Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

కొనుగోళ్లు వెలి..రైతన్న బలి

rice* కొనుగోలు కేంద్రాలలో కనిపించని కనీస సౌకర్యాలు
*పాతిక రోజుల నుంచి పడిగాపులు
*కొనుగోలులో రాష్ట్రంలోనే జిల్లా నెం1 అంటున్న అధికారులు

మనతెలంగాణ/మెదక్ ప్రతినిధి : రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని రేపు, మాపు అంటూ దాదాపు ఇరవై అయిదు రోజులు గడిచినా ధాన్యాన్ని తూకం వేయడంలేదు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతల పట్ల హమాలీల నుండి అధికారుల వరకు దురుసుగా ప్రవర్తిస్తూ నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిద్దామంటే నిర్వాహకులు పట్టపగలే చుక్కలు చూపిస్తూన్నారని అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం పూర్తిగా ఎండిపోయి, తేమశాతం లేకున్నా ధాన్యాన్ని నెలరోజుల తరబడి తూకం వేయకుండా నిలిపివేస్తున్నారు. హమాలీలను బ్రతిమిలాడినా కనికరం చూపడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు తమ వరిధాన్యం రాసుల వద్ద ఎముకలు కొరికే చలిలో రాత్రులు వెళ్లదీస్తున్నారు.
సరిపడ గన్నీబ్యాగులు కూడా ఇవ్వడం లేదని, ఇచ్చినా గన్నీబ్యాగులు మధ్య మధ్యలో చిరిగిపోయి రంధ్రాలు ఏర్పడి ధాన్యం అందులోంచి నేలపాలవుతుందని తెలిపారు. దీంతో తమకు తరుగు శాతం పెరిగి నష్టపోతామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. హమాలీలకు 500 రూపాయలు (మద్యం కోసం) అదనంగా ఇస్తూ 40 కిలోల బస్తాను ఉచితంగా ఇస్తేగానీ ధాన్యాన్ని తూకం చేసి లారీలలో నింపమని తెగేసి చెబుతున్నారు. అంతేకాకుండా క్వింటాలుకు 25 రూపాయల హమాలీ కూడా చెల్లించాలన్నారు. దీంతో రైతులు గత్యంతరం లేక వారు అడిగినంత చెల్లించుకొని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తున్నారు. అయినప్పటికీ సకాలంలో వారి ఖాతాలలో ధాన్యం తాలుకు డబ్బులు జమ కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నదాతలు తెలుపుతున్నారు. ప్రతిరోజూ మెదక్ జిల్లా కేంద్రంలోని కొనుగోలు కేంద్రం నుండి ఒకటి నుండి రెండు లారీల ధాన్యాన్ని మాత్రమే తరలిస్తున్నారని, దీనికి ప్రధాన కారణం హమాలీల జులుమే కారణమన్నారు. రైతులు ధాన్యాన్ని నింపి మోసేందుకు బయట నుండి వేరే వ్యక్తులను తీసుకురావద్దని ప్రత్యేకమైన నిబంధనను ఏర్పాటు చేసి తీవ్ర అంతరాయం కల్పిస్తున్నారని రైతులు తెలుపుతున్నారు. ఇదంతా కూడా అధికారులకు పూర్తి స్థాయిలో తెలినప్పటికీ రైతులవైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని ఆందోళన చెందుతున్నారు. కనీస సౌకర్యాలు కూడా లేవని, తాగడానికి మంచినీరు, పడుకోవడానికి ప్రత్యేక గది వంటివి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి బదులుగా తాము దళారులను ఆశ్రయిస్తేనే ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు అయ్యిఉండేదని, డబ్బులు కూడా చేతికి అందేవని అంటున్నారు. వచ్చే సంవత్సరం నుండి తాము పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకురామని అంటున్నారు. ఐకెపి, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలు పేరుకే ఉన్నాయని, వీటివల్ల తమకు ఒరిగేందేమిలేదని చెబుతున్నారు. కలెక్టరమ్మ చొరవతీసుకొని ఈ దోపిడీలను నివారించాలని వేడుకుంటున్నారు.
మహిళా రైతు లక్ష్మి, నవాబుపేట వీధి, మెదక్ :
రాత్రిపూట చల్లటి చలిలో ధాన్యం కుప్పల వద్ద నిద్రిస్తున్నామని, కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో సకాలంలో తీసుకోక తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చిన్న రైతునని వచ్చినా ఎంతో కొంత డబ్బుతో అప్పులు తీర్చుకుందామంటే సరైన సమయంకు కొనుగోలు చేయడం లేదని, హమాలీల దోపిడీలు అధికమయ్యాయని, అధికారులు వారికి వంతుపాడుతున్నారనిఅన్నారు. ఇకనైనా వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు తమ ఖాతాల్లో జమ చేయాలని వేడుకుంటున్నారు.
డిఆర్‌వో వి. రాములు వివరణ….
జిల్లాలో ఐకెపి ద్వారా 77, పిఎసిఎస్ ద్వారా 126 కేంద్రాలు, మొత్తం 203 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతానికి మాత్రం 178 కొనుగోలు కేంద్రాలే కొనసాగుతున్నాయని తెలిపారు. గతనెలలో ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలకు వ్యవసాయశాఖ అధికారులు అందించిన నివేదిక ప్రకారం 1.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినప్పటికీ, దోమకాటు వల్ల అంతధాన్యం రాలేదన్నారు. గురువారం నాటికి జిల్లా వ్యాప్తంగా 23.199 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి అందులోంచి 22.862 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించామని తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుండి కొనుగోలు ధాన్యం బాపతు 20.87 కోట్ల రూపాయలు విడుదల కాగా అందులో నుండి ఎస్‌బిఐ బ్యాంకులో 16.01 కోట్లు రైతుల కోసం జమచేశారమన్నారు. అందులోంచి 4.81 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమయయ్యాన్నారు. మిగితావి కూడా వెంటనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమచేయవల్సిందిగా కలెక్టర్ బ్యాంకుల వారిని ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఆన్‌లైన్ ఇబ్బందులతోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు సకాలంలో జమ కాలేకపోతున్నాయని అన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 5829 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఇంత త్వందరగా కొనుగోలు, చెల్లింపులు జరగడం లేదని, మెదక్ జిల్లానే నెంబర్ వన్ స్థానంలో ఉందని డిఆర్‌వో వి.రాములు తెలిపారు

Comments

comments