Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

పల్లెల్లో ఎల్‌ఈడి వెలుగులు

light

మనతెలంగాణ/నిజామాబాద్ రూరల్: పంచాయతీల్లో ఇక ఎల్‌ఈడి వెలుగులతో కాంతులీననున్నాయి. అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే జిల్లాలో మొత్తం 393 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 200 పంచాయతీల్లో ఎల్‌ఈడి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం 183 గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడి దీపాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అన్ని గ్రామాల్లో ఈ ఎల్‌ఈడి దీపాలను ఏర్పాటు చేస్తే విద్యుత్ బకాయిల భారం నుంచి ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు సగం మేరకైనా విముక్తి పొందుతారు. ప్రస్తు త జిల్లా వ్యాప్తంగా రూ. 152 కోట్లు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ప్రధానంగా పెద్ద గ్రామ పంచాయతీల్లో రూ. కోటి కంటే ఎక్కువగా విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్నేళ్ల నుంచి ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు విద్యుతు బకాయిలను సక్రమం గా చెల్లించకపోవడంతో ప్రస్తుత సర్పంచులు వాటిని కొండంత బరువుగా భావిస్తున్నారు. వాటిని చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఆర్థిక సంఘం నిధులు విద్యుతు బిల్లులకే
గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా పంపిణీ చేసే 14వ ఆర్థిక సం ఘం నిధుల నుంచి విద్యుతు బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఎక్కువ శాతం విద్యుతు బిల్లుల వినియోగానికి ఖర్చు చేస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు ఆయా గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికగా నిధులు విడుదల అయ్యాయి. వీటిలో ఎక్కువ నిధులన్నీ విద్యుతు బిల్లుల చెల్లించడానికి ఖర్చు చేస్తున్నారు. మిగిలిన నిధులతోని ఏ పని పూర్తి కాకుండా గ్రామాల్లో అభివృద్ధి పడకేస్తోంది. గ్రామ పంచాయతీల్లో ఉన్న పెద్ద బల్బులు అన్ని గ్రామాల్లో నిరంతర విద్యుత్తు వెలుగుతుండడంతో విద్యుతు బకాయిలు పేరుకుపోతున్నాయి. అదే ఎల్‌ఈడి దీపాలు ఏర్పాటుతో విద్యుతు భారం నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది.
తొలగనున్న నిర్వహణ సమస్య
పంచాయతీలు సరిగ్గా విద్యుతు బిల్లులు చెల్లించకపోవడంతో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్థంగా ఉంటుంది. బల్బు కాలిపోతే దాన్ని తిరిగి ఏర్పాటు చేసేది ఎప్పటికోగాని జరగదు. ఎక్కువ సామర్థం వున్న దీపాలు వాడడంతో బిల్లులు అధికంగా వస్తున్నాయి. వీటిని చెల్లింంచడం పంచాయతీలకు తలకుమించిన భారమవుతోంది. ఇప్పటికే విద్యుత్ శాఖకు పంచాయతీలు దాదాపు రూ.152 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇవి చెల్లించే స్థితిలో పంచాయతీలు లేవు. దీంతో విద్యుత్ సరఫరాను నిలిపివేసిన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం ఎల్‌ఈడి దీపాలు. వీటి ఏర్పాటు నిర్వహణ ప్రైవేట్ గుత్తేదారుకు బాధ్యతలు అప్పగించాలి. ఒక్కోక్క బల్బుకు రూ. 1037కు టెండ ర్ ఖరారు చేశారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్న కొత్త ఎల్‌ఈడి దీపాలు ఎక్కువగా వెలుగునీస్తాయి. పట్టణ ప్రాంతాల్లో చాలా వరకు ఎల్‌ఈడి బల్బులు అందుబాటులోకి తీసుకువచ్చాయి. తక్కువ విద్యుతు వినియోగం ద్వారా ఎక్కువగా లాభాలను ఈ దీపాలు అందిస్తున్నాయి. దీనివల్ల మామూలు దీపాలకు ఖర్చు అయ్యేటంత విద్యుత్ వీటికి ఖర్చుకాదు. వీటితో నిర్వహణ సమస్య తీరనుంది.

ఎల్‌ఈడి దీపాలును అందుబాటులోకి తీసుకురావాలి: జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గొర్త రాజేందర్
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడి దీపాలు తీసుకువస్తే మంచిది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు గ్రామాల్లో సర్పంచులు విద్యు తు బకాయిలు చెల్లించలేక తీవ్ర ఇబ్బ ందులు పడుతున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు విద్యుతు బిల్లులకే ఖర్చు చేస్తున్నారు. ఎల్‌ఈడి దీపాలను పెడితే విద్యుతు బకాయిల భారం నుండి ఆయా గ్రామ పంచాయతీలకు సగం మేరకైనా విముక్తికలుగుతుంది.

అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడి దీపాలు ఏర్పాటు:
జిల్లా పంచాయతీ అధికారి కె. కృష్ణమూర్తి
గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడి బల్బులు బిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. జిల్లాలో ఇప్పటికే 183 గ్రామ పంచాయతీల పరిధిల్లో ఎల్‌ఈడి బల్బులు ఏర్పా టు చేశాం. మిగిలిన పంచాయతీల్లో ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడి వెలుగులు రానున్నాయి.

Comments

comments