Search
Wednesday 22 November 2017
  • :
  • :

కూరగాయల ఎఫెక్ట్

 టోకు ద్రవ్యోల్బణమూ పైపైకి
 అక్టోబర్‌లో 3.59 శాతానికి
 ఆరునెలల గరిష్ఠానికి చేరుకుంది: కేంద్రం

vegetable

న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం మాదిరిగానే దేశీయ టోకు ద్రవ్యోల్బణం కూడా ఆరు నెలల గరిష్ఠానికి చేరుకుంది. కూరగాయల ధరల పెరుగుదల కారణంగా 2017 అక్టోబర్ నెలకు సంబంధించిన టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్లుపిఐ) 3.59 శాతానికి పెరిగింది.  గత నెలలో ఇది 2.60 శాతంగానే ఉంది.  అక్టోబర్‌లో కూరగాయల ధరలు 36.6 శాతం పెరిగాయి. దీంతో ఆహార ద్రవ్యోల్బణం 4.3 శాతంతో రెట్టింపు అయింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావంతో ఇంధన ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 9 శాతం నుంచి అక్టోబర్‌లో 10.5 శాతానికి పెరిగింది. ఈమేరకు మంగళవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, డబ్ల్యుపిఐ 2011-12 సంవత్సరానికి సవరించిన బేస్ సంవత్సరంతో సెప్టెంబర్ నెలలో 2.60 శాతం నుంచి 3.59 శాతానికి పెరిగింది.  గణాంకాల ప్రకారం ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రెండు రెట్లు పెరిగి అక్టోబర్‌లో 4.30 శాతంగా నమోదైంది. కూరగాయాల ధరల్లో పెరుగుదల సెప్టెంబర్‌లోని 15.48 శాతం నుంచి 36.61 శాతానికి చేరింది. ఇక ఉల్లిగడ్డల ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. దాదాపు 127.04 శాతం పెరిగింది. కోడిగుడ్లు, మాంసం, చేపల ధరల్లో 5.76 శాతం వృద్ధి కనిపించింది. తయారీ ఉత్పత్తుల ధర 2.72 నుంచి 2.62 శాతానికి తగ్గింది. పప్పుధాన్యాల విషయంలో మాత్రం ప్రతి ద్రవ్యోల్బణం నమోదైంది. అది 31.05 శాతం వద్ద, బంగాళదుంపలు 44.29 వద్ద, గోధుమలు 1.99 శాతం వద్ద ఉన్నాయి. కాగా సోమవారం వెల్లడించిన రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను ప్రభుత్వం ప్రకటించింది. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా గరిష్ఠ స్థాయికి చేరింది. కూరగాయల ధరలు ఆకాశాన్నంటడంతో అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.58 శాతంతో ఏడు నెలల గరిష్ఠానికి చేరుకుంది. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం 3.28 శాతంతో పోలిస్తే ఈసారి పెరిగింది. డిసెంబర్ 5, 6 తేదీలలో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరో ద్వైమాసిక సమీక్ష జరుగనుంది. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం రెండు సూచీలు పెరగడంతో ఈసారి సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ద్రవ్యోల్బణం గణాంకాలను చూస్తే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Comments

comments