Search
Wednesday 22 November 2017
  • :
  • :

రిటైల్ ద్రవ్యోల్బణం 3.58%

 అక్టోబర్‌లో ఏడు నెలల గరిష్ఠానికి
 ఆహార ధరలు పెరగడమే కారణం

inflationన్యూఢిల్లీ : ఆహార ధరలు ప్రియం కావడం.. ప్రత్యేకించి కూరగాయల ధరలు ఆకాశాన్నంటడంతో అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్ఠానికి చేరుకుంది. వినియోగ ధరల సూచీ(సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.58 శాతం నమోదైంది. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం 3.28 శాతంతో పోలిస్తే ఈసారి పెరిగింది. ఇంతకుముందు మార్చి నెలలోనూ రిటైల్ ద్రవ్యోల్బణం అత్యధికంగా 3.89 శాతం నమోదైంది. దీంతో వచ్చే నెలలో ఆర్‌బిఐ సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపునకు అవకాశాలు తగ్గిపోయాయి. కేంద్ర గణాంకాల శాఖ(సిఎస్‌ఒ) విడుదల చేసిన వివరాల ప్రకారం, అక్టోబర్‌లో ఆహార ధరల ద్రవ్యోల్బణం 1.9 శాతానికి పెరిగింది. సెప్టెంబర్‌లో ఇది 1.25 శాతం మాత్రమే ఉంది. కూరగాయల సెగ్మెంట్‌లో ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపింది. కూరగాయల ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో 3.92 శాతంతో పోలిస్తే అక్టోబర్‌లో రెట్టింపు అయి 7.47 శాతానికి చేరింది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు గుడ్లు, పాలు(దీనికి సంబంధించిన ఉత్పత్తులు) వంటి వాటిలోనూ అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదైంది. వరుసగా చూస్తే అక్టోబర్‌లో పండ్లు చౌకగా మారాయి. పప్పు ధాన్యాల్లో ద్రవ్యోల్బణం వరుసగా క్షీణించి మైనస్ 23.13 శాతానికి చేరింది. ఇంధనం ధరలు ప్రియం అయ్యాయి. గణాంకాల ప్రకారం, గృహ రంగంలోనూ ద్రవ్యోల్బణం పెరుగుదల కనిపిస్తోంది. అయితే ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో జరగనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరో ద్వైమాసిక సమీక్షపైనే అందరి దృష్టి నెలకొంది. డిసెంబర్ 5, 6 తేదీలలో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకొనున్నారు. అయితే ప్రస్తుత ద్రవ్యోల్బణం గణాంకాలను చూస్తే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అమ్మకాలతో మార్కెట్లు పతన బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 265 పాయింట్లు క్షీణించి 33,049కు చేరగా.. నిఫ్టీ 89 పాయింట్లు తిరోగమించి 10,232ను తాకింది. మిడ్ సెషన్ నుంచీ పెరిగిన అమ్మకాలతో ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ నష్టపోయాయి.

Comments

comments