Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

బంధుప్రీతి.. పోలీసు నీతి!

ఖమ్మాన్ని వీడటానికి ఖాకీల ససేమిరా
సంవత్సరాల తరబడి ఒకేచోట తిష్ట
బంధు ప్రీతితో పెరుగుతున్న అవినీతి
బదిలీల్లో రాజకీయ జోక్యం
పాలకుల వారీగా పోలీసుల్లో విభజన

సర్కారు కొలువంటే సవాలక్ష లెక్కలు! బదిలీపైన బదిలీలు..!! ఒకచోట స్థిరపడేలోపే మరోచోటికి..!!! కానీ పోలీసు శాఖకు వీటినుంచి మినహాయింపు ఇచ్చేశారేమో అనిపిస్తోంది. ఖమ్మంలో ఇటీవల చోటుచేసుకున్న బదిలీలను చూస్తే ఇది తేటతెల్లమవుతోంది. ఎస్‌ఐ నుంచి డిఎస్‌పి వరకూ ఖమ్మంలోనే ఉద్యోగమంటే సందేహం కలగదా మరి! ఒకేచోట తిష్ట వేయడంతో బంధుప్రీతి పెరుగుతోందని… తద్వారా అవినీతి పెచ్చుమీరుతోందనే ఆరోపణ వినిపిస్తోంది. బదిలీల్లో రాజకీయ జోక్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పాలకుల వారీగా పోలీసుల్లో విభజన జరిగిందనే వాదన జోరుగా వినిపిస్తోంది.

                   Police

ఖమ్మం: ప్రభుత్వ శాఖలో ఒకే చోట సంవత్సరాల తరబడి తిష్టవేయడమంటేనే వ్యవస్థకు అదెంతో ప్రమాదం. దీనివల్ల స్థానికంగా కొందరికి దగ్గరయ్యే అవకాశముంది. ఆ పరిచయం కాస్తా.. పరిపాలననుపక్కదారి పట్టించేవరకూ వెళ్లే ప్రమాదముంది. అయితే.. ఖమ్మంలో ఇవన్నీ జరుగుతున్నాయనే ఆరోపణ ఉంది. పోలీసుల శాఖలో ఎస్‌ఐగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన వ్యక్తి డిఎస్‌పి స్థాయి.. అంతకుమించిన స్థాయి వరకూ ఖమ్మంలో, రూరల్, అర్బన్, పరిసరాల్లోనే ఉద్యోగం చేయడం ఈ ఆరోపణలకు బలాన్నిస్తోంది. బదిలీల్లో రాజకీయ జోక్యం… పోలీసు శాఖలో బదిలీ అంటేనే రాజకీయాలతోపని. ఇటీవల అవిభాజ్య ఖమ్మం జిల్లాలో పోలీసు శాఖలో బదిలీలు వరుసగా జరిగాయి. తొలుత 13 మంది ఎస్‌ఐలకు పోస్టింగులు ఇచ్చారు. వీటిలో మంచి స్థానంలో ఉద్యోగం కోసంఎస్‌ఐలు విశ్వప్రయత్నం చేసినట్టు తెలిసింది. తర్వాత నలుగురు డిఎస్‌పిలకు పదోన్నతి లభిం చింది. వీరు సైతం కావాల్సిన చోటే పోస్టింగ్ ఇప్పించుకున్నారనే వాదన ఉంది. ఇటీవలే తొమ్మిది మంది సిఐలకు పదోన్నతి లభించింది. పూర్తిగా రాజకీయ జోక్యంతోనే ఈ పోస్టింగులు ఇచ్చారని ఏకంగా పోలీసు శాఖలోనే చర్చ
జరగడం పరిస్థితికి అద్దం పడుతోంది.

బంధుప్రీతి.. అవినీతి!

కొంతమంది పోలీసులు అధికారులు ఖమ్మం నగరాన్ని అంటిపెట్టుకుని సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఒక ప్రాంతంలో ఎక్కువ కాలం పనిచేస్తే ఆయా ప్రాంతంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వ్యాపారస్తులతో సంబంధాలు మెరుగు పడి తద్వారా బంధుప్రీతి పెరిగి దీంతో అవినీతి పెరిగే అవకాశం ఉన్నందున ఏ ప్రభుత్వ ఉద్యోగిని అయినా కొంతకాలం తర్వాత ఆ ప్రాంతం నుంచి బదిలీ చేస్తారు. కానీ ఖమ్మంలో జిల్లాలో పనిచేసే పోలీస్ అధికారుల్లో ఇది ఎక్కడా కనిపించదు. సుమారు 10 నుంచి 15 సంవత్సరాలుగా ఖమ్మం నగరాన్ని అంటిపెట్టుకుని ఉన్న పోలీస్ అధికారులు ఖమ్మం రూరల్, అర్బన్, ట్రాఫిక్ సంబంధిత వివిధ విభాగాల్లో బదిలీలు చేయించుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఎస్‌ఐ స్థాయి నుంచి డిఎస్‌పి స్థాయి వరకూ ఖమ్మం నగరం చుట్టు పక్కనే విధులు నిర్వహిస్తూ స్థానిక నేతలతో సంబంధాలు పెట్టుకుని కన్‌స్ట్రక్షన్ వంటి వ్యాపార సంబంధాలు పెట్టుకుని బంధుప్రీతి పెంచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన, సమాజాన్ని సరైన మార్గంలో నడిపించాల్సిన పోలీసు శాఖలోనే ఒకేచోట తిష్ట వేయడమంటే వ్యవస్థకు తీరనినష్టం చేయడమే..!

Comments

comments