Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

శిబిరాల్లోనూ దుర్భర బతుకులే!

edit

బంగ్లా, మయన్మార్ సరిహద్దుల సమీపంలోని కాక్స్ బజార్‌లో 450,000 మంది రోహింగ్యా బాలలు ఇరుకు శిబిరాలలో దుర్భరంగా బతుకుతున్నారు. అక్కడి మొత్తం శరణార్థులలో వీరు 55శాతం. స్వదేశం లో వారి గ్రామాలను భద్రతా బలగాలు, బౌద్ధులు కలిసి ధ్వంసం చేయడంతోబాటు వారిని చంపడం, లూటీ చేయడం, మానభంగాలు యధేచ్ఛగా సాగిస్తుండడంతో సుమారు ఆరులక్షల మంది రోహింగ్యా ముస్లింలు ప్రాణాలు అరచేత పట్టుకొని, సరిహద్దులను దాటి బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌లోకి శరణార్థులుగా ప్రవేశించారు. వారి పిల్లలు అక్కడ అతి తక్కువ జీతానికి అనేక గంటల పాటు బండ చాకిరీ చేస్తున్నారు. ఇంకా అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్నారు. వారిని తీవ్రంగా కొట్టడం, సెక్సు దాడులు జరపడం అక్కడ యధేచ్ఛగా సాగుతోంది. ఆ విషయాలను అంతర్జాతీయ వలసల సంఘం (ఐఒఎం)ఆ శరణార్థి శిబిరాలను అధ్యయనం చేసి తెలిపింది. రాయిటర్స్ ఈ అధ్యయన నివేదికపై ప్రత్యేక సమీక్ష జరిపింది. ఆ శిబిరాలనుంచి పిల్లలను బయటకు తరలించడంపై నిఘా కాయడానికి అక్కడ 11 చెక్ పాయింట్లను నెలకొల్పినట్లు ఆ సమీపంలోని పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. రోహింగ్యా పిల్లలు ఎవరైనా పనిచేస్తూ కనిపిస్తే ఆ సంస్థ యజమానిని అరెస్టు చేస్తామని కూడా తెలిపారు. ఆ శరణార్థులలో చాలా మంది గత రెండున్నర నెలల్లో అక్కడకు వచ్చారు. రోహింగ్యా రెబెల్స్ మయన్మార్‌లో ఆత్మ రక్షణార్థం నెలకొల్పిన 30 స్థావరాలపై సైన్యం దాడుల తరువాత వారిలో చాలా మంది పారిపోయి వచ్చారు. తెగలను తుడిచిపెట్టే పనిని అక్కడ తీవ్రస్థాయిలో సాగిస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్ జీద్ రాద్ అల్‌హుసీన్ తెలిపారు. రోహింగ్యా ‘టెర్రరిస్టుల’ దాడులకు ప్రతిగా సైన్యం దాడులు సాగుతున్నాయని మయన్మార్ ప్రభుత్వం అంటోంది.
శరణార్థులను విడివిడిగా ఇంటర్వూ చేసి సంస్థలు ఈ వాస్తవాలను రాబట్టాయి. శరణార్థి శిబిరాల్లో రోహింగ్యా పిల్లలకు జీవితం మయన్మార్‌లోకంటే భిన్నంగా లేదని ఆ సంస్థల అధ్యయనంలో తేలింది. కూలీలను సమకూర్చే ఏజెంట్ల దృష్టి రోహింగ్యా బాలలపై పడింది. ఆ శిబిరాల్లో పౌష్టికాహార లోపంవంటి సమస్యలు తీవ్రంగా ఉండడంతో తల్లిదండ్రులు గత్యంతరంలేక పిల్లలను పనికి పంపుతున్నారు. ఆ పిల్లలకు విద్యావకాశాలు కూడా 3వ తరగతికి మించి లేవు. ఏడేళ్ల వయస్సు రోహింగ్యా బాలలు శిబిరాలనుదాటి బయటకు పనులకోసం వెడుతున్నారని ఈ అధ్యయనంలో బయటపడింది.
బాలురు పొలాల్లో, కట్టడపు ప్రదేశాల్లో, చేపల పడవల్లో, టీ దుకాణాల్లో పనిచేస్తున్నారు. కొందరు రిక్షా కార్మికులుగా కూడా కుదురుకున్నారు. బాలికలు పని మనుషులుగా, బంగ్లాదేశీ కుటుంబాల్లో ‘నానీ’ లుగా పనిచేస్తున్నారు. చాలామంది దగ్గరలోని కాక్స్ బజార్, చిట్టగాంగ్‌లలో పనికి కుదురుతున్నారు. చిట్టగాంగ్ ఆ శరణార్థి శిబిరాలకు 100 మైళ్ల దూరంలో ఉంది. చిట్టగాంగ్‌లో పనిమనిషిగా ఒక ఇంట్లో పనిచేస్తున్న 14 ఏళ్ల రోహింగ్యా బాలిక అక్కడి నుంచి పారిపోయినట్లు తల్లి చెప్పింది. పూర్తిగా వివరాలు అందించడానికి రోహింగ్యా బాలల తల్లిదండ్రులు అణచివేత భయంతో ఒప్పుకోవడం లేదు.
14 ఏళ్ల బాలికపై పైశాచికం
నడవలేని స్థితిలో ఆ బాలిక తుదకు శిబిరానికి తిరిగి వచ్చింది. ఆ బాలిక తన యజమాని ఇంట్లో సెక్సు దాడికి, చిత్ర హింసలకు గురైనట్లు తల్లి చెప్పింది. పైగా ఆ పిల్లకు జీతం డబ్బు కూడా యజమానులు ఇవ్వలేదు. ఇటువంటి ఉదంతాలు రోహింగ్యా శిబిరాల్లో కోకొల్లలు. యజమాని తాగుబోతని అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఆ పిల్లను రేప్ చేసేవాడని తల్లి చెప్పింది. రాయిటర్స్, ఐఒఎం అధ్యయనంలో ఇలాంటి కేసు లు చాలా రికార్డు అయ్యాయి. రోహింగ్యా శరణార్థుల్లో మహిళలు సెక్సు వేధింపులకు గురవుతున్నట్లు తెలిసింది. రేప్ చేసినవారు తమని పెళ్లాడాలని బలవంతపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఐఒఎం చెప్పింది. బంగ్లాదేశ్ శరణార్థి శిబిరాలు అన్నింటా మురికి సందుల్లో పిల్లలు ఒంటరిగా శూన్య దృక్కులతో తిరగడం ఐఒఎం, రాయిటర్స్ గమనించాయి. చాలా మంది పిల్లలు రోడ్డు పక్కన అడుక్కుంటూ కనిపించారు. ఐక్యరాజ్య సమితి ఏజెన్సీల పనిని పర్యవేక్షించే ‘ఇంటర్ సెక్టార్ కో ఆర్డినేషన్ గ్రూప్’ ఆందోళనకరమైన వాస్తవాన్ని ఆ పిల్లల గురించి వెల్లడించింది. ఆ శిబిరాల నుంచి వేరైపోయి దిక్కూమొక్కూ లేకుండా తిరుగుతున్న 2,462 మంది పిల్లల వివరాలను రికార్డు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. పిల్లల సారథ్యం లో 3,576రోహింగ్యా కుటుంబాలు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్, బంగ్లాదేశ్ శరణార్థుల సహాయ సంస్థ తెలిపాయి. పిల్లలను పనికి పంపిన ఏడు కుటుంబాలను రాయిటర్స్ ఇంటర్వూ చేసింది.
తమ పిల్లలు దారుణమైన పని పరిస్థితుల్లో, తక్కువ వేతనాలతో పనిచేస్తున్నట్లు వారంతా చెప్పారు.తనకు రోజుకు 250టాకాల జీతం ఇస్తామని పనిచేయించుకున్న యజమాని తుదకు 38రోజులకు 500 టాకా లు(6 డాలర్లు) ఇచ్చినట్లు 12ఏళ్ల ఒక రోహింగ్యా బాలుడు చెప్పాడు. అది రోడ్డు మీద ఇటుకలను పరిచే కష్టమైన పని. కుటుపలాంగ్ వద్ద చిన్న మట్టి గుడిసె ఆ బాలుడి శిబిరం. తాను ఎక్కువ జీతంఅడిగినప్పుడు యజమానులు కొట్టి వెళ్లిపొమ్మన్నారని చెప్పాడు.
అక్కడి నుంచి వచ్చేసిన ఆ బాలుడు ఒక టీ దుకాణంలో నెల రోజులు పని చేశాడు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా రెండు షిప్టులు పని చేసిన అతనికి మధ్యాహ్నం 4 గంటలు విరామం దొరికేది. తనను దుకాణం నుంచి కదలనిచ్చేవారు కాదని, రోజుకు ఒక్కసారి మాత్రమే తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడ నిచ్చేవారని కూడా తెలిపాడు. చివరకు జీతం దక్కకపోవడంతో అక్కడి నుంచి కూడా పారిపోయాడు. ఆ దుకాణం యజమాని తన శిబిరానికి వచ్చి తనను మళ్లీ లాక్కుపోతాడని ఆ బాలుడు భయపడుతున్నాడు. చాలా మంది రోహింగ్యా తల్లిదండ్రులు తమ కుమార్తెలకు చిన్న వయస్సులోనే బలవంతపు పెళ్లిళ్లు చేస్తున్నారు. ఆర్థిక సుస్థిరత, రక్షణ దొరుకుతుందనివారు ఆశిస్తున్నారు. కొంత మంది పెళ్లికూతుళ్ల వయస్సు కేవలం 11 ఏళ్లు అన్న విస్మయకర వాస్తవాన్ని ఐఒఎం బయటపెట్టింది. పైగా ఆ బాలికలు రెండో భార్యలుగా భర్తల వద్దకు వెడుతున్నారు. రెండవ భార్యను తొందరగా విడాకుల ద్వారా వదుల్చుకొనే దుష్ట సాంప్రదాయం కూడా ఆ పిల్లలను బాధిస్తోంది. అలా వదుల్చుకున్న పిల్లలకు ఆర్థిక మద్దతు కోసం ఏర్పాటు ఏదీ ఆ భర్తలు చేయరు. ఆ శిబిరాల్లోని వారు చాలా మామూలుగా దోపిడీకి గురవుతున్నట్లు ఐఒఎంకు చెందిన
‘మనుషుల దొంగ రవాణా నిరోధ’ నిపుణురాలు కతెరినా అర్దనయన్ చెప్పారు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో మానవ అక్రమ రవాణాదార్లు చాలా చొరబడుతున్నారు. రోహింగ్యా మహిళలు, పిల్లలను దోపిడీ నుంచి రక్షించడానికి ప్రత్యేక నిధులు తక్షణం అవసరమని కతెరినా కోరారు.

                                                                                                                          * టామ్ అల్లార్డ్, టామీ విక్స్

Comments

comments