Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

చెల్లెలికి సంకెళ్లు

main

 జగిత్యాలలో సంచలనం రేపిన సొంత అన్నల చర్య

 జగిత్యాల: సొంత అన్నలే ఆమె చేతులకు బేడీలు వేసి బంధించారు. జగిత్యాల పట్టణంలోని వాణీనగర్‌కు చెందిన చిట్యాల గీత అనే యువతికి సోదరులే సంకెళ్లు వేసిన ఉదంతం గురువారం బయటపడింది. జగిత్యాల ఎస్‌పి అనంతశర్మ తెలిపిన వివరాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోవడంతో గీత తన ముగ్గురు అన్నయ్యలతో కలిసి ఉంటోంది. అయితే కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల వారిపై దాడి చేస్తుండటంతో గీత అన్నయ్యలు ఆమె చేతులను గొలుసుతో కట్టేసి ఇంట్లోంచి బయటకు వెళ్లనీయడం లేదు. కాగా గీత బుధవారం రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లడంతో ఆమె చేతులను గొలుసుతో కట్టివేసి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు అక్కడికి చేరుకొని గీతను టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే తాను మానసికంగా బాగున్నానని, డిగ్రీ పూర్తి చేసి కొంత కాలం పాటు ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేశానని, కావాలనే తన అన్నయ్యలు, వదినలు కలిసి తన చేతులను గొలుసుతో బంధించి ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయడం లేదని గీత పోలీసులకు వివరించింది. తాను అన్నలు, వదినతో కలిసి ఉండలేనని ఉన్నత చదువు చదవాలని ఉందని పేర్కొంది. తనను కుటుంబానికి దూరంగా ఎక్కడైనా వసతి గృహంలో ఉంచాలని కోరింది. కాగా గురువారం జిల్లా ఎస్‌పి అనంతశర్మ వాణీనగర్‌లోని గీత ఇంటికి వెళ్లి విచారించారు. తమ చెల్లి మానసిక స్థితి బాగా లేదని, తమపై, చుట్టుపక్కల వారిపై దాడి చేస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో చేతులను గోలుసుతో కట్టివేశామని కుటుంబ సభ్యులు ఎస్‌పికి వివరించారు. తనకు ఎలాంటి పిచ్చి లేదని కావాలనే అలా చెబుతున్నారంటూ గీత ఎస్‌పికి వివిరించింది. గీతను హైదరాబాద్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తామని, వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్‌పి తెలిపారు. మానసికంగా బాగా లేకపోయినా మహిళా అని చూడకుండా చేతులను గొలుసుతో కట్టివేసి తాళం వేయడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని, ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దన్నారు.

Comments

comments