Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

సైనిక చర్య పరిష్కారం కాదు

donald 

సిరియాపై అమెరికా, రష్యా ప్రకటన   అపెక్‌లో ట్రంప్, పుతిన్ మాటామంతీ    ఐసిస్ అడ్డుకట్టకు చర్యలు 

డ నాంగ్ (వియత్నాం) : సిరియా అంతర్యుద్ధానికి సైనిక చర్య పరిష్కారం కాదని అమెరికా, రష్యాలు అభిప్రాయపడ్డాయి. ఈ మేరకు ఇరుదేశాల అధ్యక్షుల తరఫున ఉమ్మడి అధ్యక్ష ప్రకటన శనివారం వెలువడింది. వియత్నాంలో ఆసియాపసిఫిక్ ఆర్థిక సహకార (అపెక్) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌ల భేటీ జరిగింది. సిరియాలో యుద్ధం గురించి ఇరువురు నేతలు సమీక్షించినట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. అపెక్ సదస్సుకు ఇద్దరు నేతలు హాజరవుతున్నప్పటికీ ఇద్దరి ముఖాముఖి భేటీ ఉంటుందా? అనేది చివరి వరకూ సందిగ్థంగానే మారింది. అయితే సమావేశానికి వచ్చిన ఇరువురు నేతలు ఆప్యాయంగా ఒకరిని ఒకరు పలకరించుకున్నారు. కరచాలనం చేసుకున్నారు. సదస్సు సమయంలో ఇరువురు అగ్రనేతలు మూడు సార్లు మాట్లాడుకున్నట్లు, అయితే ఇరువురు నింపాదిగా కూర్చుని చర్చలు ఏవీ జరపలేదని వెల్లడి అయింది. రష్యా అధికార వర్గాలు ఇరువురు నేతల ముచ్చట గురించి అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. సిరియా సంక్షోభంపై ట్రంప్, పుతిన్ మధ్య సరైన దిశలో అభిప్రాయ వ్యక్తీకరణ జరిగిందని ఇందులో వివరించారు. ఆరు సంవత్సరాలుగా సాగుతున్న సిరియా అంతర్యుద్ధం నివారణకు సరైన విధంగా వ్యవహరించాల్సి ఉందని ఇరువురు అభిప్రాయపడ్డారు. అయితే సిరియా అంతర్యుద్ధ నివారణకు అంతర్జాతీయ స్థాయి సైనిక చర్య పరిష్కారం కాబోదని ఇరువురు పేర్కొన్నట్లు వెల్లడించారు. సిరియాలో ఐఎస్‌ఐఎస్ ప్రాబల్యం అంతమొందించే దిశలో తగు విధంగా స్పందించాలనే కృతనిశ్చయాన్ని ఇరువురు నేతలు వ్యక్తం చేశారని క్రెమ్లిన్ వెబ్‌సైట్‌లో తెలిపారు. అయితే ట్రంప్ పుతిన్ చర్చల గురించి వైట్‌హౌస్ వర్గాలు అధికారిక ప్రకటన ఏదీ వెలువరించలేదు. సిరియా అంతర్యుద్ధం గురించి చాలా కాలంగా రష్యా, అమెరికా మధ్య పరస్పర విమర్శ లు నెలకొని ఉన్నాయి. తూర్పు సిరియాలో తాము రెబె ల్స్ ఆటకట్టుకు చేస్తున్న యత్నాలను అమెరికా కావాలనే అడ్డుకొంటోందని రష్యా ఆరోపిస్తోంది. ఈ దశలోనే ఇప్పుడు ఇరు దేశాల అధ్యక్షుల సంయుక్త ప్రకటన వెలువడటం కీలక అంశంగా మారింది.
రష్యా పాత్ర లేదని తేల్చేసిన పుతిన్
అమెరికా అధ్యక్ష అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం ఏ విధం గా కూడా లేదని ఆ దేశాధ్యక్షులు పుతిన్ స్వయం గా పదేపదే చెప్పారని ట్రంప్ వెల్లడించారు. అమెరికా అ ధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో క్రెమ్లిన్ పాత్ర ఉం దని, దీని వల్లనే బిలియనీర్, మాజీ రియాల్టీ స్టార్ శ్వేతసౌధ అధికార సౌధం అధికారం చేపట్టారని ఆరోపణలు వెలువడ్డాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత కూడా ఇదే వివాదం ఆయనను వెంటాడుతూ వచ్చింది.
వియత్నాంలో అపెక్ సదస్సుకు వచ్చి న ట్రంప్ దీని గురించి పదేపదే పుతిన్‌ను ప్రశ్నించారు. ఎన్నికలలో రష్యా పాత్ర ఉందా? అని తరచితరచి అడిగినా తనపై ఆయన కొంచెం విసుకున్నారని, ఎన్ని సార్లు అడిగినా జవాబు ఒక్కటే అని, ప్రమేయం లేదు అనే దే సూటి సమాధానం అని స్పష్టం చేశారని ఎయిర్ ఫోర్స్ ఒన్ విమానంలో ట్రంప్ విలేకరులకు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో రష్యా కలుగచేసుకుందని, కొన్నిఅంశాలను ప్రభావితం చేసిందని ఆరోపణలు వెలువడ్డాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

Comments

comments