Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

బాధ్యతగా బాలల సినిమాలు

harivillu-image

భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలల అంతర్జాతీయ చలన చిత్రోత్సవం  నవంబర్ 8 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆతిథ్యంలో ప్రపంచ వేదికగా జరిగే ఈ బాలల చిత్రోత్సవానికి అన్ని దేశాల నుండి వందలాది చిత్రాలు పోటీపడతాయి. ఈ నేపథ్యంలో కొమరం భీమ్, గౌతమ్ బుద్ధ, ఫెస్టివల్ ఆఫ్ ఫెయిత్, తూహీ మేరీ గంగ వంటి అవార్డుల చిత్రాల దర్శక నిర్మాత  అల్లాణి శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన  ‘డూ డూ ఢీ ఢీ’ (మా ఊరి కొండ) ఈ చిత్రోత్సవంలో చిల్డ్రన్ వరల్డ్ విభాగానికి ఎంపికైంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత అల్లాణి శ్రీధర్‌తో ఇంటర్వూ విశేషాలు…ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ భావాలు, ఉత్తమ సాంకేతిక విలువలతో నిర్మించిన చిత్రాలు పోటీపడే చిల్డ్రన్ వరల్డ్ విభాగానికి మా ‘డూ డూ ఢీ ఢీ’ చిత్రం ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రోత్సవంలో ఇతర బాలల చిత్రాలకు మా సినిమా గట్టి పోటీనిస్తుందన్న నమ్మకం ఉంది.

ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం ఇతివృత్తంగా…
ఈ తరం బాలలను ఆన్‌లైన్ గేమ్స్, వీడియో గేమ్స్, మొబైల్ గేమ్స్ విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. బాల్యాన్ని కబలిస్తున్న ఈ గేమ్స్ వ్యసనాన్ని ఇతివృతంగా తీసుకొని ‘డూ డూ ఢీ ఢీ’ చిత్రాన్ని రూపొందించాం.

డిజిటల్ అడిక్షన్‌కు విరుగుడు…
డిజిటల్ వ్యసనానికి గురైన ముగ్గురు పిల్లలు ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ వ్యసనం ప్రభావంతో పిల్లలు చివరికి ఎలా మారిపోయారు? డిజిటల్ అడిక్షన్‌కు విరుగుడు ఏమిటి? చివరికి మన సంస్కృతి, ఆట పాటలు ఎలా వారిని ఆకట్టున్నాయి? అనే విషయాలను ఇందులో చక్కగా చూపించాం. డిజిటల్ వ్యసనపరులైన పిల్లలు చివరికి అందరి చేత ఎలా శభాష్ అనిపించుకున్నారు అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

హృదయానికి హత్తుకునే…
మరచిపోతున్న మన సంప్రదాయాలు, విలువలు, మానవ సంబంధాలను హృదయానికి హత్తుకునే విధంగా ఈ చిత్రంలో చూపించడం జరిగింది. పిల్లల ఆటపాటలతో సరదాగా ఈ సినిమా సాగుతుంది. ఆన్‌లైన్ గేమ్స్ పట్ల పిల్లలు అప్రమత్తంగా ఉండాలని చెబుతూ పిల్లలతో పాటు తల్లిదండ్రుల్లో కూడా చైతన్యం కలిగించే చిత్రమిది.

ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిష్టాత్మకంగా…

‘కొమరం భీమ్’ ఫేమ్ భూపాల్, మాస్టర్ సాయి, బేబి కావేరి, బేబి అభి ప్రధాన పాత్రల్లో ‘డూ డూ ఢీ ఢీ’ రూపుదిద్దుకుంది. శశిప్రీతమ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ బాలల చిత్రాన్ని ఖర్చుకు వెనుకాడకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాం.

సామాజిక బాధ్యతగా..
బాలల చిత్రాలు తెలుగులో అంతగా రాకపోవడం బాధాకరమైన విషయం. దేశంలో అత్యధిక సినిమాలు నిర్మించే టాలీవుడ్‌లో బాలల చిత్రాలు ఎక్కువగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిల్మ్‌మేకర్స్ సామాజిక బాధ్యతగా ఈ చిత్రాలు నిర్మించాలి.

అప్పుడే ప్రేక్షకుల ఆదరణ
బాలల చిత్రాలకు పెద్దగా మార్కెట్ ఉండదని ఫిల్మ్‌మేకర్స్ వీటి నిర్మాణానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో బాలల చిత్రాలు పెద్దగా రావడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బాలల చిత్రాలకు ఎక్కువ సబ్సిడీని అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఈ సినిమాల్లో నటిస్తే బాలల చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుంది.

                                                                                                                                                                             –ఎస్. అనిల్ కుమార్

Comments

comments