Search
Tuesday 19 June 2018
  • :
  • :

రేపు ట్రంప్‌తో మోడీ కీలక భేటీ

modiమనీలా : అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌తో సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీకానున్నారు. ఫిలిప్పీన్స్‌లో జరిగే కీలకమైన 15వ ఆసియాన్ ఇండియా శిఖరాగ్ర సదస్సుకు ఇరువురు నేతలు హాజరు కానున్నారు. ఈ సదస్సు, 12వ ఈస్ట్ ఆసియా సమ్మిట్‌లో పాల్గొనేందుకు భారత ప్రధాని మోడీ ఆదివారం మనీలాకు చేరుకుంటారు. ప్రస్తుతం ఐదు ఆసియా దేశాల పర్యటనలో ఉన్న ట్రంప్ కూడా ఆదివారమే ఇక్కడికి వస్తారు. ట్రంప్ మోడీ మధ్య ద్వైపాక్షిక సమావేశం సోమవారం జరుగుతుందనే విషయాన్ని అధికార వర్గాలు ధృవీకరించాయి. ఈ నెల 14న ఆసియాన్, ఈస్ట్ ఆసియా సమ్మిట్ జరుగుతాయి. చైనాకు ధీటుగా అమెరికా, జపాన్, ఇండియా,ఆస్ట్రేలియాల చతుర్ముఖ కూటమి ఏర్పాటు ప్రతిపాదన తరువాత ట్రంప్‌తో మోడీ ముఖాముఖీ తొలిసారిగా సోమవారం జరుగనుంది. ఈ కూటమి ఏర్పాటు గురించి మిగిలిన మూడు దేశాలతో చర్చిస్తామని జపాన్ గత నెలలోనే తెలిపింది. ఈ నాలుగు దేశాల నేతలు ఆసియాన్ సదస్సు నేపథ్యంలో కీలక చర్చలు జరుపుతారని వెల్లడైంది. ఇక ట్రంప్‌తో మోడీ జరిపే ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఈ విషయంతో పాటు భద్రతా వాతావరణం ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి.

Comments

comments