Search
Wednesday 22 November 2017
  • :
  • :

గ్రంథాలయాలు మంచి భవిష్యత్తుకు బాటలు

hall;మన తెలంగాణ/ వికారాబాద్ జిల్లా : గ్రంథాలయాల సేవలను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే బి.సంజీవరావు కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనంలో 50వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయాలలో అనేక విలువైన పుస్తకాలు అందుబాటులో ఉంటాయని పేర్కోన్నారు. గ్రంథాలయానికి ప్రతి రోజు వచ్చేలా విద్యార్థులు అలవాటు చేసుకోవాలని సూచించారు. మంచి మంచి పుస్తకాలు చదివి తమ జీవితాలకు ఉన్నతమైన బాటలు వేసుకోవాలని సూచించారు. రాష్ట్ర విద్య, మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ జి.నాగేందర్‌గౌడ్ మాట్లాడుతూ, వికారాబాద్ గ్రంథాలయంలో ఎంతో విలువైన గ్రంథాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని పేర్కోన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సనగారి కొండల్‌రెడ్డి మాట్లాడుతూ, గ్రంథాలయాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కోన్నారు. జనవరి నుంచి వికారాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రూప్-2 పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ పేర్లను గ్రంథాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను కూడా త్వరలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆశించిన దానికంటే ఎక్కువ మంది విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తే బ్యాచులవారీగా తరగతులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వికారాబాద్‌లో స్టడీసర్కిల్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కోరగా, స్టడీసర్కిల్‌ను ఏర్పాటు చేయడానికి అంగీకరించినట్లు చెప్పారు. అప్పటివరకు గ్రూప్-2 ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రూప్-2 శిక్షణ తరగతులను నిర్వహించడానికి 5 లక్షల రూపాయలు అవసరమవుతాయని, తన సొంత నిధులతో గ్రూప్-2 శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బి.సంజీవరావు 5 లక్షల రూపాయలు, జిల్లా కలెక్టర్ 2.5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని పేర్కోన్నారు. జిల్లాలోని ఇతర మండల కేంద్రాలలో గల గ్రంథాలయాలలో కూడా అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వికారాబాద్‌లోని కేంద్ర గ్రంథాలయంలో ఫిర్యాదు చేయడానికి ఒక పుస్తకం ఏర్పాటు చేసినట్లు, ఏమైనా ఫిర్యాదులో ఉంటే ఆ పుస్తకంలో నమోదు చేస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా విద్యార్థులు తమకు అవసరమైన 300 పుస్తకాల వివరాలను అందజేశారని, వాటిని వారం రోజులలో సమకూరుస్తామని తెలిపారు. గ్రంథాలయంలో ప్రస్తుతం 5 కంప్యూటర్లు ఉన్నాయని, వాటితోపాటు మరో 6 కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. జడ్‌పిటిసి సభ్యుడు ముక్తార్‌షరీఫ్, మున్సిపల్ వైస్ చైర్మన్ హెచ్. సురేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.రాంచంద్రారెడ్డి, ధారూరు పిఎసిఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ రాజమల్లయ్య, టిఆర్‌ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు నరోత్తంరెడ్డి, అర్కతల రాంరెడ్డి, పాండురంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ పాలకమండలి సభ్యులు యాదయ్యగౌడ్, శోభారాణి  పాల్గొన్నారు.

Comments

comments