Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

టి-బిజెపి ఎదగనిది ఎందుకు?

tdjp

తెలంగాణలో బిజెపి పరిస్థితి రోలర్‌కోస్టర్ వలె ఉంది. ఇంతలోనే ఎనలేని ఉత్సాహంతో, ఆశలతో ఆకాశంలోకి. అంతలోనే సందిగ్దాలు, నీరసంతో నేల పైకి. ఇక్కడ అధికారంలోకి రావటం ఇప్పటికిపుడు వీలుకాకున్నా కనీసం తప్పక రెండవ స్థానంలోకి రావాలనుకుంటున్న ఆ పార్టీకి ఇది ఎంత ఇబ్బందికర మైన పరిస్థితో ఊహించవచ్చు. 2019 ఎన్నికలలో దక్షిణాదిన కర్ణాటకలో అధికార సాధన, తెలంగాణలో రెండవస్థానం, తమిళనాట అన్నా డిఎంకెను తమ కూటమిలో చేర్చుకోవటంతో పాటు స్వంత సీట్లు పెంచుకోవటం, కేరళలో ఇప్పటికే పెరుగుతున్న ఓట్ల శాతం వీలైనంత ఎక్కువయ్యేట్లు చేసుకోవటం వారి మహాప్రణాళిక. అది జరిగితే తాము ఆర్యావర్తపు పార్టీ అనే పేరును తుడిచివేసుకుని ద్రవిడ భూమిలోకి నిశ్చిత మైన రీతిలో ప్రవేశించగలమన్నది ఆలోచన. మొదటి నుంచిగల ఈ ముద్ర మాట అట్లుంచి, ఒక జాతీయ పార్టీగా దేశమంతటా బలపడాలని వారు కోరుకోవటం సహజం. అదిగాక, ఒకవేళ 2019లో తమ బలం ఉత్తరాదిన కొంత తగ్గవచ్చుననే అంచనాలు ఉన్నం దున, ఆ నష్టాలను దక్షిణదేశంలో పూడ్చుకోవలసి ఉంటుంది. కనుక, పైన ప్రస్తావించిన మహాప్రణాళిక అవసరమవుతున్నది.
తక్కిన దక్షిణాదిని, మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను అట్లుంచి ఇక్కడ తెలంగాణకు పరిమిత మై చూద్దాము. ఈ రాష్ట్రంలో బలపడాలని 2014లో వారు కేంద్రంలో గెలిచినప్పటినుంచి కోరుకుంటున్నా, ఈ మూడున్నర సంవత్సరాలలో ఎటువంటి పురోగతి లేదు. ఈ విషయమై వారి అంచనాలకు హడావుడులకు ఏ కొరతా లేదు. తాము తెలంగాణ ఉద్యమాన్ని బల పరచటం, పార్లమెంటులో బిల్లుకు అనుకూలంగా ఓటు వేయటం అనే రెండింటి ఆధారంగా వారి ఆశా భావాలు మొదలయ్యాయి. అయినప్పటికీ 2014లో తెలంగాణలో సీట్లు ఎంతమాత్రం పెరగకపోవటం నిరాశను కలిగించినా, అపుడు ఇక్కడి మధ్యతరగతిలో, పట్టణాలలో మోదీ వ్యక్తిగత ప్రభావం కొంత కన్పిం చటం వల్ల, కేంద్రంలో ఘనవిజయం వల్ల కొత్త ఆశలు తలెత్తాయి. మోడీ ప్రతిష్ఠను ఉపయోగించుకుని తెలంగాణలో పలుకుబడి పెంచుకోగలమని భావించారు.
ఇదంతా 2014 పరిస్థితి. కాని తర్వాత 2015, 2016 ఇపుడు 2017 కూడా ముగుస్తున్న దశ వచ్చినా పార్టీలో ఎంతమాత్రం ఎదుగుదల లేదు. ఆ విచారం అయినా వారి కేంద్ర నాయకత్వానికి తప్ప, ఇక్కడి నాయకులకు ఏమీ ఉన్నట్లు బయటి పరిశీలకులకైతే కన్పించలేదు. ఎదగాలనే కోరిక లేదనలేము. కాని కోరుకోవటం, ఆ పని ఏదో విధివశాత్తు జరగగలదను కోవటం, మోదీ ప్రభావంతో దానంతట అదే సిద్ధిస్తుం దని కలలుగనటం, వ్యూహరచనా దురంధరుడైన జాతీ యాధ్యక్షుడు అమిత్ షా ఈ కార్యాన్ని కూడా నెరవేర్చ గలడనుకోవటం మినహా, కోరికను నెరవేర్చుకునే దిశలో ఇక్కడి నాయకత్వం తనంతట తాను ఒక్క ముందడుగు వేసిన దాఖలాలు లేవు. ఈ స్థితి ఇక్కడ తమ కార్యకర్తలకు, తమ ప్రత్యర్థులకు, బయటి జనా నికి, ఢిల్లీలోని బిజెపి నాయకత్వానికి అందరికీ అర్థ మైంది. కనుక తెలంగాణ నాయకులకు కూడా అర్థమయ్యే ఉండాలి. వారు నిష్క్రియాపరులు, సోమరి స్వాప్నికులు కావచ్చుగాని తెలివిలేని వారు కాదు గదా. అయినప్పటికీ సక్రియాపరులు ఎందుకు కాలేదు. మూడు సంవత్సరాలు ఎందువల్ల వృథా చేసారంటే సమాధానాలు వారు మాత్రమే చెప్పగలగాలి. ఏమి చేయాలన్నది వారికి తోచకపోవటమా? పరస్పర అంగీ కారాలు లేనందువల్లనా? హైదరాబాద్‌లోనే స్వంత పనులు చాలా ఉండటమా? ప్రయత్నించినా జరిగేదేమీ లేదనే ముందస్తు నిరాశలా? లేక శరీరాలు సహకరించ కపోవటమా? ఇవన్నీ కొంత చొప్పున పని చేసాయా?
అయితే ఇదంతా కొత్త కాదన్నది గుర్తించవలసి విషయం. లోగడ వాజ్‌పేయి ప్రధానమంత్రి కావటం, దాని ప్రభావం తెలంగాణ మధ్య తరగతిపై, పట్టణ తరగతులపై, శిష్ట వర్గాలపై ఉండటం కూడా ఇటు వంటి వాతావరణాన్నే సృష్టించింది. ఇక్కడి బిజెపి నాయకులకు పార్టీ అభివృద్ధి గురించి ఈ విధమైన అంచనాలనే కలిగించింది. చివరకు జరిగింది శూన్యం కాకపోతే ఇక్కడి నాయకుల స్వంతపురోగతికి సమస్య లేకపోయింది. అది వారికి సంతృప్తిని కలిగించింది. పార్టీ పెరగకపోవటం ఏ విచారాన్నీ కలిగించినట్లు లేదు. మోడీ ఆగమనం తర్వాత గత మూడున్నర సంవత్సరాలుగా ఈ చరిత్ర మరొకమారు వలయంవలె తిరుగుతున్నది. ఈ మధ్యకాలంలో, ముఖ్యంగా సుమారు గత సంవత్సరకాలంగా కేంద్ర పార్టీ నాయ కత్వానికి వీరి తీరు బోధపడి పలుమార్లు జాగ్రత్తలు చెప్పినట్లు, మందలించినట్లు వార్తలు వెలువడ్డాయి. కాని మార్పు లేకపోయింది. సభ్యత్వం చేర్పింపు, బూత్ కమిటీల ఏర్పాటు, హైదరాబాద్‌లో ఉండిపోవటం గాక బయట ప్రజల మధ్య తిరగటం, సమస్యలపై ఉద్యమాలు, గ్రూపు రాజకీయాలు మానటం వంటి అనేక నిర్దిష్టమైన సూచనలను కూడా అమిత్ షా చేసారు. తాను తరచు రాష్ట్రానికి వచ్చి పర్యవేక్షణలు చేయగలనని హెచ్చరించారు. మరీ ఇటీవలనైతే స్వయంగా తాను హైదరాబాద్ బయట పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఇటువంటి ఒత్తిడి సృష్టి దరిమిలా కొద్దిగా కదలిక లు కన్పించాయి. ఇక అదే ధోరణిలో వేగం పుంజుకుని పార్టీ విస్తరించగలదని బిజెపి కార్యకర్తలు ఆశించారు. కాని చూస్తుండగానే ఉత్సాహం మళ్లీ తగ్గిపోయింది. ఉత్సాహం చూపిన కొన్ని వారాలపాటు కాంగ్రెస్‌కు కూడా గుబులు కలిగింది. తమవారు, టిడిపివారు, ఇతరులు నెమ్మదిగా బిజెపి వైపు మళ్లగలరేమోనని, వేగం అదే విధంగా కొనసాగితే, అనూహ్యమైన రీతిలో వచ్చే ఎన్నికల నాటికి బిజెపి రెండవ స్థానాన్ని ఆక్రమించగలదేమోనని కాంగ్రెస్ వాదులలో కొందరు జంకక పోలేదు. అదే సమయంలో బిజెపి నాయకులు అధికారపక్షమైన టిఆర్‌ఎస్‌పై విమర్శలు పెంచారు. ఆ పార్టీతో తమది మితృత్వమా? వైరమా? జాతీయస్థాయి లో పరస్పర సంబంధాల పరిస్థితి ఏమిటి? వచ్చే ఎన్ని కలలో ఏమి జరగవచ్చుననే రకరకాల ప్రశ్నల మధ్య ఉండిన ఊగిసలాటను ఇక వదలి వేసుకుంటున్నట్లు కన్పించారు. ఆ విధంగా ఒక స్పష్టత వస్తున్నట్లు తోచింది.
కాని చిత్రమైన రీతిలో మళ్లీ స్తబ్దత ఏర్పడుతున్నది. ప్రభుత్వంపై విమర్శలను, అపుడపుడు కార్యక్రమాలను ఆపలేదు. అయినప్పటికీ నెమ్మదిగా తిరిగి నివురు గప్పు తున్నది. ఎందువల్ల ఇటువంటి స్థితి అన్నది బహుశా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం కావచ్చు. ఇది పైన పేర్కొన్న వివిధ పరిస్థితులను బట్టి మాత్రమే అర్థమయేది కాదేమో. ఆ విధంగా చూసినపుడు తెలంగాణలో బిజెపికి ఒక నికరమైన అజెండాలేని లోపం కన్పిస్తున్నది. ఇప్పుడే కాదు.
ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత కూడా వారిది అదే పరిస్థితి. నిజాం కాలం నుంచి ఈ రోజువరకు ముస్లిం వ్యతిరేకత, మధ్యలో కొంతకాలం నక్సలైట్ వ్యతిరేకత, సికిందరాబాద్‌లో మంచినీటి కొరత వంటి పౌర సమస్యలు మినహా ఆ పార్టీకి అజెండా ఏమైనా ఉందా అంటే ఆలోచించవలసి వస్తుంది. వారి విద్యార్థి, యువజన సంస్థలు, సంఘ్ పరివార్‌లోని మిత్ర సంస్థలు మాత్రం రకరకాల కార్యక్రమాలు చేస్తుం టాయి. ఒక పార్టీగా బిజెపి ఏమి చేస్తుందన్నది అసలు విషయం. కాని ఆ రాజకీయాలకు, ప్రజాసమస్యల కార్యక్రమాలకు, పార్టీ భావజాల ప్రచారానికి వారు చేసింది గతంలో స్వల్పం కాగా, ఈ రోజుకూ అదే పరిస్థితి.
వారు జనసంఘ్ అవతారంలో ఉండినపుడు బహుశా కొంత భిన్నంగా ఉండేది. కాని బిజెపిగా మారిన తర్వాత నుంచి ఇక్కడ అజెండాలు లేవు, పార్టీ నిర్మా ణాలు లేవు. తెలుగుదేశంపై, ఇంకా అటువంటి మిత్ర పక్షాలపై ఆధారపడి, దానితోపాటు హైదరాబాద్ నగరంలో ముస్లింల వ్యతిరేక సెంటిమెంట్లు రెచ్చ గొడుతూ నాలుగు సీట్లు గెలిచి ఆనందించేందుకు వారు పరిమితమవుతూ వచ్చారు. టిడిపితోపాటు తర్వాత దశలో తెలంగాణ సెంటిమెంటును, టిఆర్‌ఎస్ తో ఉండీలేని మైత్రిని నమ్ముకున్నారు. వీటి మధ్యలో కొంతకాలం వాజ్‌పేయి హవా కలిసివచ్చి కొంత సేపు గాలిలో తేలారు. ఇపుడు మోడీ హవాలో తేలగలమను కుంటున్నారు. ముస్లిం బూచిని చూపి టిఆర్‌ఎస్‌ను బెదిరించి తమ దారికి తెచ్చుకోగలమనుకోవటం మరొక కృత్రిమమైన కార్డు.
కాని ఖచ్చితమైన విధంగా పరిశీలించినపుడు ఇందులో నికరమైన రాజకీయ అజెండా అనదగ్గది ఏదీ కన్పించదు. ఒక పార్టీ నిర్మాణమన్నది ఒక్కొక్క ఇటుక ను పేర్చుకుంటూ, తీవ్రంగా శ్రమిస్తూ, తగినంత కాలపు కృషితో చేసే కార్యక్రమం. అందుకు స్పష్టమైన అజెండా, దీర్ఘకాలిక ప్రణాళిక తప్పనిసరి. తెలంగాణ లో, ఆ మాటకు వస్తే ఉమ్మడి రాష్ట్రంలో, అటువైపు అవశేష ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటిదేమీ మనకు గతం లో కన్పించకపోయినట్లే, ఇప్పటికీ కన్పించటం లేదు. అటువంటి స్థితిలో, ఆ పార్టీ ఎదుగుదల గురించిన ఆలోచన ఒక వృధా ప్రయాస.

Comments

comments