Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

తమిళ ‘కమలహాస’మెప్పుడు?

edit2

కమల్ హాసన్ పార్టీకోసం ప్రజలు ఆత్రంగా ఎదురు చూస్తుండగా ఆయన మాత్రం తన రాజకీయ ప్రవేశం తన పుట్టిన రోజు నాడే జరిగిపోయిందని ప్రకటించి జనాన్ని తికమక పెట్టారు. ఈ నెల 7న కమల్ జన్మదినం నాడు ఆయన నుంచి కీలక ప్రకటన కోసం జర్నలిస్టులు ఎదురు చూశారు. చివరకు అది అవినీతి ఉదంతాలపై హెచ్చరించే ఒక యాప్ ప్రారంభం గురించిన ప్రకటన కావడంతో వారు ఎంతగానో నిరాశకు గురయ్యారు. రాజకీయ పార్టీ విషయంలో ఆచితూచి అడుగువేస్తున్న కమల్ తాజా అడుగు ఈ యాప్.
ఆయన తరచూ రాజకీయ ట్వీట్లు చేస్తున్నారు. అవి తప్ప ఆయన రాజకీయాలలో చేరారనడానికి వేరే రుజువులు ఏమీ లేవు. ఒక రాజకీయ పార్టీ నెలకొల్పడానికి ముందు జరగాల్సిన పని ఏదీ జరగలేదు. అట్టడుగు నుంచి కార్యకర్తల వ్యవస్థ నిర్మాణం, పైనుంచి కిందకు పార్టీ అధికార పెద్దల నియామకం వంటివి జరగనే లేదు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో భేటీ కావడం వంటివి ఆయన చేశారు కాని వాటికి చెప్పుకోదగ్గ రాజకీయ ప్రాముఖ్యత లేదు. ఆయనను ఇంకా సినీ నటునిగానే తప్ప రాజకీయ నాయకునిగా ప్రజలు భావించడం లేదు.
కొత్త రాజకీయ పార్టీని తాను పెట్టబోతున్నట్లు మొత్తానికి ఖరా రు చేసి ఇటీవల ఆయన సస్పెస్స్‌కు కొంచెం తెరదించారు. ఇందుకోసం పలువురు రాజకీయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఆయన ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు ‘మౌయామ్’- అంటే ‘మధ్య స్థానం’. సైద్ధాంతికంగా కమల్ ఎడమ, కుడి- దేనికీ చెందకుండా మధ్యే మార్గం వారు. అందుచేత ఆయన వైఖరికి ఆ పేరు అద్దం పడుతోంది. తమ చుట్టూ ఉన్న అసమానతలను తరిమి వేయడంలో, వాటి గురించి ఎన్నుకున్న నాయకులను నిలదీయడంలో ప్రజలకు ఉపకరించే వేదికగా ఆ యాప్ ఉపయోగపడుతుంది.
౩౦ ఏళ్ల క్రితం నాటి తన ‘తెడితీర్పమ్ వా’ అనే పుస్తకంనుంచి అటువంటి యాప్ తయారు ఆలోచనను కమల్ తీసుకొన్నారు. అది ‘పట్టుబట్టి సాధించు’ అనే సూత్రాన్ని పరిచయం చేసిన పుస్తకం అని కమల్ వివరించారు. 2012లో కమల్ ‘మైయామ్’ అనే వెబ్ పత్రిక ను మొదలుపెట్టి కొంతకాలం పాటు నడిపారు. అంతకు ముందు ఆయన అదే పేరుతో ఓ సాహిత్య పత్రికను కూడా నడిపారు. ప్రభుత్వ అక్రమాలను గట్టిగా నిలదీయాల్సిన సమయం వచ్చిందని ఇటీవల చెన్నై విలేకరుల గోష్ఠిలో కమల్ అన్నారు. ‘అటువంటి స్థితి లో జనంతో మీరే నేరుగా మాట్లాడి వారి సమస్యలు తీర్చడం బదులు యాప్ ద్వారా సమస్యలపై ప్రజలు స్పందించడం ఎందుకు’ అని అడుగగా, ఆ యాప్ మామూలిది కాదన్నారు. దాని ద్వారా ప్రజలు అక్రమాలపై నేతలను నిలదీసి సమాజానికి మంచి చేసేందుకు వీలుంటుందన్నారు. దాని ద్వారా తనపైనే నిఘా కాయవచ్చునని కూడా కమల్ అన్నారు.
అయితే అసలు తమిళనాడు రాజకీయాలలో కమల్ నిజమైన మార్పు తెస్తారా అన్న ప్రశ్నకు స్పష్టమైన జవాబు ప్రస్తుతానికి లేనట్టే. ఈ విషయంలో రజనీ కాంత్ కంటే కమల్ కొంత నయమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఆయన ఇంకా సరైన దారిలోకి రాలేదని చెబుతున్నారు. ఆయన సొంత పార్టీ ఆలోచన చేయకుండా బాగా వేళ్లూనుకొని ఉన్న ఏదో పార్టీలో చేరి ఉంటే బాగుండేదంటున్నారు నిపుణులు. ‘ఆయన ఉద్దేశాలు బాగున్నాయి, వైఖరిలో నిజాయితీ ఉంది.. కాని సొంత పార్టీ పెట్టి నెగ్గుకు రావాలంటే ఏడాది క్రితమే కమల్ పునాది వేసి ఉండాల్సింది’ అని కూడా వినపడుతోంది. విజయ కాంత్ రాజకీయ పార్టీ స్థాపించడానికి పదేళ్ల ముందు పనులు మొదలు పెట్టారని కూడా వారు గుర్తు చేస్తున్నారు.
తన పార్టీ రాజకీయ సిద్ధాంతం, ఎజెండా గురించి వచ్చే ఏడాదే వెల్లడవుతుందని చెప్పడం ద్వారా ఏదీ తేల్చకుండా ఇంకా అటూ ఇటూగానే కమల్ కొనసాగుతున్నారని స్పష్టమవుతోంది. తన రాజకీయ పార్టీకి నిధుల సేకరణ నిమిత్తం తయారీలో ఉన్న డిజిటల్ వేదికను కూడా వినియోగించుకోనున్నట్లు ఆయన చెప్పారు. అది కూడా వచ్చే ఏడాదికి సిద్ధమవుతుందన్నారు. అభిమానుల ద్వారా కాకుండా నేరుగా ప్రజల ద్వారా నిధుల సేకరణ సాగుతుందని కూడా ఆయన సూచన అందించారు. అత్యాశాపరులైన నాయకులు ఖాళీ చేస్తున్న ఖజానాను ప్రజలే తిరిగి నింపుతున్నారని కూడా కమల్ అన్నారు. ప్రజల ప్రమేయంవల్ల పారదర్శకత విధిగా ఉండడంతో పాటు నిధుల రాకపోకలు నేరుగా ప్రజల ఎరికలోనే సాగుతాయని కూడా చెప్పారు.
ప్రజలలో కొందరు మిమ్మల్ని ఇంకా బ్రాహ్మడుగానే చూస్తున్నారా అని అడుగగా, బ్రాహ్మలతో స్నేహాన్ని తాను ఎన్నడూ కోరుకో లేదని చెప్పారు. తన మిత్ర పరివారంలో అన్ని కులాలవారూ ఉన్నట్లు తెలిపారు. అసలు తనపై హిందూ వ్యతిరేకిగా ముద్ర ఉన్నట్లు చెప్పారు. తాను అదే మతంలో పుట్టి పెరిగినా తరువాత దానిని విదుల్చుకొని బైటపడ్డానని కూడా వివరించారు. తనను నాస్తికుడుగా గుర్తించడం కూడా ఆయనకు నచ్చదు. తాను హేతువాదినని చాటుకున్నారు. తనను జాతీయ వాదిగానే ఎంచాలని ఆయన కోరుంటున్నారు. అవినీతి నిర్మూలన తన ప్రధాన లక్షమని ఆయప పదే పదే చెబుతున్నారు. దీనిని బట్టి ఆయనది ఆదర్శాలతో కూడిన ఊహా ప్రపంచమే తప్ప వాస్తవ ప్రపంచం కాదా అన్న అనుమానం కూడా కలుగుతోంది. సినిమాల్లో పరిస్థితిని చక్కదిద్దినట్లుగా రాజకీయాల్లో సాగదని ఆయనకు తెలియదు అనుకోలేము.
ఆయన చెబుతున్న బాధ్యతల పరిమాణాన్ని తక్కువ అంచనా వేస్తున్నారా అనే అనుమానం కూడా కొందరికి కలుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు ఆయన హామీ ఇస్తున్నారు. దీనిని బట్టి తమిళనాడు ఓటర్లు తనను ఎంతవరకు ఆమోదిస్తారు అన్నది స్వయంగా ఆయనే ఒక అంచనాకు రాదలిచారని తోస్తోంది. తమిళ ఓటర్లలో 2 శాతం మంది మద్దతు ఆయన పెట్టబోయే పార్టీకి ఉంటుందని చెప్పవచ్చు. విస్తృత కూటమిలో ఆయన పార్టీ భాగస్వామి కావడం ద్వారా ఓటర్లపై ప్రభావం చూపవచ్చు. ప్రస్తుతానికి ఆయన ఆలోచనలు, ప్రకటనలు నాటకీయంగా ఉన్నాయి. డిఎంకె ఓటు బ్యాంకును దెబ్బతీయడానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి ఆయనను ఎవరైనా వాడుకోవచ్చు. మొత్తానికి వచ్చే రెండేళ్లపాటు తమిళ రాజకీయాల ప్రస్తుత తసరళిని ఆయన పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.
    * ప్రతిభా పరమేశ్వరన్

Comments

comments