Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

వివక్షే విద్య

catn

మార్కులను బట్టే మర్యాద 

విద్యార్థులను ఆత్మన్యూనతలోకి నెట్టివేస్తున్న కార్పొరేట్  కాలేజీలు

‘అందరినీ మిస్ అవుతున్నా…ఈ కళాశాల వేస్ట్.. అక్కడి సమస్యలతోనే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.బండ్లగూడలోని నారాయణ కళాశాల విద్యార్థిని సాయి ప్రజ్వల తన మేనమామ ఇంటి నుంచి అదృశ్యమయ్యేముందు రాసిన లేఖ సారాంశం…

‘బాగా చదవలేకపోతున్నా…మా తల్లిదండ్రులకు ఎక్కడ చెడ్డపేరు తీసుకొస్తానోనని భయంగా ఉంది. నాకు చావే సరైన మార్గం అనిపిస్తోంది’
– శ్రీచైనత్య కళాశాలలో నీట్ శిక్షణ తీసుకుంటున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య లేఖ ఇది.

 హైదరబాద్ : పోటీ ప్రపంచంలో రాణించాలంటే ర్యాంకు తెచ్చుకోవడం తప్ప మరో మార్గం లేదని కార్పొరేట్ కళాశాలలు, తల్లిదండ్రులు విద్యార్థుల్లో నూరిపోయడం సాధారణమైంది. అందుకు అనుగుణంగా తమ పిల్లలు 10వ తరగతి పూర్తి కాగానే ఇంటర్‌తోపాటు ఐఐటి, జెఇఇ, ఎఐఇఇఇ, ఎంసెట్, నీట్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ కోసం ప్రముఖ కార్పొరేట్ కళాశాలలో చేర్పిస్తున్నారు. అందులో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతితో పాటు సంపన్న వర్గాలకు ర్యాంకులు చూ పించుకుంటూ ఎక్కువగా గోబల్ ప్రచారం చేసుకునే శ్రీచైనత్య, నారాయణ కళాశాలల వైపే ఆకర్షితులవుతున్నారు. ఈ కళాశాలలో ఒకసారి ప్రవేశం పొందిన తర్వాత విద్యార్థి మానసిక స్థితి, ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఈ మార్పు అనేక అనర్థాలకు దారితీస్తోంది.
మార్కులను బట్టి సెక్షన్లుగా విభజన : ప్రస్తుతం జరుగుతున్న కార్పొరేట్ ప్రచారంతో ఇంటర్ చదువు అంటే ఎంపిసి, బైపిసి అన్న భావన ఏర్పడింది. డాక్టర్ లేదా ఇంజనీరింగ్ కాలేదంటే ఇక జీవితమే లేదన్నట్లుగా తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. దాంతో పిల్లలను ఇష్టాఇష్టాలను, వారి అభిరుచులకు ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఇంటర్‌లో ఎంపిసి, బైపిసి కోర్సుల్లో చేర్పిస్తున్నారు. 10వ తరగతి అందరికీ ఒకే సబ్జెక్ట్‌లు ఉంటాయి. పది తర్వాత మాత్రం విద్యార్థి ఇష్టాలను అనుగుణంగా ఎంపిసి, బైపిసి, సిఇసి, హెచ్‌ఇసి వంటి గ్రూప్‌లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కానీ విద్యార్థి ఆలోచలనలతో సంబంధం లేకుండా కళాశాలలు, తల్లిదండ్రులే గ్రూప్‌లను నిర్ణయిస్తున్నారు. ఈ కళాశాలల్లో ప్రవేశం పొందిన తర్వాత ఇంటర్ సిలబస్‌తోపాటు అదనంగా ఐఐటి, జెఇఇ, నీట్ వంటి పోటీ పరీక్షల సిలబస్‌ను కూడా చదవాల్సి వస్తోంది. శ్రీచైతన్య, నారాయణ కళాశాలలో విద్యార్థి ప్రవేశం పొందిన తర్వాత వారం వారం పరీక్షలు నిర్వహిస్తారు. మూడు నెలలపాటు ఈ పరీక్షలలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా సెక్షన్లు విభజిస్తారు. 10వ తరగతి గ్రేడ్ల ఆధారంగా సెక్షన్లు విభజించి కచ్చితంగా ర్యాంకు వస్తుందనుకున్న విద్యార్థులకు ప్రత్యేక క్యాంపస్‌లలో కోచింగ్ ఇవ్వడంతోపాటు మిగతా కళాశాలల్లో నిర్వహించే వారం వారం పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కూడా ఈ ప్రత్యేక క్యాంపస్‌లకు బదిలీ చేస్తుంటారు. ఆయా కళాశాలల్లో అధ్యాపకులు సాధారణ విద్యార్థులను మెరిట్ విద్యార్థులతో పోల్చుతూ అవమానిస్తుంటారు. దాంతో విద్యార్థులు ఆత్మనూన్యత భావానికి గురవుతున్నారు.

Comments

comments