Search
Wednesday 22 November 2017
  • :
  • :

ముక్కోణపు పోటీ!

crickeet

* ధావన్, రాహుల్, విజయ్‌లలో ఓపెనర్ స్థానం ఎవరికో?

మన తెలంగాణ/ క్రీడా విభాగం: శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. శిఖర్ ధావన్, కెఎల్.రాహుల్, మురళీ విజయ్‌లను ఈ సిరీస్ కోసం ఓపెనర్లుగా జట్టులోకి తీసుకున్నారు. ముగ్గురు కూడా అద్భుత ప్రావీణ్యం కలిగిన వారే. ఇటీవల కాలంలో ముగ్గురు కూడా తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు కీలకంగా మారారు. ఈ పరిస్థితుల్లో ముగ్గురిలో ఎవరికి తుది జట్టులో స్థానం కల్పించాలో తెలియని పరిస్థితి జట్టు కెప్టెన్‌కు, కోచ్‌కు నెలకొంది. శ్రీలంక సిరీస్‌లో మురళీవిజయ్ గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు. దీంతో శిఖర్ ధావన్, రాహుల్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అయితే ప్రస్తుతం విజయ్ పూర్తిగా కోలుకుని మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఈ పరిస్థితుల్లో ఓపెనర్ల ఎంపిక క్లిష్టంగా తయారైంది. అయితే రాహుల్, విజయ్‌ల వైపు కెప్టెన్ కోహ్లి మొగ్గు చూపే అవకాశం ఉంది. శిఖర్ ధావన్ కంటే టెస్టుల్లో రాహుల్, మురళీలకు మంచి రికార్డు ఉండడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో మురళీ, రాహుల్‌లు ఓపెనర్లుగా అద్భుతంగా రాణించారు. గాయం వల్ల ఇద్దరు జట్టుకు దూరం కావడంతో ధావన్, ముకుంద్‌లకు ఓపెనర్లుగా అవకాశం దక్కింది. అయితే లంక సిరీస్‌కు ప్రధాన ఓపెనర్లు ఇద్దరు కూడా అందుబాటులోకి రావడంతో ఓపెనర్ల సమస్య తీరిపోయినట్టే. అయితే కిందటి లంక సిరీస్‌లో ధావన్ ఓపెనర్‌గా మెరుపులు మెరిపించి టెస్టుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దీంతో అతన్ని కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేయక తప్పలేదు. అయితే తుది జట్టులో అతను ఆడుతాడా లేదా అనేది మొత్తం కెప్టెన్ కోహ్లి నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. కోహ్లి తన స్నేహితుడు రాహుల్‌వైపే ఆసక్తి చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ధావన్‌తో పోల్చితే రాహుల్‌కు ఓపెనర్‌గా మంచి రికార్డు ఉండడమే కారణం. ఇక, విజయ్ మాత్రం తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నాడనే చెప్పాలి. ఇటీవల కాలంలో భారత్ సాధించిన విజయాల్లో మురళీ విజయ్ పాత్ర వేలకట్టలేనిది. పలు మ్యాచుల్లో భారత్‌కు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టిన ఘనత విజయ్‌కు ఉంది. ఈ పరిస్థితుల్లో అతన్ని తుది జట్టులో నుంచి తప్పించే సాహం కోహ్లి చేయక పోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అంత అనుకున్నట్టుగా జరిగితే ఈ సిరీస్‌లో మురళీ విజయ్, రాహుల్‌లు ఇన్నింగ్స్ ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదైన అనూహ్యం జరిగితే తప్ప ధావన్‌కు ఓపెనర్‌గా తుది జట్టులో ఛాన్స్ దొరకడం కష్టమనే చెప్పాలి.

Comments

comments