Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

శ్రుతిమించిన నకిలీలలు!

crtn

మన మార్కెట్లు నకిలీ సరకులతో నిండిపోతున్న పరిస్థితిలో ‘బ్రాండ్ ఇండియా’ ప్రమాదంలో పడింది. ఔషధాలు, ఎల్‌ఇడి బల్బులు తదితర ఉత్పత్తులు నాణ్యత, ధరలు, భద్రతా ప్రమాణాలు లేకుండా తయారవుతూ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. అవి ఉత్పత్తిదారు పేరు ఉండాలన్న నియమం పాటించడం లేదు. అలాగే ఉత్పత్తి, ఎక్స్‌పైరీ(కాలదోషం) తేదీలనూ ప్రకటించడం లేదు. ధరలను కూడా ముద్రించడం లేదు. వాటిని వేరేగా ప్యాక్ చేసి పంపుతున్నారు. దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎల్‌ఇడి బల్బుల మార్కెట్‌లో అక్రమ పద్ధతులను అనుసరిస్తున్నట్లు అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగల ‘నీల్సన్’ అధ్యయనంలో బయటపడింది. అది వెల్లడించిన విషయాలు తలతిరిగేలా ఉన్నాయి.
దేశంలో అత్యంత సులభంగా నకిలీ వస్తువులు తయారై మార్కెట్ అవుతున్నాయో వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల మార్కెట్ (ఎఫ్‌ఎంసిజి)పై కెఎంపిజి అనే ప్రపంచ ప్రఖ్యాత ఆడిటర్ల బృందం నివేదిక అంతకుముందు హెచ్చరించింది. ఎల్‌ఇడి బల్బులలో 76శాతం ప్రమాణాలు పాటించడంలేదని నీల్సన్ హెచ్చరించింది. ఎఫ్‌ఎంసిజి మార్కెట్‌లో ఐదు వంతులకంటే అధికంగా నకిలీ ఉత్పత్తులు, దొంగ రవాణా వస్తువులు ముంచెత్తు తున్నాయి కూడా. 2014 ఆఖరుకు నకిలీ వస్తువుల మార్కెట్ విలువ రూ.68,000 కోట్లని ఎఫ్‌ఐసిసిఐ కెఎంపిజి నివేదిక తెలిపింది. మొత్తం నకిలీ వస్తువుల మార్కెట్‌లో ఇది 65శాతం. ఆ మొత్తం మార్కెట్ విలువ రూ.1.05లక్షల కోట్లు.
గత రెండేళ్లుగా ఈ మార్కెట్ 10 శాతం పెరిగింది. 2014 అంతానికి మొత్తం ఎఫ్‌ఎంసిజి మార్కెట్ విలువ దేశంలో రూ. 3.2 లక్షల కోట్లని తేలింది. గత రెండేళ్లుగా ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థలు ఉధృతంగా మార్కెటింగ్ చేయడంతో ఎఫ్‌ఎంసిజి మార్కెట్ తీరు విపరీతంగా మారిపోయింది.
పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ ధోరణి ఆశించినంతగా పెరగలేదు. అయితే నకిలీ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో విపరీతమైన వృద్ధి చోటు చేసుకుంటోంది. దీనికి చట్టాల అమలు యంత్రాంగం నీరసించిపోవడమే కారణం. మోసకారి సంస్థ లు మార్కెట్‌లోకి సులభంగా నకిలీ వస్తువులతో చొచ్చుకుపోతున్నాయి.
అధికారులతో సన్నిహితంగా మెలుగుతూ పెద్ద ఎఫ్‌ఎంసిజి కంపెనీలు పనిచేస్తాయి. మోసకారి సంస్థల పనిపట్టడం వాటి ఉద్దేశం. తరచుగా దాడులు జరిపి, సరకును స్వాధీనం చేసుకునేలా పోలీసులు, ప్రభుత్వ పెద్దలతో హిందూస్థాన్ యూనీలీవర్, గోద్రేజ్ కన్జూమర్, డాబర్, ఇమామి వంటి కంపెనీలు కలిసి పనిచేస్తాయి. నకిలీ సరకులు బ్రాండెడ్‌విగా అమ్ముడవుతుండడంతో బడా కంపెనీల ఉత్పత్తులకు గిరాకీ పడిపోయి వాటి వ్యాపారం దెబ్బతింటోంది. అందుకని అవి ఆందోళన చెందుతున్నాయి. కొన్ని బడా ఎఫ్‌ఎంసిజి కంపెనీలు ప్రైవేటు డిటెక్టివ్ సంస్థలను కూడా ఇందుకోసం రంగంలోకి దింపుతున్నాయి.
ఈ నకిలీ వస్తువుల వల్ల ఖజానాకు ఏటా రూ.27,500 కోట్ల నష్టం వస్తున్నట్లు కెపిఎంజి నివేదిక తెలిపింది. చట్టాల అమలు అధికారుల మధ్య సమన్వయ లోపం, వినియోగదారులలో అవగాహనా లోపం పెద్ద సవాళ్లుగా పరిణమించాయి. ‘లైట్ ఎమిటింగ్ డియోడ్ (ఎల్‌ఇడి)’ పై నీల్సన్ నివేదిక ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దేశంలో ఏటా వంద కోట్ల డాలర్ల విలువగల ఎల్‌ఇడి బల్బులు అమ్ముడవుతున్నాయి. కానీ వాటిలో మూడోవంతు బల్బులు ప్రభుత్వ ప్రమాణాలు పాటించకుండా తయారవుతున్నవే. విద్యుత్ పరికరాల 200చిల్లర దుకాణాలను అధ్యయనం చేసి ఈ నివేదిక కూర్చారు. అవన్నీ ముంబయి, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు చెందిన దుకాణాలు.
దేశ రాజధాని ఢిల్లీలో ఈ నకిలీ వస్తువుల మార్కెటింగ్ అధికంగా ఉన్నట్లు మరో అందోళనకర వాస్తవాన్ని నీల్సన్ జులైలో బయటపెట్టింది. ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి కూడా ఈ నకిలీలు తూట్లు పొడుస్తున్నాయి. 48 శాతం ఎల్‌ఇడి బల్బులు ఉత్పత్తిదారు పేరు లేకుండా మార్కెట్‌కు వస్తున్నాయి. అలాగే 31 శాతం బల్బులపై తయారీ సంస్థ పేరు కూడా ఉండదు. వీటివల్ల ప్రభుత్వ ఆదాయానికి కూడా దెబ్బతగులుతోంది. పన్నుల వసూళ్ల ఆదాయం శుష్కించడానికి అవి కూడా కారణం. ప్రపంచ బ్యాంక్ ఇటీవల కితాబు ఇచ్చిన ‘సులభ వ్యాపార సౌకర్యం’ కూడా వాటివల్ల దెబ్బతింటోంది.
ఈ నకిలీ సరకులు పెట్టుబడుల లక్షాలను సైతం పక్కదోవ పట్టిస్తున్నాయి. ఔషధరంగంలో ఇదే పరిస్థితి సాగుతోంది. వాటి మార్కెట్ నకిలీ ఔషధాలతో నిండిపోతోంది. ఇతర వస్తువుల కంటే కొంచెం ఎక్కువగానే నకిలీ ఔషధాలు తయారవుతున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగిస్తున్న విషయం. ఎన్నో నకిలీ ప్రాణరక్షక ఔషధాలు బ్రాండెడ్ ఉత్పత్తుల ముసుగులో మార్కెట్‌కు వరదలా వచ్చిపడుతున్నాయి. ప్రతీ ఏడు ఔషధాలలో ఒకటి నకిలీది ఉంటోంది. పేరు ప్రఖ్యాతులు ఉన్న బ్రాండ్లు కూడా ప్రమాణాలు పాటించడంలో విఫలమవుతున్నాయి. వైద్యులు సూచించే ఔషధాలకు చాలా గిరాకీ ఉంది. వాటి ఆదాయం చాలా ఎక్కువ.
అందుచేత అటువంటి మందుల నకిలీ ఉత్పత్తులు మార్కెట్‌లో పెరిగిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘అప్లైడ్ ఫార్మా సైన్స్ జర్నల్’ తాజా సంచికలో ఒక అధ్యయన వ్యాసం ఈ నిజాన్ని బయటపెట్టింది. డిక్లోఫెనాక్ సోడియం అనే నొప్పి నివారణ మందు 32 నమూనాలను పరీక్షించి ఈ వ్యాసం రాశారు. అదే పత్రికలో గత ఏడాది ప్రచురితమైన మరో వ్యాసం అమోక్ సిసిలిన్ ట్రిహైడ్రేట్ అనే మరో మందు 46 నమూనా లను పరిశీలించి రాసిన వ్యాసంలో కూడా ఇదే అభిప్రాయం వెలువడింది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సిడిఎస్‌సిఒ) మార్కెట్‌లో కేవలం 4.5 శాతం ఔషధాలే నకిలీవని చెబుతోంది.
ప్రభుత్వ సంస్థ వాస్తవాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నట్లు దీనిని భావించాలి. ఆ వాదనతో స్వతంత్ర అధ్యయన కర్తలు అసలు ఏకీభవించడం లేదు. నాణ్యతా ప్రమాణాలు సరిగాలేని ఔషధాలు మార్కెట్‌లో 15 శాతం దాకా ఉన్నట్లు వారు చెబుతున్నారు. ఈ వివరాలు పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) మన దేశంలో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే విధంగా నకిలీ ఔషధాల స్థాయి ఉంటోందని హెచ్చరించింది. అయినప్పటికీ పరిస్థితిపై వినియోగదారుల వ్యవహారాల విభాగం అదుపు ఉండడం లేదు. అలాగే దర్యాప్తు సంస్థలు కూడా నియంత్రించలేకపోతున్నాయి. 1986 వినియోగదార్ల రక్షణ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తేవాల్సిన అవసరం ఎంతో ఉంది.
  * నంటూ బెనర్జీ (ఐపిఎ సర్వీసు)

Comments

comments