Search
Monday 11 December 2017
  • :
  • :

లారీ-కారు ఢీ : నలుగురు మృతి

accident

మృతులంతా ఒకే కుటుంబం
వావిలాలలో విషాదచ్ఛాయలు

తొర్రూరు : వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామం వద్ద శుక్రవారం జరిగిన  రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం… నెల్లికుదురు మండలం వావిలాల గ్రామానికి చెందిన నల్ల శ్రీనువాస్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తొర్రూరులోని తమ బంధువుల వివాహ వేడుకలకు హాజరై తిరిగి వావిలాలకు వెళ్తున్నారు. మాటేడు స్టేజి వద్ద లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న శ్రీనువాస్‌రెడ్డి (40), అతని తల్లి లక్ష్మి (65), శ్రీనువాస్‌రెడ్డి భార్య మాధవి (32), కుమార్తె కృష్ణవేణి (10)లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జరగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి ఏమి జరిగిందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వాహనదారులు జరిగిన ప్రమాదాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఒకే  కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో వారి బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని రోదిస్తున్న తీరు ఎంతో కలచివేసింది. స్థానికులు కూడా బోరున విలపించారు. వారి స్వగ్రామమైన వావిలాలలో విషాద ఛాయలు నెలకొన్నాయి.  ఘటనా స్థలాన్ని తొర్రూరు డిఎస్‌పి రాజారత్నం సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ చేరాలు, ఎస్‌ఐ రమణమూర్తి తెలిపారు.

Comments

comments