Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

వందశాతం శుద్ధీకరణ గ్రామంగా బసిరెడ్డిపల్లి

 

madam

వికారాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యాదేవరాజన్

మనతెలంగాణ/పరిగి : వందశాతం భూ రికార్డుల శుద్ధీకరణ గ్రామంగా బసిరెడ్డిపల్లి గ్రామం కావడం చాలా సంతోషకర విషయమని కలెక్టర్ దివ్యా దేవరాజన్ పేర్కొన్నారు. పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ముందుగా గ్రామస్తులను, రెవెన్యూ సిబ్బందిని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన(భూ రికార్డుల శుద్ధీకరణ)లో భాగంగా పరిగి మండలంలో మొట్ట మొదటగా బసిరెడ్డిపల్లి గ్రామం 100 శాతం శుద్ధీకరణ  కావడం అభినందించదగ్గ విషయమన్నారు. అప్ప ట్లో నిజాం, నవాబుల కాలం నాటి నుంచి భూమికి శిస్తు కట్టించుకునేవారని అప్పట్లో అందరి భూములకు సంబంధించిన రికార్డులు సక్రమంగా ఉండేవన్నారు. ఎన్టీ రామారావు వచ్చాక భూమికి సంబంధించి శిస్తు కట్టడం రద్దు చేశారు. అప్పటి నుంచి భూమికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించుకోవడంపై రైతులు ఆసక్తి చూపించలేదన్నారు. భూమి పట్టాదారులు తాతలు, తల్లిదండ్రులు చనిపోయినా ఇంకా వారి పేర్ల మేదే పట్టాలను కొనసాగుతున్నాయన్నారు. ఇప్పడు వాటిని మార్చాలంటూ ప్రతి రోజూ మా కార్యాలయానికి నేటికి 20 మంది వరకు వస్తుంటారన్నారు. భూ సమస్యలు పరిష్కరించాలంటూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగకుండా భూ ప్రక్షాలన పేరుతో మీ గ్రామంలోనే మీ భూ సమస్యలను సరిదిద్దుకునేలా అధికారుల బృందం వచ్చి రికార్డులను శుద్ధీకరణ చేస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బసిరెడ్డిపల్లి గ్రామంలో ఒక సర్వే నెంబరుకు తప్ప అన్ని సర్వేనెంబర్లులో రికార్డులను సరిచేయడం జరిగిందన్నారు. రికార్డుల శుద్ధీకరణ అనంతరం గ్రామ భూ వివరాలకు సంబంధించిన లిస్టును గ్రామ పంచాయతీ కార్యాలయంలో అతికించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో 100 శాతం శుద్దీకరణ చేసేందుకు గ్రామాల రైతులు, అధికారులు, పాలకులు సహకరించాలని కోరారు. అనంతరం తహసీల్దార్ ఆబేద్‌అలీ మాట్లాడుతూ గ్రామానికి సంబంధించి మొత్తం 110 సర్వేనెంబర్లు, వన్‌బి ప్రకా రం మొత్తం 264 ఖాతాలు ఉన్నాయన్నారు. మొత్తం గ్రామ విస్తీర్ణం 759.11, మొత్తం 264 మంది పట్టాదారులు ఉన్నారన్నారు. మొత్తం ప్రభుత్వ భూమి 315 ఎకరాల భూమి ఉందన్నారు. అనంతరం కొత్తగా పట్టాలు మార్చుకున్న రైతులు ప్రొసిడింగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి, గ్రామస్తులు విజయ్, వీఆర్‌ఓలు ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments