Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

పల్లెల్లో కొత్త పంచాయతీ

village

*కొపంచాయతీల ఏర్పాటుపై రాజకీయం నీడ
*తేల్చుకోలేని స్థితిలో గిరిజనులు
*కొత్తగా మరో 204 జీపిలకు ప్రతిపాదనలు

మన తెలంగాణ/బాన్సువాడ: పంచాయతీరాజ్ చట్టంలో సంస్కరణలు చేస్తున్నామన్న ప్రభుత్వ ఆశయం వెనక రాజకీయం మతలబు దాగి ఉంది. పంచాయితీల నీడన పార్టీ బలాన్ని పెంచుకునే ప్రక్రియ కొనసాగుతోంది. పంచాయితీల ఏర్పాటు ఏమో కాని ప్రశాంత పల్లెలు, గిరిజన తండాల్లో రాజకీయ అలజడి రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పంచాయతీరాజ్ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు చేస్తోంది. పాలనాపరంగా ప్రజల సౌలభ్యం కోసం గిరిజన తండాలు, మరికొన్ని జనరల్ గ్రా మాలను కొత్తగా పంచాయితీలుగా ఏర్పాటు చేసే యోచనలో సర్కారు అడుగులు ముందుకు వేస్తోం ది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం నూతన పంచాయితీల ఏర్పాటుకు కసరత్తులు మొదలు పెట్టింది. కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 323 గ్రామ పంచాయితీలుండగా, మరో అదనంగా 204 పంచాయితీలు ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు పంచాయితీలకు రాజకీయ రంగును పులుముతున్నారు. రాబోయే రోజుల్లో తమకు అనుకూలంగా ఉంటామని ఒట్టేసి చెబితేనే పంచాయితీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ చూపుతామని లోగుట్టు ఒప్పందాలకు తెరలేపుతున్నారు. ప్రమాణం చేయకపోతే పంచాయితీగా ఏర్పాటు కావడం కష్టమన్న షరతులను కూడా వారికి విధిస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. గిరిజనులపై రాజకీయం నీడ పడుతుండటంతో ఎటూ తేల్చుకోలేక అడకత్తెరలో పోకలా వారు నలిగిపోతున్నారు. పంచాయితీ ఏర్పాటుకు సై అందామా… లేక గిరిజన తండాలతోనే సరిపెట్టుకుందామా…అన్న అలోచన చేస్తున్నారు. పక్షం రోజులుగా పలు మండలాల్లోని నాయకులు  కొత్త పంచాయితీలపై దృష్టి సారించారు. అక్కడ పార్టీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి…రాబోయే రోజుల్లో అనుకూల వాతావరణం ఉందా… వ్యతిరేక పవనాలు ఏ విధంగా ఉన్నాయన్న అంశాలపై ద్వితీయ శ్రేణి నేతలు సమాలోచనలు చేస్తున్నారు. అనుకూలంగా ఉన్న ప్రాంతాలను వదిలేసి ప్రతిపక్ష పార్టీలకు మద్దతుగా ఉన్న తండాలపై నాయకులు దృష్టి సారిస్తున్నారు. ఆ ప్రాంత వాసులను కలిసి పంచాయితీ కావాలంటే మాకు అండగా ఉండాలి… అందుకు మీరు సమ్మతమేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారన్న వదంతులు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 87 తండాలు ఉన్నాయి. ఇవే కాకుం డా మరో 117 జనరల్ గ్రామాలు కూడా పంచాయితీ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను బట్టి ఐదు వందల జనాభా ప్రతిపాదికన గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు. అందులో భాగం గా జిల్లాలో పంచాయితీ అధికారులు 204 గ్రామాలను గుర్తించారు. దీని ధరిమిలా రాజకీయ నాయకులు ముఖ్య నాయకులు సలహాల మెరకు రంగ ప్రవేశం చేస్తున్నారు. వారం రోజులుగా ఇదే పనిలో నిమగ్నమై అధికార పార్టీకి ఆ ప్రాంత ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు పంచాయితీ సంస్కరణలకు ఊతమిస్తూనే ప్రభుత్వం మరోవైపు అధికార పార్టీ జెండా నీడలో పంచాయితీలు ఉండేలా గుట్టుగా ఏర్పాట్లు చేసుకోవడంపై ప్రతిపక్షాలు సైతం అటువైపుగా దృష్టి సారించాయి. నేతల ఆగచాట్లను పసిగడుతూ వారి ప్రయత్నాలను విఫలం చేసే దిశగా ప్రతిపక్ష నేతలు సన్నద్దమవుతున్నారు. ఏది ఏమైనా కొత్త పంచాయితీల ఏర్పాటు ఏమో కాని ప్రశాంత పల్లెలు, గిరిజన తండాల్లో రాజకీయ అలజడి రేపడం ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.

Comments

comments