Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకే సిపిఐ పోరుబాట

cpi2

*నమ్మించి మోసం చేసిన కెసిఆర్
*రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
*ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకే పోరుబాట రాష్ట్ర కార్యదర్శి
  చాడ వెంకట్‌రెడ్డి

మన తెలంగాణ/బాన్సువాడ: రాష్ట్రంలో దగాకోరు పాలన కొనసాగుతుందని, ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన సిఎం కెసిఆర్  నేడు మోసం చేసి నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నారని  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. అంతకుముందు ఆదివారం పోరుబాటలో భాగంగా బాన్సువాడకు చేరుకున్న ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాజిక తెలంగాణ, సమగ్రాభివృద్ధి అనే అంశాలను తీసుకొని రాష్ట్ర వ్యా ప్తంగా పోరుబాట యాత్రను కొనసాగిస్తున్నామన్నారు. జనాభా ప్రాతిపాదికన కేటాయించిన నిధుల నుండి కనీసం 50 శాతమైనా ఖర్చు చేయడం లేదన్నారు. బిసి, ఎస్టీ, ఎస్సీల వారికోసం సబ్ ప్లాన్‌లు అమలు చేస్తామని చెప్పి నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. మూడు లక్షల మంది ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన కుటుంబాలు ఉండ గా, వారి బాగు కోసం కేటాయించిన నిధుల నుండి 38 శాతం మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమిని అందిస్తామని చెప్పి పిజి వరకు ఉచిత విద్యను అందిస్తామని చెప్పిన  సిఎం ప్రస్తుతం ఉన్న 337 పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలు చేశారని, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రయత్నాన్ని విరమించుకున్నారని తెలిపారు. ఇప్పటికీ విద్యార్థులకు అందించే స్కాలర్‌షిప్, పీజు రీయింబర్స్‌మెంట్ అందించని దుర్భర పాలనను సిఎం కెసిఆర్ కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి పాలనే దీనికంటే బాగుండేదని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లను తక్కువ చేసి మాట్లాడిన కెసిఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లను రెండేళ్ల నుండి ఎంత మందికి మంజూరు చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకుపోవాలన్న ప్రయత్నం లో భాగంగా గత నెల 6వ తేదీన జనగామలో పురుడుపోసుకుందన్నారు. డిసెంబర్ 3న కరీంనగర్ ముగింపు సభను ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలో పోరుబాటలో తమ దృష్టికి వచ్చిన సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు పర్యటించిన మండలాల్లో సుభిక్షింగా లేరని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేసి సామాన్యులకు అవి అందని ద్రాక్షగా మార్చిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందని ఆరోపించారు. పాలకుల నిర్వాకం కారణంగా పత్తి రైతులు రాష్ట్రంలో చిత్తయ్యారని, రైతును రాజును చేస్తామని ప్రగల్బాలు పలికిన కెసిఆర్ వారు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నోరు మెదపలేకపోతున్నారన్నారు. స్వామి నాథన్ చెప్పిన మద్దతు ధరను పాలకులు అందించలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో నేడు వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు. ఇంటింటికీ ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను నమ్మించిన కెసిఆర్ నేడు ఆయన ఇంటికి మాత్రమే కొలువులు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఇందిరా పార్క్ ధర్నాచౌక్ గా కొనసాగించాల్సిందేనని, అది ఎవరీ జాగీరు కాదన్నారు. బంగారు తెలంగాణ చేస్తానన్న కెసిఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని చెప్పారు. నైజాం పాలనను అందిస్తామని చెప్పిన కెసిఆర్ మాన ప్రాణాలకు రక్షణ లేని నిజాం పాలనను గుర్తుకు తెప్పిస్తున్నారని చెప్పారు. వామ పక్షాల సీట్లు తగ్గినా సిద్ధాంతాలు అవే ఉంటాయని, వామ పక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలు సుభీక్షంగా ఉన్నాయని గుర్తు చేశారు. నేడు కమ్యూనిస్టులు పాలిస్తున్న రాష్ట్రాల్లో ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు, సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ఇక్కడి పాలకులు కనీసం నిత్యవసర సరకులను కూడా సక్రమంగా ఆందించని దుర్భర స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించకుండా ఆయన మహిళల పట్ల ఉన్న నైజాన్ని చాటుకున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మేం ఆప్తమిత్రులం అధికారం వచ్చాక తాము శత్రువులమా అంటూ ప్రశ్నించారు. ప్రజా పోరుబాట…ప్రజా హక్కుల బాట, సమస్యల సాధన మాట మాదని చెప్పారు. హామీలను అమలు చేయలేకపోతే గద్దెదిగాలని డిమాండ్ చేసారు. దొరల పాలనకు స్వస్తి పలికి పాలకులను ఇంటి బాట పట్టించేందుకు సిపిఐ పార్టీ పోరుబాటను ఎంచుకుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల మల్లేష్, పశ్య పద్మ, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎండి యూసుప్, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉస్తెల సుజణ, బిసి సబ్ ప్లాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ పాండురంగ చారి, ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు యాదవ్, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామావత్ అంజయ్య నాయక్, ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి కె. లక్ష్మినారాయణ, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పల్లె నర్సింహ, మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు శ్రావణి, గంగాధర్ రావ్, ఏసురత్నం, అనిల్, భూమన్న, దుబాస్ రాములు, జె. రవిందర్, పార్టీ కార్యకర్తలు ఉన్నారు.

Comments

comments