్టానికి సగం సామర్థంలోనే నీటి నిల్వ ఉండడం గమనార్హం. అధికారిక లెక్కల ప్రకారం… అలాగే వాతావరణ శాఖ నివేదికల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైనట్లు నిర్ధారించారు. వర్షాలు వరుసగా కురియకుండా అడపాదడపా కురియడంతో చెరువులు, కుంటలలో కొద్ది మేరకు మాత్రమే నీరు చేరుకుంది. అలాగే వర్షాలు తక్కువగా కురియడం, సెప్టెంబర్ మాసం చివరి వరకు ఎండ వేడిమి తీవ్ర స్థాయిలో కొనసాగడంతో భూ గర్భ జలాలు ఆశించిన మేరకు పెరగకపోవడమే కాకుండా మరింత లోతుకు పడిపోయాయి. ప్రస్తుతం భూగర్భ జలాల శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే బోరుబావులపై ఆధారపడ్డ రబీ పంటలకు గడ్డు కాలం తప్పదంటున్నారు. ప్రాజెక్టు రిజర్వాయర్‌లలో నీటి శాతం తక్కువగా ఉన్నందున ఆ నీరును వేసవి ముగిసే వరకు పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. పంట కన్నా ముఖ్యంగా తాగు నీటి అవసరాలకు ఈ నీటిని అందుబాటులో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఇందులో భాగంగానే ఇటీవల ప్రాజెక్టుల్లోని నీటిని ఏ ఏ కాల్వలకు ఎంత మేరకు నీటిని విడుదల చేయాలనే అంశంపై అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో కాలువ కింద గతం కన్నా సగం భూములకు సైతం నీరందజేయలేని పరిస్థితి నెలకొందంటున్నారు. అలాగే చెరువులు, కుంటల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. తక్కువ నీటి నిల్వ కారణంగా వాటి కింద సాగయ్యే భూములకు నీరందని పరిస్థితి ఉందంటున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం తక్కువ వర్షపాతం నమోదును పరిగణలోకి తీసుకొని నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాలను కరువు ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలుగా గుర్తించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ పంటలన్ని కోత దశలో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పత్తి ఇప్పటికే దిగుబడులు సాధించి అమ్మకాలకు సిద్ధమవుతోంది. సోయా కూడా ఇదే పరిస్థితి ఉంది. కాగా వరి, పసుపు తదితర పంటలన్ని మరికొద్ది రోజుల్లో చేతికి రానున్నాయి. మరో నెల రోజుల్లో రబీ సీజన్ ఊపందుకోబోనుంది. ఆరు తడి పంటలతో పాటు వరి, మొక్కజొన్న తదితర పంటలను రబీలో సాగు చేస్తుండడం సాంప్రదాయంగా మారింది. వీటితో పాటు కూరగాయలు, పప్పు దినుసు పంటలను సైతం పండిస్తుంటారు. రబీ పంటలకు తక్కువ నీరు అవసరమైనప్పటికీ వరి, మొక్కజొన్నకు మాత్రం నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇదే జరిగితే పంటల పరిస్థితి కష్టతరంగా మారే అవకాశాలు లేకపోలేదంటున్నారు. దీనికి తోడు భూ గర్భ జలాలు అడుగంటే అవకాశం ఉండడంతో తాగు నీటికి సైతం కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments