Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

ఆగని దళారుల దందా

saned

* రైతు కంట కన్నీరుగార్చినా మార్పు శూన్యం
* మొన్న కందులు.. నిన్న పెసర్లు.. నేడు వరి ధాన్యం..
* చర్యలు తీసుకోకపోవడంతో రెచ్చిపోతున్న కమీషన్‌దారులు
* మన తెలంగాణ కథనానికి స్పందించిన జెసి సంజీవరెడ్డి

మన తెలంగాణ/సూర్యాపేట: మార్కెట్‌కు రైతు తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని మార్క్‌ఫెడ్, పిఎసీఎస్ సూర్యాపేట, చివ్వెంల ఆధ్వర్యంలో కొనుగోలు చేయాల్సి ఉంది. ఉదయం తొమ్మిది గంటలకే ధాన్యాన్ని తేమ శాతం చూడాల్సిన అధికారులు 11 గంటలు దాటినప్పటికి ఎటువంటి తేమ శాతాన్ని చూడలేదు. మధ్యాహ్నం తర్వాత తేమ శాతాన్ని చూడలేని అధికారులు చేతులెత్తెస్తే, దళారులు రంగంలోకి దిగి తమ దందాను రైతు వద్ద ప్రదర్శించడానికి అవకాశం ఉంది. ఎన్ని పంటలు పండినా, రైతు కన్నీరుగార్చిన కమీషన్‌దారులు మాత్రం తమ పద్ధతిలో మార్పులు కోరుకోపోవడం విచారకరం.
మన తెలంగాణ దినపత్రిక కథనంపై స్పందించిన జెసి
ఈ నెల 29న మన తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కమీషన్‌దారుల కక్కుర్తి కథనానికి జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి స్పందించారు. వ్యవసాయ మార్కెట్‌లో ఏఏ కమీషన్‌దారులు రైతుల వద్ద పంటలు కొనుగోలు చేస్తున్నారో పూర్తి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. నెల రోజుల పాటు లేని కొనుగోలు ఐదు రోజులలోనే ఎందుకు…? ఎవరి వద్ద ఎక్కువ …? కొనుగోలు చేశారో వారి పేర్లను త్వరితంగా అందజేయాలని కోరారు. పెసర్ల కొను గోలుపై జరిగిన అవకతవకలు పరిశీలించడానికి మార్కెట్‌కు వచ్చిన జాయింట్ కలెక్టర్ మార్కెట్‌లో ఉన్న వరి ధాన్యం రాశులను చూసి ఆశ్చర్యపోయారు. తొమ్మిది గంటలకు తేమను పరిశీలించాల్సిన అధికారులు ఎందుకు పరిశీలించ లేదని ప్రశ్నించారు. ఎవరి కోసం తమ పనిలో ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల ఆలస్యంపై అధికా రులకు వెంటనే మెమోలను జారీ చేయాలని డిసిఎస్‌ఓ అనురాధను ఆదేశించారు. ఆయన వెంట డిఎంఓ రాంపతి, మార్క్‌ఫెడ్ అధికారి, మార్కెట్ గ్రేడు 2 సెక్రటరీ పోశెట్టి తదితరులు ఉన్నారు.

Comments

comments