Search
Sunday 27 May 2018
  • :
  • :

సొంతింట్లో ఉన్నట్లే..

Day-Care

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాల కోసం బయటకు వెళ్లే పరిస్థితి దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తోంది. చిన్న పిల్లలు ఉన్న ఇల్లయితే.. తమ బిడ్డను ఎక్కడ వదిలివెళ్లాలో తెలీక.. వీధికో డే కేర్ సెంటర్లున్నా.. అక్కడ తమ పిల్లల్ని జాగ్రత్తగా చూస్తారో లేదోనన్న అనుమానం.. సరైన డే కేర్ సెంటర్‌ను ఎంచుకోవడం కత్తిమీద సామే. వేళాపాళాలేని ఉద్యోగాలు, స్కూలు నుంచి త్వరగా వచ్చే తమ బిడ్డలు ఎక్కడ ఎలా ఉంటారోననే విచారం, సమయానికి వారికి తిండి పెట్టలేకపోతున్నామన్న బెంగ …ఉద్యోగాలు చేసే 80 శాతం మంది తల్లుల సమస్య ఇది. ఇలాంటి వారి సమస్యల్ని తీర్చేందుకు ఏర్పాటు చేసిందే ‘క్లే డే కేర్ సెంటర్’.

బెంగళూరుకు చెందిన ప్రియాకృష్ణన్ ఇలాంటి సమస్యనే స్వయంగా ఎదుర్కొంది. తను ఉద్యోగానికి వెళ్తూ తన బిడ్డను డే కేర్ సెంటర్లో జాగ్రత్తగా చూస్తారో లేదోనని సతమతమయ్యేది. చివరికి తనే ఎందుకు డే కేర్ సెంటర్‌ను ప్రారంభించకూడదనుకుంది. అలా ఆమె ఆలోచనలన్నుంచి పుట్టిందే క్లే డే కేర్ సెంటర్. ఎంతో మంది మహిళల సమస్యల్ని తీరుస్తూ, వారికి ధైర్యాన్నిస్తోంది ప్రియాకృష్ణన్. ఎంబిఎ అయ్యాక జాబ్ నిమిత్తం లండన్ వెళ్లింది. అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు. ఇండియాకు వచ్చిన తర్వాత డే కేర్ సెంటర్ ప్రారంభించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధ్యయనం చేసింది. అప్పటికే ఇండియాలో చాలా డే కేర్ సెంటర్లున్నాయి. మామూలు గా అయితే పోటీని తట్టుకోవడం కష్టం. అందరి కంటే భిన్నంగా రెండు రకాల సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. మొదటిది కాలనీల్లో, రెండోది కార్పొరేట్ కంపెనీల్లో డే కేర్ సెంటర్లను ఏర్పాటుచేసింది. సొంతూరైన బెంగళూరులో ఆరేళ్ల క్రితం క్లే డేకేర్ సెంటర్‌ను మొదలుపెట్టింది. వ్యాపారానికి పబ్లిసిటీ చాలా అవసరం.

వెబ్‌సైట్ పెట్టి కరపత్రాలను పంచింది. పిల్లలు పెరిగేకొద్దీ సిబ్బంది ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. సొంత పిల్లల్ని చూసుకున్నట్లు, నిజాయితీగా పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేంగా ఇంటర్వూలు పెట్టి సెలక్ట్ చేసింది. ముందుగా తనకు నమ్మకం కుదిరాకే వారిని తీసుకుని, ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. మా దగ్గరకు వచ్చే పిల్లలకు ఇంటి వాతావరణం కల్పించడం, సొంత వాళ్లతో ఉన్నామనే భావన కల్పించడమే లక్షంగా పనిచేస్తున్నాం అంటుంది ప్రియా కృష్ణన్. క్లే డే కేర్ సెంటర్ సిబ్బందిలో వైద్యులు, నర్సులు, పోషకాహార నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. పిల్లల అవసరాలకు తగ్గట్టుగా వేళకు ఆహారం అందిస్తారు. ఇవన్నీ సిబ్బంది సరిగ్గా నిర్వర్తిస్తున్నారో లేదో పరిశీలించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు చేసింది. ఆ వీడియోలు చూడాలనుకునే పేరెంట్స్‌కు వాటిని అందించడం ఈ డే కేర్ ప్రత్యేకత. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో మొదట ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసి, క్రమంగా ప్రముఖ కంపెనీ ప్రాంగణాలకు విస్తరించింది.

‘ది లిటిల్ కంపెనీ’ పేరుతో కూడా సేవల్ని విస్తరించారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, పూనె, చెన్నై, గుడగావ్, నోయిడాలలో వీరి సేవలను అందిస్తున్నారు. పసి పిల్లలు మాత్రమే కాకుండా, స్కూలుకెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చే పిల్లల బాధ్యత కూడా తీసుకుంటారిక్కడ. ఆరు నెలల పాపాయి దగ్గర్నుంచి పదేళ్ల పిల్లల వరకు చేర్చుకుంటారు. హైదరాబాద్‌లోని సాలార్‌పూరియా నాలెడ్జ్‌పార్క్, శేరిలింగంపల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, నానక్‌రాంగూడలో క్లే డే కేర్ సెంటర్లున్నాయి. ప్రాక్టర్ అండ్ గాంబుల్, ఇన్ఫోసిస్ ప్రాంగణాల్లో సేవలందిస్తున్నారు.

ముంబయి, చెన్నై, నోయిడా, బెంగళూరు నగరాల్లోని ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్, జెన్‌పాక్, జాన్సన్ అండ్ జాన్సన్, ఎయిర్‌టెల్, తాజ్ హోటల్స్ వంటి 30 సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు చెబుతున్నారు ప్రియ. కేవలం పిల్లల్ని చూడటమే కాదు, వాళ్ల ఆసక్తులను కూడా గుర్తించి, వాటిలో తర్ఫీదు ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. చిత్రలేఖనం, నాట్యం , కరాటే, యోగాలాంటివి నేర్పిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాలు కలిపి పదివేల మందికి పైగా చిన్నారులున్నారు. ఈ కేంద్రాల ద్వారా వెయ్యి మందికి పైగాఉపాధి కల్పిస్తున్నారు. వారిలో 90 శాతం మంది మహిళలు ఉండటం గమనార్హం. ప్రియాకృష్ణన్ బెంగళూరులో ఉంటున్నా ప్రతిరోజు ప్రతి ఒక్క డైరెక్టర్‌తో మాట్లాడుతోంది. రోజుకో ప్రాంతాన్ని పర్యవేక్షిస్తుంది. వారంలో ఒకసారి ప్రతి నగరంలోని తమ కేంద్రాలను పర్యవేక్షిస్తోంది. పిల్లల సంఖ్య వయసును బట్టి ముగ్గురు నలుగురు పిల్లలకు ఒక ఉద్యోగి ఉండేలా ఏర్పాటుచేసింది. పేరెంట్స్ అవసరాలు , ఉండే సమయాన్ని బట్టి ఫీజు వసూలు చేస్తారు. దేశవ్యాప్తంగా వంద కేంద్రాలున్నాయి. వచ్చే నాలుగేళ్లలో రెండు వందలకు చేయాలని లక్షంగా పెట్టుకున్నట్లు ప్రియ వెల్లడించింది. ఈ విజయం నాదొక్కదానిదే కాదు, పిల్లల ఆలనాపాలనా చూస్తున్న ప్రతి మహిళదీ.

Comments

comments