Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

అర్హతలు లేని వైద్యులకు శిక్షణ

Doctor

అల్లోపతి వైద్యం నేడు దేశంలో ప్రజల ప్రధాన స్రవంతి వైద్యంగా ఆదరణ పొందుతున్నది. జనాభాకు తగిన సంఖ్యలో అర్హులైన అల్లోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ లేని కారణంగా అర్హతలు లేని వైద్యు ల సేవలు అనివార్యం అయింది. అందుకే అర్హతలు లేని మెడికల్ ప్రాక్టీషనర్‌ల నిషేధం కోసం, అదే విధంగా, వారి గుర్తింపు కోసం దేశవ్యాప్త అందోళనలు జరుగుతున్నాయి.
1916లో ఇండియన్ మెడికల్ డిగ్రీస్ యాక్ట్ వచ్చింది. 1933లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ద్వారా అల్లోపతి వృత్తి ఏకీకృత నియంత్రణ దేశీయంగా అమలులోనికి వచ్చింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956 సవరణ ద్వారా అప్పటి దాక అమలులో ఉన్న అన్ని అల్లోపతి డిప్లొమా, లైసెన్షియేట్ కోర్సులు రద్దయినాయి. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కావడానికి ఎం.బి. బి.ఎస్. మాత్రమే కనీస అర్హతగా మిగిలింది. మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ పొందిన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్(ఆర్.ఎం.పి.) మాత్రమే అల్లోపతి వైద్యం చేయటానికి చట్టరీత్యా అర్హులు. ఆర్.ఎం.పి.లు కాని వారు ఆర్.ఎం.పి.అని చెప్పుకొన్నా, వైద్యం చేసినా చట్ట రీత్యా శిక్షార్హం. అల్లోపతి యేతర వైద్య విధానాలకు దేశంలో చట్టబద్ధత కల్పించిన తరువాత 1976 వరకు అనుభవం ప్రాతిపదికన ఆయా విధానాల వైద్యులకు రిజిస్ట్రేషన్ లభించింది. జనాభాకు తగిన నిష్పత్తిలో అర్హతలు కల వైద్యులు లేనందున, వారి తో సమాంతరంగా అర్హతలు లేని వైద్యులు తమ సేవలు అందిస్తున్నారు. అల్లోపతియేతర విధానాలలో అర్హత పొందిన వారు కూడ అల్లోపతి ప్రాక్టీస్ చేస్తున్నారు. కనుక అల్లోపతిలోనే అర్హతలేని వైద్యు ల సంఖ్య ఎక్కువ.
కొందరు ‘రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్’ అనే ఫుల్ ఫాం చెప్పుకొంటున్నారు. కాని, ఆర్.ఎం.పి.కి ఏ ఇతర ఫుల్ ఫాం ఇచ్చినా చట్టం దృష్ట్యా నేరం. ప్రస్తుత చట్టాల ప్రకారం, ఎం.బి.బి.ఎస్. విద్యార్హత ఉన్న వారే ఆర్.ఎం.పి.లు! ప్రభుత్వ ఉద్యోగంలో లేని అర్హతగల వైద్యులనే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (పి.ఎం.పి.) అని పిలవాలి. ప్రభుత్వ గుర్తింపు లేని వైద్యులను నకిలీ వైద్యులు లేదా క్వాక్స్ అని అధికారిక పత్రాలలో వ్యవహరిస్తున్నారు. అది అవమానకరంగా ఉన్నందున, తమను ‘అనుభవ వైద్యులు’గా పేర్కొనాలని అర్హతలు లేని వైద్యుల వాదన. వీరిని నకిలీ వైద్యులు అనకూడదు; అన్- క్వాలిఫైడ్ లేదా అన్ -రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (యు.ఎం. పి.) అనాలని మద్రాస్ హైకోర్ట్ 1998లో ఆదేశాలు జారీ చేసింది. కాని, నిత్య వ్యవహారంలో అన్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (యు.ఎం.పి.)నే ఆర్.ఎం.పి., పి.ఎం.పి.లని సంబోధిస్తున్నారు. ఇది చట్ట విరుద్ధం.
తెలంగాణది ప్రత్యేక పరిస్థితి. నాటి నిజాం పాలనలో యునాని రాజ వైద్యం. ప్రజలు ఆధారపడింది ఆయుర్వేదం పైన. అల్లోపతి వైద్యం బ్రిటిష్ కంటోన్మెంట్ వరకే పరిమితం. రెసిడెంట్ ఫ్రేసర్ చొరవతో అది హైదరాబాద్ నగర ప్రజలకు పరిచయమైంది. నైజాం రాజ్య విలీనం అనంతరం, అల్లోపతి క్రమంగా మహానగరం నుంచి మారుమూలలకు విస్తరించింది. హైదరాబాద్ నేడు అధునాతన అల్లోపతి వైద్యసేవల కూడలి. జిల్లా కేంద్రాలు, పట్టణాలలో కూడా నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. కాని, పట్టణ పేదలు, గ్రామీణులకు అర్హతలు లేని అల్లోపతి వైద్యులే ప్రాణ ప్రదాతలు. వైద్య విద్యార్హతలు లేనంత మాత్రాన వారేమీ నిరక్షరాస్యులు కారు. సెకండరీ పాఠశాల విద్యనుంచి ఉన్నత విద్యావంతులు ఉన్నారు. అర్హతగల వైద్యుల వద్ద అనుభవం గడించి ఆదర్శ వైద్యులుగా రాణిస్తున్నారు. ప్రజాదరణతో రాజకీయ పదవులు చేపట్టిన వారు కూడ ఉన్నారు. చట్టపరమైన గుర్తింపు కోసం యు.ఎం.పి.లు ప్రభుత్వంతో నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ల్లో ఆల్ ఇండియా మెడికోస్ ఫెడరేషన్, ఇండియన్ మెడికల్ అసొసియేషన్ వంటి సంఘాలు యు.ఎం.పి.లపై అసూయతో పోలీసు దాడులు చేయించి, కోర్టు కేసులు పెట్టించినాయి. నక్సల్ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు పోలీస్ మొదట టార్గెట్ చేసింది ఈ వైద్యులనే. పోలిస్ వేధింపులు, కోర్టుకేసులతో పాటు, సంఘ విద్రోహకుల ఆగడాలు కూడ మితిమీరుతున్న నేపథ్యంలో అర్హతలు లేని గ్రామీణ వైద్యులు తమ అస్తిత్వం పట్ల తీవ్ర సంఘర్షణకు లోనయ్యిండ్రు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం యు.ఎం.పి.ల వ్యధను, ప్రజలకు వారి అవసరాన్ని గుర్తించింది. దానితో, ఆనాటి కాంగ్రెస్ – తె.రా.స. సంకీర్ణ ప్రభుత్వం యు.ఎం.పి.ల శిక్షణకు హామీ ఇచ్చింది. పర్యవసానంగా 2009లో కమ్యూనిటీ పారామెడిక్ పేరిట ఏడాది శిక్షణ ప్రారంభమయ్యింది (జి.ఓ. ఆర్.టి. సంఖ్య: 1273, హెచ్‌ఎం&ఎఫ్ డబ్ల్యూ(కె1) శాఖ, తేది 06.10.2009). కాని, ముఖ్యమంత్రులు మారినప్పుడు ప్రాధాన్యతలు మారినాయి. శిక్షణ పూర్తి చేసిన వారికి పరీక్షలు నిర్వహించలేదు. శిక్షణ కార్యక్రమం అర్థంతరంగా అటక ఎక్కింది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం యు.ఎం.పి.ల శిక్షణకు నడుం బిగించింది. శిక్షణ కోసం ప్రత్యేక జి.ఓ.(జి.ఓ. ఆర్.టి. సంఖ్య: 428, హెచ్‌ఎం&ఎఫ్ డబ్ల్యూ (ఎఫ్1) శాఖ, తేది 29.06.2015) రూ.46,01,840 నిధులు విడుదల చేసి చిత్తశుద్ధిని చాటుకొన్నది. ఒక్కసారి అవకాశంగా (వన్ టయిమ్ సెటిల్మెంట్) యు.ఎం.పి.లు అందరికి శిక్షణ పూర్తి చేయించాలని భావిస్తున్నది. అవశేష ఆంధ్రప్రదేశ్ కూడా శిక్షణకై 2017 సెప్టెంబర్ లో జిఓ 465 జారీ చేసింది. శిక్షణ ఫలితంగా నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ ప్రాక్టీషనర్స్ సమస్యను అరికట్టవచ్చు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్, క్లినికల్ ఎష్టాబ్లిష్మెంట్స్ యాక్ట్‌ను సరిగా అమలు పరచవచ్చు. వైద్య సేవల శాస్త్రీయత, నాణ్యత మెరుగుపడుతుంది.
సరియైన పరిభాష – సి.ఎం.పి.:
ఉద్దేశం ఎంత మంచిదైనా, రంధ్రాన్వేషణ చేసే వర్గం కూడ ఉంటుంది. సమస్య పరిష్కారంలో భాగం కాకుండా జటిలం చేసే చతురత మేధావితనంగా చలామణి అవుతున్నది. పరిభాష కూడ అందుకు ఒక పరికరం కావచ్చు. పరిభాష పరమైన లొసుగులు మెడికల్ కౌన్సిల్ అభ్యంతరాలకు, న్యాయపరమైన వివాదాలకు తావు కల్పించవచ్చు. ఈ యు.ఎం.పి.ల శిక్షణ పూర్తి అయినా మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఈయదు. మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ పొందిన వారు తప్ప ఇతరులు ఆర్.ఎం.పి. అని చెప్పు కొనటం చట్టరీత్యా తప్పు. కనుక ఆర్.ఎం.పి. అనలేము. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వానికి మెడికల్ కౌన్సిల్ ఈ విషయమై అభ్యంతరం తెలిపింది కూడా. ఎట్టి కోశానా శిక్షణ ప్రారంభించాలన్నది ప్రభుత్వ సంకల్పం. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో గ్రామీణ, పట్టణ ప్రథమ చికిత్సకులకు కమ్యూనిటీ పారామెడిక్ ప్రోగ్రాం ఉన్నది. కనుక, కమ్యూనిటీ పారామెడిక్ ట్రయినింగ్ పేర, బాధ్యతను పారామెడికల్ బోర్డ్ మీద పెట్టింది ఆనాటి ప్రభుత్వం. కొన్ని పరిమితులు విధించి, ఆ పరిధిలో ప్రాక్టీస్‌కు అనుమతించాలనేది ఈ శిక్షణ ఉద్దేశం. ఈ ప్రాక్టీషనర్లను కమ్యూనిటీ పారామెడిక్ లేదా సి.పి. అనాలని నిర్దేశం. కాని, ఒక సొంత సోలో మెడికల్ ప్రాక్టీషనర్ను పారామెడిక్ అనటం సరికాదు. వీరికి ట్రయినింగ్ సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. కాబట్టి సర్టిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ (సి.ఎం.పి.)అంటె బాగుంటుంది. అలవాటు పడిన ఆర్.ఎం.పి.ఉచ్ఛారణకు దగ్గరగ ఉంటుంది. మెడికల్ కౌన్సిల్ అభ్యంతరం చెప్పే ఆస్కారం లేదు. కనుక, వీరిని సర్టిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ (సి.ఎం.పి.) అనటం అన్ని విధాల సమంజసం.
ప్రజల ప్రాథమిక చికిత్సకు సి.ఎం.పి.ల సేవలు తప్పక తోడ్పడుతాయి. దేశ అవసరాలరీత్యా భవిష్యత్తులో కేంద్రప్రభుత్వం సర్టిఫికెట్, డిప్లొమాలను పునరుద్ధరిస్తే ఈ నమూనా ఒక మార్గదర్శకంగా ఉంటుంది.

                                                                                                                                                                                   * డా.రాపోలు సత్యనారాయణ

Comments

comments