Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

జియస్‌టి పై తిరోగమనం

sampadakeyam

నిలిచిపోతుంది. గత జులై 1వ తేదీన అర్థరాత్రి పార్లమెంటు సమావేశాల జేజేలతో అవతరించిన ఈ జాతీయ స్థాయి ఏకీకృత పన్ను విప్లవాత్మకమైనదిగా, చరిత్రాత్మకమైనదిగా కీర్తనలందుకున్నది. అవతరించి గట్టిగా ఆరు మాసాలైనా కాకుండానే దేశ ప్రజల దూషణ, ఛీత్కారాలకు గురైంది. ఒక రకంగా చెప్పాలంటే అంతవరకూ శిఖరోన్నతంగా పెరిగిన ప్రధాని మోడీ ప్రతిష్ఠ పెద్దనోట్ల రద్దు చర్యతో అంతకుముందే కొంత కుంగి జియస్‌టి దెబ్బతో పాతాళ పతనం చెందింది. ఎవరెంతగా విమర్శించి నా చివరికి యశ్వంత్ సిన్హా వంటి స్వపక్ష పెద్దలే చీల్చి చెండాడినా ఈ రెండు చర్యలను మోడీ, ఆయన ఆర్థిక అమాత్యులు అరుణ్‌జైట్లీ పదేపదే గట్టిగా సమర్థించుకున్నారు. అందుకు పూర్తి విరుద్ధంగా గువహతి సమావేశంలో జియస్‌టి తనకు తానే శృంగభంగం చేసుకున్నది. ఎకాఎకీ 178 వస్తువులను 28 శాతం నుంచి 18 శాతం శ్లాబులోకి కుదించుకున్నది. గరిష్ఠ (28శాతం) శ్లాబులో ఇంకా 62 వస్తువులను ఉంచవచ్చన్న సిఫార్సును కూడా పక్కన పెట్టి కేవలం 50రకాల వస్తు, సేవలకే దానిని పరిమితం చేసింది. ఎటువంటి ఒత్తిడి జియస్‌టి కౌన్సిల్‌ను ఇంతటి భారీ స్థాయి వెనుకడుగుకు తరిమిందో అర్థం చేసుకోవచ్చు.
జియస్‌టి కౌన్సిల్ గువహతి సమావేశం తీసుకున్న నిర్ణయాలవల్ల చిన్న, మధ్య తరగతి వ్యాపారస్థులకు ఊరట లభించనున్నది. షాంపూలు, టూత్‌పేస్ట్‌లు, చూయింగ్‌గమ్, షూ పాలిష్, కాస్మొటిక్స్, మార్బుల్స్, గ్రానైట్ వంటివి 28 శాతం పన్నునుంచి విముక్తి పొందిన 178 రకాల వస్తు, సేవలలో ఉన్నాయి. వాస్తవానికి గత యుపిఎ ప్రభుత్వం అమలులోకి తీసుకు రాదలచిన జియస్‌టిలో గరిష్ఠ పన్ను పరిధి 18శాతానికే పరిమితం చేయాలనుకున్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం దానిని కాదని 28 శాతాన్ని ఎంచుకున్నది. ఇప్పుడు దాదాపు పూర్తిగా వెనక్కి తగ్గవలసి వచ్చింది. ఆ మిగిలిన 50 రకాలను సైతం 18%పన్ను కిందికే తెచ్చి 28 శాతానికి స్వస్థి చెప్పాలనే యోచన కూడా ఉన్నట్టు చెబుతున్నారు. శుభస్య శీఘ్రం.
అధిక పన్నుతో ప్రజల నడ్డి విరగ్గొట్టి ఖజానాను అపరిమితంగా నింపుకోవడం ఆ డబ్బుతో విలాసాలు చిత్తగించడం రాచరిక పాలకుల లక్షణం. ప్రజాస్వామ్య వ్యవస్థలో బొత్తిగా అనుసరించదగని ఈ పద్ధతిని ఎంచుకోవడంలోనే మోడీజైట్లీ తప్పులో కాలు స్పష్టపడుతోంది. ప్రజలు త్యాగం చేయకపోతే ప్రభుత్వ ఖజానా ఎలా నిండుతుంది, అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు ఎలా సమకూరుతుంది? అని అధిక జియస్‌టిని సమర్థించుకుంటూ అరుణ్ జైట్లీ నుడివిన సందర్భం ఉన్నది. తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నట్టు ప్రజలు తమ కనీస జీవనానికే ముప్పు వాటిల్ల జేసే స్థాయి త్యాగాలకు సిద్ధపడాలనడంలోనే అవివేకం ఎంతటిదో ఆయనకు అప్పుడు తెలిసిరాలేదు. దేశమంతా గగ్గోలుపుట్టిన తర్వాత ఇప్పుడు ప్రభువులకు జ్ఞానోదయమైంది. గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ సారథి రాహుల్ గాంధీ గబ్బర్ సింగ్ పన్ను అంటూ చేస్తున్న అవహేళనకు వస్తున్న ప్రజాస్పందనే ఈ సవరణలకు కారణమనవచ్చు.
జియస్‌టిని అపరిమితంగా విధించిన తర్వాత గత నాలుగు పైగా మాసాలకాలంలో రెస్టారెంట్లలో ఆహార పదార్థాలపై విపరీతంగా పన్ను వసూలు సాగిపోయింది. ఆ మేరకు వినియోగదారుల జేబుల కత్తిరింపు జరిగిపోయింది. ఇప్పుడు తాజా నిర్ణయాలలో ఫైవ్‌స్టార్ హోటళ్లకు మాత్రమే అత్యధిక పన్ను రేటును పరిమితం చేశారని సమాచారం. నాన్ ఎసి, ఎసి సహా పన్నుపై అప్పు
(టాక్స్ క్రెడిట్)కోరని అన్ని రెస్టారెంట్లు, హోటళ్లను ఐదు శాతం శ్లాబులోకి తెచ్చారు. అలాగే మరికొన్ని వస్తు, సేవలను 18 శాతం నుండి కూడా తగ్గించి కింది స్లాబులకు తీసుకువచ్చారు. ఈ నిర్ణయాల వల్ల ఖజానాకు 20వేల కోట్ల రాబడి తగ్గుతుందంటున్నారు. అయితే సిమెంటు, వాషింగ్ మెషీన్స్, ఎయిర్ కండిషనర్స్ వంటి వాటిని ఇంకా 28 శాతం శ్లాబులోనే ఉంచారు. దీనివల్ల ఆధునిక జీవనశైలిని కోరుకునే మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర అసౌకర్యం వెన్నాడుతుంది.
మోడీజైట్లీ జంట ఇంత ఆదరాబాదరాగా, హడావుడిగా గైకొన్న ఈ తిరోగమన చర్య యాదృచ్ఛికంగానో, జనహిత దృష్టి వెల్లువెత్తడం వల్లనో జరిగింది కాదు. అతి సమీపంలోనే ఉన్న కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో గాలి మొదటిసారిగా బిజెపికి అత్యంత వ్యతిరేకంగా వీస్తుండడమే ఈ అసాధారణ నిర్ణయానికి మూలకారణమని ఘంటాపథంగా చెప్పవచ్చు. గుజరాత్ చిన్న, మధ్య తరగతి వ్యాపార వర్గాల కేంద్ర స్థానం. జియస్‌టి బాదుడు కారణంగా ఆ వర్గాలలో మోడీపట్ల మొదటిసారిగా విముఖత గూడుకట్టుకున్నది. ఈ ఎన్నికలు మరికొంతకాలం తరువాత జరిగే పరిస్థితే ఉంటే ప్రస్తుత జియస్‌టి భారీ సవరణ నిర్ణయం మరికొంత కాలం వాయిదా పడి ఉండేది. కర్ర వంకర పొయ్యి మాత్రమే తీర్చగలదనడానికి ఇది తిరుగులేని నిదర్శనం .

Comments

comments