Search
Tuesday 19 June 2018
  • :
  • :

బండెక్కిన సినిమా!

harivillu

ప్రేమకి హృదయాలు ఇచ్చి పుచ్చుకోవడంతో పాటు మంచి బండి కూడా అవసరం. బండి అంటే వాహనం. ప్రేమకోసమై వలలో పడేవాళ్లను చూశాం, విన్నాం పాతాళ భైరవిలో. కానీ ప్రేమ బండి ఎక్కడం ఎప్పుడూ వినలేదే అనకండి. సినిమాలు శ్రద్ధగా చూసేవాళ్లకి ప్రేమ బండిసంగతి బాగా గుర్తుంటుంది.

పాత కాలంలో సినిమా హీరో లేదా హీరోయిన్ బండి.. సాక్షాత్తూ ఎడ్ల బండి ఎక్కేసేవారు. రాజ్ కపూర్ ఆవారా పాట ‘బండి హీరోయిన్లని’ ఉద్దేశించే. ఈ విషయంలో దేవానంద్ కూడా తక్కువ తినలేదు. మల్లీశ్వరి సినిమాలో భానమతి, ఎన్టీరామారావు పాడిన ‘పరుగులు తీయాలి గిత్తలు’ పాట ఎడ్లబండిపాటే! సూపర్ హిట్. అలాగే చిరంజీవులు సినిమాలో ‘చికిలింత చిగురు’ పాట కూడా ఎన్టీఆర్, జమునలపై చిత్రీకరించారు. దేవదాసు సినిమాలో నాగేశ్వరరావు నటించిన ‘పల్లెకుపోదాం పారును చూదాం’ పాట గుర్రపు బండిపై చిత్రీకరించారు. పూలరంగడు సినిమాలో ‘నీతికి నిలబడి’ పాట కూడా జట్కాబండి మీద చిత్రీకరించిందే! పాడిపంటలు సినిమాలో కృష్ణ, విజయనిర్మలపై ‘ఇరుసులేని బండి ఈశ్వరుని బండి’ పాట ఎడ్లబండి మీదే చిత్రకరించారు. సోగ్గాడు సినిమాలో శోభన్‌బాబు, జయచిత్రపై ‘’సోగ్గాడు లేచాడు’ పాట దుమ్ముదులిపేసింది. అలాగే తాజాగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగార్జునపై ‘వస్తానే వస్తానే’ పాటను జట్కాబండిపై చిత్రీకరించారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి పాటలు లేకపోవడం వల్ల చాలా క్లిక్ అయింది.

పెద్దపెద్ద హీరోలేకాదు కమెడియన్లు కూడా బండెక్కారు. ‘ఎక్కు మామ.. బండెక్కు మామ’ అనే పాట ఓ కామెడీ రాణి కెమెడియన్‌ని కవ్విస్తూ పాడినదే. బడిపంతులు సినిమాలో ‘ఓరోరి పిల్లగాడా..’ అనే సూపర్‌హిట్ సాంగ్ రాజబాబు, కుట్టిపద్మిని మీద తీసిందే! ఆతరవాత హీరో హీరోయిన్లని ఎడ్లబండి ఎక్కించడం దర్శకులకి నామోషీ అనిపించింది. మారే ఫ్యాషన్లవెంట దర్శకులు, వారి వెంట నిర్మాతలు, ఆ వెంట ఫైనాన్సర్లు పరిగెట్టాలి కదా.
బండి ఫ్యాషన్‌ని దించేసి, సైకిల్‌ని ఎక్కించారు తెరమీదికి. శ్రీమంతుడు సినిమాలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు సైకిల్‌పై పాడిన ‘పోరా శ్రీమంతుడా’ పాట సంచలనాత్మక హిట్‌కు కారణమైంది. ‘ఏదైనా హీరో, హీరోయిన్ ఎక్కితేనే తెరకి నిండు అని జ్యోతి సినిమాలో మురళీమోహన్, జయసుథ పాడిన ‘సిరిమల్లె పూవల్లె నవ్వు’ పాట నిరూపించింది. ‘పెళ్ళి కానుక’ చిత్రంలో ఎఎన్‌ఆర్,బి.సరోజ …సైకిల్ తొక్కుతూ ‘వాడుక మరచదవేలా..’. అలా హీరోలు సైకిల్ మీద హీరోయిన్‌లని పటాయించడం పూర్వం చేశారు. ఇప్పుడు నిజ జీవితంలో తప్ప ఏ హీరోయిన్‌ని అయినా సైకిల్ మీంచి హీరో లవ్ చేస్తే ఆ కథ ముందుకు సాగుతుందా? ఆ కథకి కంచి చాలా దూరమైపోతుంది ష్యూర్.

ఎంత అందగాడైనా ప్రేమించేవాడికి కనీసం బైక్ ఉండితీరాలి సినిమా భాషలో. ఈ కెమెడియన్లు ఊరుకోరు. హీరో ఎక్కినదే మేమూ ఎక్కుతాం అని గోల చేస్తారు. ‘సైకిల్‌పై వన్నిలాడీ పోతున్నాదీ’ అనే పాటపుట్టి హిట్టయింది అలాగే. సైకిల్ హీరోలు నిన్న మొన్నటి వారే. ఉదా- కృష్ణ ( వింత కాపురం).
ఒక సీజన్‌లో కారు రయ్యిమని దూసుకొచ్చింది వెండి తెర మీదుగా ప్రక్షకుల హృదయాల్లోకి. ‘కారు అనగానే కారులో షికారుకెళ్లే’ అనే కావ్యం గుర్తుకొస్తుంది. ‘ కారులో షికారు.. కావ్య పరిశీలన’ అని ఓ ఉద్గ్రంథాన్ని ఆ పాట మీద గ్రేట్ బుచ్చి బాబు రాశారు. దొరికితే దొంగలు సినిమాలో ఎన్టీరామారావు, జమున పాట పాడిన జీపు ఆకాశంలో షికారు చేసి అందరితో ఔరా అనిపించింది. సినీ పాటల్లో కవిత్వం లేదనే వాళ్ల్లని చెట్టెక్కించాలి. అపని తరవాత చేద్దాంగానీ ముందు హీరో, హీరోయిన్లతోపాటు వెహికిలెక్కుదాం రండి. కారు వచ్చాక మిగతా బళ్లు అన్నిటినీ ఢీ కొట్టేసి తుక్కు తుక్కు చేసింది. చాలా కాలంగా కారు తెరమీద నడుస్తూనే ఉంది.

కథ నేలమీద నడవాలి కాబట్టి విమానం ఎక్కినా కొద్ది సేపే. మళ్లీ నేలకి దిగి కారో, బైకో ఎక్కాల్సిందే కథ. జేమ్స్ బాండ్ ప్రపంచంలో ఎక్కడా లేని వాహనాలని కూడా ఎక్కేస్తూ ఉంటాడు. జలాంతర్గాములు కూడా ఎక్కడమే కాకుండా నడిసేస్తాడు. వాహనం వేగానికీ, హీరో దూకుడుకీ అవినాభావ సంబంధాన్ని సినీ మేధావులు అంటగట్టారు ఆ పాత్ర ద్వారా. హీరో లేదా హీరోయిన్ అన్నాక వాహనం ఉండాల్సిందే. పౌరాణికమైనా అంతే. పురాణ కథలలో ‘ నౌకా విహారం’ సీనుపెట్టి ఆ ఇద్దర్నీ పడవ లోకి ఎక్కించే వారు. మాయా బజార్‌లో ఇది సినిమా డైలాగా అని ఆశ్చర్యపెట్టే ‘ రస పట్టులో తర్కం కూడదు’ అనే మాట పింగళి అలవోకగా విపిరేయడం అటువంటి సీన్లోనే జరిగింది. మన హీరోలు, హీరోయిన్లూ భవిష్యత్తులో కాలుష్యం పెరిగి పోయి పెట్రోల్ , డీసిల్ కార్లు ఎక్కకుండా మళ్లీ పాత సైకిల్, ఎడ్ల బండి ఎక్కుతారేమో!

                                                                                                     – పురాణం జూనియర్, 89778 89588

Comments

comments