Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

మనీలా పరిణామాలు

sampadakeyam

పరిపూర్ణ ప్రపంచశాంతి ఎండమావి మాదిరిగానే కొనసాగినంత కాలం దేశాల మధ్య సంబంధాలనే నాణేనికి రెండు పార్శాలు ఉండడం అత్యంత సహజం. ఇందులో ఒక పార్శం ఆర్థిక, వాణిజ్య బంధాలు బలోపేతానికి సంబంధించినవి కాగా రెండవది పరస్పర భద్రతకు, రక్షణకు చెందినది. ప్రధాని నరేంద్రమోడీ మనీలా(ఫిలిప్పీన్స్) పర్యటన భారతదేశ అంతర్జాతీయ సంబంధాల పెంపుదల కృషిలో గణనీయమైనదని చెప్పవచ్చు. ఇప్పటికే కొంత ప్రగతిని సాధించిన భారతదేశ తూర్పుచూపు ఈ పర్యటన సన్నివేశాలతో మరింత గాఢతను సంతరించుకున్నది. ప్రధాని మోడీ ఆగ్నేయాసియా దేశాధి నేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు మనీలాలో అడుగుపెట్టడానికి ముందు గత శనివారంనాడు అక్కడ జరిగిన భారత్‌అమెరికాజపాన్‌ఆస్ట్రేలియా చతుర్ముఖ కూటమి అధికారుల స్థాయి సమావేశం కీలక ప్రాధాన్యం గలది. ఈ అనుబంధం ఆవశ్యకతను తొలిసారిగా జపాన్ ప్రధాని షింజో అబే 2007లో తన మొదటి హయాంలో ప్రస్తావించారు. అది ఇన్నాళ్లకు అడుగు ముందుకు వేసింది. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్య కాంక్షను అదుపులో ఉంచడానికి ఈ నాలుగు దేశాలు కలిసి పనిచేయాలని అప్పట్లో వెల్లడైన సంకల్పం అవసరం ఇప్పుడు బాగా పెరిగిందని భావిస్తున్న నేపథ్యంలో మనీలా సమావేశానికి విశేష ప్రాధాన్యమున్నది. అదే సందర్భంలో ప్రధాని మోడీ పాల్గొన్న ఆగ్నేయాసియా దేశాల సమావేశం గాని అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ ట్రంప్‌తో జరిపిన చర్చలు మొత్తంగా ఇండోపసిఫిక్ ప్రాంతీయ మైత్రికి కృషి చైనాపట్ల గుర్రుతో దక్షిణ చైనా సముద్రంలో దాని గుత్తాధిపత్య వైఖరిమీద అసంతృప్తితో జరిగినవని భావించడానికి ఆస్కారం కలుగుతున్నది.
ట్రంప్‌తో మోడీ చర్చల అనంతరం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలైన భారత్, అమెరికాలు అతిగొప్ప సైన్యాలను కూడా కలిగి ఉండాలని ప్రకటించుకున్న ఉమ్మడి సంకల్పం ప్రత్యేకించి గమనించదగినది. ఇది చైనాను ఉద్దేశించి చేసిందేనని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అయితే ఇందులో భారత్‌ను ఉబ్బేసి అమెరికా తన ప్రయోజనాలను విశేషంగా సాధించుకోవాలనుకుంటున్న దృష్టి సుస్పష్టం. తమవద్ద నుంచి అపరిమితంగా రక్షణ కొనుగోళ్లు చేయించడమే ట్రంప్ ఆంతర్యమని తద్వారా తమ ఆర్థిక దారిద్య్రాన్ని తొలగించుకోవాలన్నదే ఆయన కాంక్ష అని బోధపడకమానదు. ఇప్పటికే తన వద్దనుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌ను అమెరికా మెచ్చుకుంటున్నది. 10మిలియన్ల బ్యారెళ్లకు పైగా చమురును అమెరికానుంచి కొన్నందుకు ట్రంప్ ప్రశంసలు వర్షించారు. అందుచేత అమెరికా అంతర్జాతీయ సంబంధాల తీరు ఏ రోటికాడ ఆ పాటపాడి తన ప్రయోజనాల సాధనను ఇనుమడింప చేసుకోవడమేనని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. మన విదేశాంగ విధానాన్ని అమెరికా ప్రధానంగా పూర్తిగా మార్చివేసిన ప్రధాని మోడీ ఈ అంశాన్ని గమనించితీరాలి. లేకపోతే మన జాతీయ ప్రయోజనాలు అందుకు మొదటి బలిపశువు అవుతాయి. శతృవుశతృవు మిత్రుడనే గుడ్డి భావన దేశాలతో సంబంధాల విషయంలో మితిమించ కూడదు. ట్రంప్ ఇటీవల చైనాలో పర్యటించారు. అప్పుడాయన అక్కడి నేతలతో నిర్మొహమాటంగా మాట్లాడటానికి బదులు వారిని మెత్తబరచటానికి, సన్నిహితం చేసుకోవడానికే ప్రయత్నించారు. చైనా ప్రాబల్యాన్ని నిరోధించడం అనే సిద్ధాంతం వంటిదేమీ లేదని అది ఒట్టి బూటకమని కొట్టిపారేశాడు. మరింత సఖ్యతతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థకు అమెరికా, చైనాలు మూలస్థంభాలు అన్నాడు. చైనాతో భారీ వాణిజ్యలోటును పూడ్చుకోవడం వగైరా సొంత లాభాలు దెబ్బతినని రీతిలో మాట్లాడి బీజింగ్ నేతలను ప్రసన్నం చేసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. అందుచేత భారత్‌ను అమెరికా పొగడ్తలలో ముంచెత్తడం ముఖ్యంగా సైనికంగా మరింత మరింత బలిసి పోవాలని ట్రంప్ మన వెన్నుతట్టడాన్ని జాగ్రత్తగా, తెలివిగా అర్థం చేసుకుని మనం అడుగులు వేయాలి. ట్రంప్ హుషారైన, దూకుడుతో కూడిన సైనిక పరిభాషకు ఉబ్బితబ్బిబ్బైపోయి చైనాతో ఢీ అంటే ఢీ అనవలసిన అగత్యం భారత్‌కు లేదు. చైనాతో మనకు గల ప్రాంతీయ అనుబంధం విశిష్టతను కూడా మరువకూడదు. అటు అమెరికాతోను, ఇటు చైనాతోను సంతులన సంబంధాల పరిరక్షణే భారత్‌కు మేలు చేస్తుంది.

Comments

comments