Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

మెడిసిన్ సీట్ల జాతీయ పోటీలో రాష్ట్రం

ts-govt-logo.jpg1

 హైదరాబాద్ : వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న ఆశావహులకు అవకాశాలు పెరగనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అదనంగా మరిన్ని సీట్లకు పోటీ పడేందుకు వీలు చిక్కింది. ఆర్టికల్ 371(డి) పరిధిలోకి వస్తు న్న రాష్ట్రమైన తెలంగాణ నేషనల్ పూల్ (సెంట్రల్ పూల్)కు సీట్లను ఇచ్చేందుకు ఎట్టకేలకు నిర్ణయించింది. దీనితో రాష్ట్రంలోని అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 300 సీట్లను నేషనల్ పూల్ కింద భర్తీ చేయాల్సి ఉంటుంది. మన రాష్ట్ర విద్యార్థులకు దేశవ్యాప్తంగా నేషనల్ పూల్‌లో ఉన్న 9000 సీట్లకు పోటీ పడే అవకాశం దక్కింది. ప్రత్యేక రాజకీయ, సామాజిక పరిస్థితుల రీత్యా స్థానికులకు విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కాలని 1973లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నేషనల్ పూల్ నుంచి మినహాయింపునిస్తూ పార్లమెంటు చట్టం చేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో విద్యావంతులైన తెలంగాణ విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు ఆసక్తి కనబరుస్తూ గత కొన్ని సంవత్సరాలుగా నేషనల్ పూల్‌లో చేరాలని కోరుతున్నారు. పలు జాతీ య స్థాయి పోటీ పరీక్షల్లోనూ ప్రతిభ కనబరుస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణను జాతీయ పూల్‌లో చేరాలని కోరుతోంది. అయితే నేషనల్ పూల్‌లో చేరడం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు అవకాశాలు కోల్పోతారని కొంత మంది వాదించినప్పటికీ, పూర్తి పరిస్థితులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం జాతీయ పూల్‌లో చేరడమే మేలని తేల్చుకుంది. దీనితో వైద్య కోర్సుల ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) 2018లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు పోటీ పడవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది వరకే నేషనల్ పూల్‌లో చేరాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మరో రెండు వారాల్లో నేషనల్‌పూల్‌లో చేరడానికి నిర్ణయించుకున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం తెలపాల్సి ఉంది. ఒక వేళ మరో రెండు వారాల్లో గనుక తమ ఆమోదాన్ని పంపించడంలో విఫలమైతే ఆశావహులు మరో సంవత్సరం అంటే 2019 సంవత్సరం వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనే కాకుండా పిజి స్థాయిలో కూడా నేషనల్ పూల్‌లో చేరడం ద్వారా తెలంగాణ విద్యార్థులు అదనంగా 15,000 సీట్లకు పోటీ పడే అవకాశముందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. నేషనల్ పూల్‌లో చేరడం ద్వారా మన సీట్లను మనం కోల్పోవడం లేదని, నేషనల్ పూల్‌లోకి వెళ్లే 300 మెడికల్ డిగ్రీ స్థాయి సీట్లకు కూడా మిగిలిన రాష్ట్రాల విద్యార్థులతో పాటు మన రాష్ట్ర విద్యార్థులు కూడా పోటీ పడవచ్చని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 60,000 ఎంబిబిఎస్ సీట్లుండగా, మన రాష్ట్రంలో 3,700 సీట్లున్నాయి. రాష్ట్రంలోని 300 సీట్లను నేషనల్ పూల్ లో చేర్చడం ద్వారా నేషనల్ పూల్‌లోని 9000 సీట్లకు పోటీ పడే అవకాశం మనకు దక్కనుంది. రాష్ట్రవ్యాప్తంగా పిజి సీట్లు 1,100 ఉండగా అందులో 500 సీట్లను నేషనల్ పూల్‌లో చేరితే, దేశవ్యాప్తంగా 15,000 సీట్లకు పోటీ పడే అవకాశం దక్కుతుంది.

Comments

comments