Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

రెచ్చిపోతున్న ఇసుకాసురులు

sand2అడ్డదారుల్లో గోదావరి నుంచి ఇసుక తరలింపు
ఒకే వేబిల్లుపై వారాల తరబడి రవాణా
కేసులు నమోదు చేస్తున్నా పట్టించుకోని అక్రమార్కులు
ప్రత్యేక అధికారులను నియమించినా ఫలితం శూన్యం
ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న ఇసుక వ్యాపారులు

ఇసుకాసురులు మరింతగా రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతులు పొందకుండానే గోదావరి తీరం నుంచి ఇసుకను ట్రాక్టర్లలో  అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. పోలీసులు పలు సార్లు అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని జరిమానాలు విధించినప్పటికీ అక్రమార్కులు యదావిధిగా ఇసుక వ్యాపారాన్ని  కొనసాగిస్తున్నారు.  అడ్డదారుల్లో ఒకే వే బిల్లుపై వారాల తరబడి ఇసుకను  రవాణా చేస్తున్నారు.  ఇసుక వ్యాపారులు అధికారుల కళ్ల ముందునుంచే ప్రతినిత్యం వందలాది ట్రాక్టర్లు, లారీలలో  ఇసుకను అక్రమంగా తరలిస్తున్నప్పటికీ  పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక అధికారులను నియమించినప్పటికీ  ఫలితం కానరావడం లేదు. ప్రతినిత్యం వందలాది వాహనాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ వ్యాపారులు  కోట్లకు పడగలెత్తుతున్నారు.  ప్రజా  అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదితో పాటు మరికొన్ని వాగుల్లో ఇసుక రీచ్‌లకు అనుమతి ఇచ్చింది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయడమే కాకుండా ఆదాయం పెంపచుకోవాలనే ఆలోచనతో కొత్త విదానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.మంచిర్యాలజిల్లాలోని గోదావరి తీరంలో అధికారికంగా ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసినప్పటికీ అడ్డదారుల్లో ఇసుక అక్రమంగా తరలిపోతుంది. రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించి, ట్రాక్టర్లను పట్టుకోవడంతో పాటు వాటికి జరిమానా విధించి వదిలిపెడుతుండగా అక్రమార్కులు జరిమానాలు చెల్లిస్తూ ఇసుక దందాను యదావిధిగా కొనసాగిస్తున్నారు. ఒక ఇసుక ట్రిప్పులో రెండు సార్లు జరిమానాలు చెల్లించవచ్చునని ఇసుక వ్యాపారులు మరింతగా రెచ్చిపోతున్నారు. ఒక్కో ట్రాక్టర్ మూడు సార్లకంటే ఎక్కువ సార్లు పట్టుబడినట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని గతంలో పో లీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ ఇసుక అక్రమ రవాణా వ్యవహారం యదేచ్చగా కొనసాగుతుంది. జిల్లాలోని నస్పూర్ మండలం, సింగాపూర్,తాళ్లపల్లి గ్రామాల శివారులో గల గోదావరి తీరంలో అధికారిక ఇసుక రీచ్‌లు లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారి కాసులు కురిపిస్తోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడిన తరువాత నూతనంగా భవన నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో కోల్‌బెల్ట్ ప్రాంతాలైన శ్రీ రాంపూర్, సిసిసి నస్పూర్,మంచిర్యాల, ఇందారం, రామరావుపేట గ్రామాలకు గోదావరి తీరం నుంచే ఇసుకను రవాణ చేస్తారు. సింగాపూర్ గ్రామం ఓపెన్‌కాస్టుతో ముంపుకు గురికావడం వలన అక్కడ ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేయలేదు. అదే విధంగా తాళ్లపల్లిలో ఇసుక రీచ్‌ను ప్రారంభించేందుకు వచ్చిన ఎంఎల్‌ఏ దివాకర్‌రావును గ్రామస్థులు అడ్డుకున్నారు. గోదావరి నది నుంచి రాత్రి సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఒక్కో ట్రాక్టర్‌లోడును రూ. 1200 నుంచిరూ.1500 విక్రయిస్తూ సోమ్ము చేసుకున్నారు. గత ఆరు నె లలుగా పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టుకున్న ట్రాక్టర్ల వివరాలను పరిశీలించినట్లయితే మొత్తం 103 ట్రాక్టర్లను పట్టుకొని జరిమానా విధించారు. మే నెలలో 30, జూన్‌లో 13, జులై10, ఆగస్టులో 22, సెప్టెంబర్‌లో 15, అక్టోబర్‌లో 13 ట్రాక్టర్లను పట్టుకున్నప్పటికి ఇసుకాసురులు జరిమానాలు చెల్లిస్తూ అక్రమ దందాను యదావిధిగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

Comments

comments