Search
Wednesday 22 November 2017
  • :
  • :

శ్రీలంకను తేలిగ్గా తీసుకోం

talk
* టీమిండియా వైస్ కెప్టెన్ రహానె

కోల్‌కతా: శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌ను తేలిగ్గా తీసుకోవడం లేదని భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానె స్పష్టం చేశాడు. ఈ సిరీస్‌ను తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు తెలిపాడు. ఇటీలవ పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో లంక అద్భుత ప్రదర్శన ఇచ్చిందన్నాడు. అంతేగాక పాక్‌పై క్లీన్‌స్వీప్ సాధించిన విషయాన్ని మరువ కూడదన్నాడు. ఈ సిరీస్‌లో తమకే మెరుగైన అవకాశాలు ఉన్నా లంకను కూడా తక్కువ అంచనా వేయలేమన్నాడు. రంగన హెరాత్ రూపంలో మ్యాచ్ విన్నర్ బౌలర్ లంకకు అందుబాటులో ఉన్నాడని వివరించాడు. స్పిన్‌కు సహకరించే భారత పిచ్‌లపై లంక స్పిన్నర్లతో ఎప్పుడూ ప్రమాదమేనని తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లంకకు మెరుగైన అస్త్రాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో తాము ఏమాత్రం నిర్లక్షంగా ఆడినా భారీ మూల్య చెల్లించుకోక తప్పదన్నాడు. అనుభవం లేకున్నా లంక జట్టులో ప్రతిభకు కొదవలేదని రహానె అభిప్రాయపడ్డాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే రంగన హెరాత్ ఆ జట్టులో ఉన్నాడని, ఈ పరిస్థితుల్లో వారిని ఎలా తక్కువ అంచన వేస్తామన్నాడు. ఇక కరుణరత్నె, కెప్టెన్ దినేష్ చండీమల్, తిరిమన్నె, దిల్రువన్, వికెట్ కీపర్ నిరోశన్ డిక్వెల్లా, ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్ మాథ్యూస్ లంక జట్టులో ఉన్నారని, దీంతో వారు కూడా భారీ ఆశలతో బరిలోకి దిగడం ఖాయమన్నాడు. కాగా, ఇటీవల కాలంలో వరుస విజయాలు సాధిస్తున్న తాము ఈసారి కూడా గెలుపే లక్షంగా పెట్టుకున్నామన్నాడు. లంకను ఓడించి రానున్న దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావడమే తమ ప్రధాన లక్షమన్నాడు. ఈ సిరీస్‌లో తమకు మంచి అవకాశాలు ఉన్నాయని, అయితే లంక నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలున్నాయన్నాడు. కాగా, ఓపెనర్లుగా ఎవరూ బరిలోకి దిగుతారనే దానిపై తానేమి మాట్లాడలేనని, దానిపై తుది నిర్ణయం తీసుకునేది కెప్టెన్ మాత్రమేనని తెలిపాడు. ఇదిలావుండగా ఈ సిరీస్‌లో రివర్స్ స్వీప్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు రహానె వివరించాడు. దీని కోసం ముమ్మర సాధన చేసినట్టు పేర్కొన్నాడు. భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు గురువారం తెరలేవనుంది. ఈ నేపథ్యంలో జట్టు వైస్ కెప్టెన్ రహానె మంగళవారం కోల్‌కతాలో మీడియా సమావేశంలో మాట్లాడాడు.

Comments

comments