Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

బాల్యానికి బలమైన భరోసానిద్దాం!

child

నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవిష్యత్ మొత్తం వారిదే అని స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిత జవహర్ లాల్ నెహ్రూ అన్న మాటలివి. బాల్యా న్ని అమితంగా ప్రేమించిన చాచాజీ జయంతిని ఏటా బాలల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. రాజ్యాంగంలోని 21-ఎ అధికరణ జీవన హక్కు తో సమానంగా విద్యాహక్కుకూ చట్టబద్ధ ప్రతిపత్తి కల్పిస్తోంది. 14ఏళ్ళు నిండేదాకా ఉచితంగా ప్రాధమిక విద్య పొందడం దేశంలోని బాలల హక్కు అని 1994లోనే సుప్రీంకోర్టు పేర్కొంది. బాలల నిర్బందోచిత విద్యాహక్కు చట్టం 2010 ఏప్రిల్ 1వ తేదీన అమలులోకి వచ్చింది. దాని లెక్కప్రకారం ప్రతి పాఠశాలకు భవన సముదాయం, తాగునీటి వసతి, గ్రంథాలయం, క్రీడాసామాగ్రితో పాటు బోధనా సిబ్బందిని సమకూర్చుకోవలసి ఉంటుంది. పేదరికం కారణంగా విద్యకు దూరమవుతున్న బాలలను తిరిగి పాఠశాలలకు రప్పించేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలను చేపడుతోంది.
అందులో ముఖ్యమైనది మధ్యాహ్న భోజన పధకం ఒకటి. బాల్యం అనేకానేక ముళ్ళకంచెల మధ్య నడుస్తోంది. పౌష్టికాహార లోపం, అనారోగ్యం, లైంగిక వేధింపులు, బాలల అక్రమ రవాణా, అవిద్య, బాల్యవివాహాలు వంటి సమస్యలు ఒకదానికొకటి పెనవేసుకొని దాపురించాయి. ఫలితంగా పసిమొగ్గలు కాస్తా బాలకార్మికులు, వీధిబాలలు, అనాధలు, బాలనేరస్థులుగా మగ్గిపోతున్నారు. మరోవైపు దేశంలో పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం 20లక్షల అంగన్‌వాడీ కేంద్రాలు నెలకొల్పాలని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే చెప్పడం జరిగింది. బాలలను రక్షించడం కోసం 1975లో సమగ్ర శిశు అభివృద్ధి పధకం(ఏసీడీఎస్)ను ప్రారంభించడం జరిగింది. నాలుగు దశాబ్దాలు దాటినా మాతా శిశువులను కాపాడడం కొరకు స్థాపించడం జరిగింది. ఆరేళ్ళ లోపు పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలందరికీ ఏడాదిలో 300రోజుల పాటు విధిగా పౌష్టికాహారం సమకూర్చాలంటూ 2004లో సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాలకు నిర్దేశించింది. విద్యకు దూరమైన పిల్లల భవిష్యత్ ఆగమ్యగోచరంగా తయారైందనడంలో ఎలాంటి సందేహం లేదు. బాల నేరస్థులుగా, వీధి బాలలుగా, బాల కార్మికులుగా మగ్గిపోతున్నారు.
పుట్టుకతోనే ఎవరూ కూడా నేరస్థులు, దొంగలు కాదు. సామాజిక పరిస్థితులు గతి తప్పితే పసిమనసులు కలుషితమవుతాయి. బాలల హక్కులు, సంక్షేమం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బాలల సమస్య మాత్రం దశాబ్దాలుగా దేశాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి. తెలిసీ తెలియని వయసులో ఇళ్ళు దాటేవారు కొందరైతే, అక్రమ రవాణా బారినపడుతున్న బాలలు మరికొందరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ బాలల అదృశ్యం కేసులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి.
రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఇతరత్రా ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ తిరిగే బాలలను గుర్తించేందుకు కొన్ని ముఠాలు తయారైనాయి. వీరిని ఎత్తుకెళ్ళి వారితో బలవంతంగా యాచకుల వృత్తిలోకి దింపడం జరుగుతుంది. చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధానికి 2012 లో పొక్సో చట్టం తీసుకురావడం జరిగింది. కానీ ఆ చట్టాన్ని వినియోగించుకొని ఫిర్యాదులు చేస్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. దేశంలో బాలల సంక్షేమానికి కట్టుబడి మోడీ ప్రభుత్వం నిర్మాణాత్మక కృషి చేస్తోంది. బాలల హక్కులకోసం కట్టుబడి పనిచేస్తే బాలలకు మంచి భవిష్యత్ సాకారమవుతుంది.

Comments

comments