Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

యు ఆర్ ఇన్ వెయిటింగ్ ప్లీజ్ !

Cartoon-New

చిన్నవాడు పెద్ద వాడవ్వాలంటే రెక్కలు పుచ్చుకొని పైకి బలవంతంగా లాగితే అవడు. దానికి కొన్నేళ్లపాటు వెయిట్ చేయాలి. పదేళ్లవాడు అవడానికి పదేళ్లూ, 20 ఏళ్లవాడు అవడానికి 20 ఏళ్లూ ఆగాలిమరి. కొంతమందికి వేచిచూసే గుణం ఉండదు. డెమన్‌ని ప్రకటించగానే నల్ల డబ్బు పట్టేయాలంటారు. అంత తొందర పడితే ఎలా? కొన్నిటికి ఓ వెయ్యేళ్లైనా ఆగొద్దా? పురాణ కథలు తిరగేయండి. ఫలానా రాక్షసుడి పీడ విరగడ అవ్వాలంటే దేముడు మంచిరోజు చూసుకొని అవతారమెత్తాలి. పెరిగి పెద్దయి అస్త్ర శస్త్ర విద్యలు నేర్చి, నారదుడిని డిప్లొమసీ లోకి దింపి, విలనాసురుడి పీచమణచాలి. దేవతలకి రుషులు మొరపెట్టుకోగానే సరా? అసలు ఈ అవతారాల గురంచి పెద్ద థింక్ టాంక్‌లు ఎంతో చెప్పాయి.

గజేంద్రుణ్ణి మొసలి కాలు పట్టుకోగానే ‘సిరికిం జెప్పడు’ స్టయిల్లో పరుగున వచ్చిన దేముడు రుషుల మొర తీర్చడానికి అవతారాలు వగైరా షరతులు ఎందుకు పెట్టినట్టు? దేముళ్ల రెడ్‌టేపిజం ఇది అనకండి. శిష్టరక్షణ తక్షణమే చేయాలి. దుష్ట శిక్షణ తరవాత చేయవచ్చు. దేముడు అవతారం దాల్చాలంటే భూమ్మీద ఎవరో మహా తల్లి కడుపు పండాలి. ఆమెకు పుట్టిన అవతార పురుఫుడు పెద్దయ్యేలోగా విలన్ గారి పాపం పండుతుంది. అందుకే దేముడి పార్టీవాళ్లు ఏంచేసినా పురాణ పుస్తకాల గైడ్లు దొరకనిదే ఏమీ చేయరు. అందుకే డెమన్‌లోని మంచి పండడానికి ఇంకా చాలా సమయం ఉంది అవును డెమన్ క్యూలలో అని తెలుసుకోండి. ఈ లోగా ఆ నల్ల డబ్బు బ్యాంకుల ముందు క్యూలలోంచి కాకుండా దొడ్డిదోవలో వచ్చి ఆ బ్యాంకు అరలని పరుపులు చేసుకొని ఆ బ్యాంకుల నుంచి హాయిగా వడ్డీ వసూలు చేయడాన్ని తలచుకొని ఔరా అనుకొంటే అనుకోండి.

ఫలితాల గురించి ఆలోచించకుండా నీపని నువ్వు చేయాలి అని సాక్షాతు ఘంటసాల భగవద్గీతలో చెప్పలేదా! అంతమాత్రానికే ‘డెమన్ ప్రూవ్డ్ డెమన్’ అని ఎలా అంటారు? అసలు అవతారాలమీద నాకో కంప్లయింటు. మనిషి అవతారం దాల్చితేగాని మంచి చేయలేని వాళ్లు దేముళ్లమంటూ కిరీటాలు ఎందుకు పెట్టు కొంటున్నారు? వాటిని తీసేసి డ్రామా కంపెనీల వాళ్లకి ఇచ్చేయండి. మనిషికి ఏదో పని ఉండి పట్నం పోయినట్లు దేముడికి ఏదో పనిబడితేనే భూమ్మీదకు వస్తాడని అర్థమవుతోంది. దేముడితో పాటు ఆయన భార్యకూడా అవతారం దాల్చి అవతారిణి అవ్వాలి. తప్పదు. గజేంద్ర మోక్షంలో గజప్రాణావనోత్సాహంలో పరిగెడుతున్న విష్ణుమూర్తి వెంట గరుత్మంతుడు, పరివారం యావత్తూ పరుగు పెట్టిందట. ఆహా! ఏమి ఊహ.. జోహార్! కానీ డెమన్ క్యూలలో చనిపోతున్న వాళ్ల కోసం అలా పైనించి దేవుడు దిగి దిగి రాలేదే. ఓహో.. వాళ్లు విఐపిలు కాదా.. విఐపిలయితేనే దేముడు వస్తాడా.. సరే సరే..

Comments

comments