Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఖాళీ డ్రమ్ముపై కన్నీళ్లతో కడలి ఈత

swimg

ప్లాస్టిక్ డ్రమ్ముపై సముద్రాన్ని ఈది బంగ్లాదేశ్ చేరుకున్న
13 ఏళ్ల శరణార్థి

బంగ్లాదేశ్ : రోహింగ్యా బాలుడు నబీ హుస్సేన్‌కు ఈత రాదు. మయన్మార్‌లోని తన గ్రామాన్ని విడిచి వచ్చే వరకు కూడా అతడు కనీసం సముద్రాన్ని కూడా చూసి ఎరుగడు. కాని, ఓ ఖాళీ ప్లాస్టిక్ డ్రమ్‌పై ఎక్కి సముద్రంలో 2.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బంగ్లాదేశ్‌కు చేరుకున్నాడు. మయన్మార్‌లో హింస నుంచి తప్పించుకునేందుకు రోహింగ్యా ముస్లింలు సరిహద్దులోని బంగ్లాదేశ్‌కు పారిపోతున్నారు. ఇందులో కొందరు సముద్రాన్ని భద్రంగా ఈదుకుంటూ తీరాన్ని చేరుకుంటున్నారు. వారం రోజుల్లో మూడు డజన్లకు పైగా బాలురు, యువకులు ఈ విధంగా బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టారు. ఇందుకోసం వారు వంట నూనె డ్రమ్ములను తెప్పలుగా ఉపయోగించుకుంటూ నాఫ్ నదిని ఈదుతూ చేపల పట్టణం, పశువుల మార్కెట్‌గా పేరుగాంచిన షా పోరిర్ ద్వీపం తీరానికి చేరారు.
‘నేను చనిపోతానని భయపడ్డాను. అదే నాకు చివరి రోజని అనుకున్నాను” అని పోలో షర్టు, ధోతీతో ఉన్న నబీ చెప్పాడు. మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలను బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులుగా చూస్తుంటారు. వారు ఆ దేశంలో అనేక దశాబ్దాలుగా నివసిస్తున్నారు. ప్రాథమిక హక్కులు కల్పించేందుకు కూడా ప్రభుత్వం నిరాకరించింది. ప్రపంచంలోనే అత్యధింగా పీడించబడిన మైనారిటీలుగా వారిని అమెరికా పేర్కొంటోంది. బౌద్ధులు, సైనికుల నుంచి ఎదురవుతున్న హింస, వేధింపులను భరించ లేక ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఆరు లక్షల మంది ప్రాణాలకు తెగించి బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. “మేం చాలా బాధలు పడుతున్నాం, అందుకే నీటిలో దూకడమే సరైన మార్గమని భావించాం” అని నూనె డ్రమ్‌తో ఈదుతూ బంగ్లాదేశ్ చేరిన మరో బాలుడు కమల్ హుస్సేన్ (18) తెలిపాడు. కొత్త దేశంలో నబీకి ఎవరూ తెలియదు. మయన్మార్‌లోనే ఉండిపోయిన అతని తల్లిదండ్రులకు అతడు జీవించి ఉన్నాడో లేదో కూడా తెలియదు. అతడు నవ్వడం కూడా చేయలేకపోతున్నాడు. అప్పుడప్పుడూ కంటి ద్వారానే భావాలు పలికిస్తున్నాడు. రైతు అయిన అతని తండ్రికి 9 మంది సంతానంలో నాలుగవ వాడు నబీ. మయన్మార్‌లోని కొండల మధ్య పెరిగాడు. ఎప్పుడూ పాఠశాల మెట్లు ఎక్కలేదు. రెండు మాసాల క్రితం రోహింగ్యా తిరుగుబాటుదారులు మయన్మార్ భద్రతా బలగాలపై దాడికి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి నుండే కష్టాలు మొదలయ్యాయి. మయన్మార్ బలగాలు ప్రతీకారంతో రెచ్చిపోయాయి. దారుణ కృత్యాలకు దిగాయి. పురుషులను దారుణంగా హతమార్చడం, మహిళలపై అత్యాచారాలకు పాల్పడడం, ఇళ్లను తగులబెట్టడం, ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలకు ఒడిగట్టాయి. అన్ని ఇళ్లు అగ్నిజ్వాలలతో మండిపోతున్న తన గ్రామాన్ని నబీ చివరి సారిగా చూశాడు. మృతదేహాల మీదుగా తీరం వెంబడి నబీ కుటుంబం పారిపోయింది. అప్పటికే అధిక సంఖ్యలో చేరిన రోహింగ్యా ముస్లింలతో తీరం నిండిపోయి ఉంది. బోటు ద్వారా తీరాన్ని దాటేందుకు వారి వద్ద డబ్బులు లేవు. దీంతో దిక్కుతోచని స్థితిలో అక్కడే కాలం గడపాల్సివచ్చింది. తిండి తిప్పలు లేవు. నాలుగు రోజుల అనంతరం తీరాన్ని దాటాలన్న ఆకాంక్షను నబీ తన తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే, నబీ వెల్లడానికి వారు ఒప్పుకోలేదు. తన అన్నల్లో ఒకరు రెండు మాసాల క్రితమే బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయాడు. అయితే అతడు ఏమయ్యాడో వారికి తెలియదు. కాని, నబీని ఉధృత ప్రవాహం సముద్రంలోకి లాక్కెళ్లిపోతుందని వారు భయపడ్డారు. చివరికి వారు ఒప్పుకున్నారు. కాని ఒంటరిగా మాత్రం వెళ్లొద్దని నిబంధన విధించారు. నవంబరు 3 మధ్యాహ్నం 23 ఏళ్ల ఓ యువకుడి కుటుంబంతో నబీ జతకట్టాడు. చుట్టూ చేరిన వారంతా కన్నీరు పెడుతుండగా, తనను ఆశీర్వదించమని తల్లి కోరాడు. నబీ, ఇతరులంతా కలిసి నూనె డ్రమ్ములను గుండెలకు కట్టుకుని నీటిలోకి దిగారు. ఆ సమయంలో కెరటాలు బంగ్లాదేశ్ వైపు బలంగా వీస్తున్నాయి. ముగ్గురు చొప్పున ఓ బృందంగా తాడు కట్టుకుని వారంతా బయలుదేరారు. నబీకి ఈత రాకపోవడంతో వారి మధ్యలో ఉంచారు. కెరటాలు ఎగిసి పడుతుండడంతో జలాలు కబళిస్తాయని నబీ భయపడ్డాడు. దప్పికతో తాగుదామనుకుంటే నీరు ఉప్పగా ఉంది. కాళ్లు నొప్పులు పెడుతున్నాయి. కాని, అవేమీ పట్టించుకోలేదు. సూర్యాస్తమయం సమయానికి ఈ బృందం షా పోరిర్ ద్వీపానికి చేరుకున్నారు. అప్పటికే వారంతా దాహం, ఆకలి, డీహైడ్రేషన్‌తో ఉన్నారు. కాని నబీ ఇప్పుడు ఒంటరి. బంగ్లాదేశ్‌లో ఎవరికి వారుగా నివసిస్తున్న 40 వేల మంది రోహింగ్యా ముస్లింలో ఒకడు. నీటికి కొన్ని అడుగుల దూరంలో ఉన్న నబీ తనలో తాను ఇలా అనుకున్నాడు ..“నాకు నా తల్లిదండ్రులు, శాంతి కావాలి”. ఆ మరుసటి రోజు సాయంత్రం మరో బృందం రోహింగ్యా ముస్లింలు పసుపు రంగు డ్రమ్ములతో ఈదుకుంటూ బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు.

Comments

comments