Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఓఖి బీభత్సం

laksha

 పెను తుఫానుకు లక్షద్వీప్‌లో భారీ విధ్వంసం  శ్రీలంకలో 13మంది మృతి

కవరత్తి: లక్ష దీవులలో ఓఖి తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు బలమైన గాలులు తోడవ్వడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొబ్బరి చెట్లు నేలకూలాయి. సమాచార వ్యవస్థ దెబ్బతింది. శనివారం కాల్పెని దీవిలో భారీ వర్షాలతో నీటిమట్టం ఉధృతమై చేపలు వేటకు వెళ్లిన ఐదు నౌకలు ధ్వంసమయ్యాయి. వచ్చే 24 గంట ల్లో లక్షదీవుల్లో తుఫాన్ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మినికాయ్ దీవులలో శనివారం ఉదయం వరకు 14 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కేరళ, తమిళనాడు నుంచి 12 నౌకలలో చేపల వేటకు వెళ్లిన మత్సకారులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.రానున్న 24 గంటల్లో లక్షదీవులలో గంటకు 145 కిలో మీటర్ల వరకు తీవ్ర గాలులు వీచి, క్రమంగా తగ్గుముఖం పట్టనున్నట్లు వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం సముద్రంలో చిక్కుకుపోయిన 218 మంది మత్సకారులను నావికా, వైమానిక, కోస్ట్‌గార్డ్‌లు సురక్షితంగా తీర ప్రాంతానికి చేర్చారు. 60 మంది మత్సకారులను జపాన్‌కు చెందిన కార్గో నౌక కాపాడినట్లు అధికారులు తెలిపారు.
531మంది మత్సకారులు సురక్షితం:
కేరళ,లక్షదీవుల తీర ప్రాంతాలలో భారీ వర్షాల తో సముద్రంలో చిక్కుకున్న 531 మంది మత్సకారులను కాపాడినట్లు శనివారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కేరళకు చెందిన 393 మంది మత్సకారులు ఉన్నారని ఆయన తెలిపారు. తుఫాన్ మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. మత్సశాఖ ఒక్కొక్కరికి ఇస్తున్న రూ.4 లక్షలకు అదనంగా ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు. లక్షదీవులలోని నివాసయోగ్యమైన 10 దీవులలో 31 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల నుంచి 1,047 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. కేరళలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలలో ఏడుగురు చనిపోయారు. రాష్ట్రంలో 29 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఓఖి తుఫాన్ ప్రభావంతో శ్రీలంకలో 13 మంది మృతి
శ్రీలంకలో ఓఖి తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురు గాలులతో 13 మంది మృతి చెందారు. దేశంలో అనేక ప్రాంతాలలో జనజీవనం అస్తవ్యస్తమైంది. 77 వేల మంది ప్రజలు తుఫాన్ ప్రభావానికి గురైనట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా, అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. అనేక చెట్లు నేల కూలాయి. భారీ తుఫాన్‌లో ఐదుగురు గల్లంతయ్యారని, 13 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 4 వేల మంది ప్రజలను సహాయక శిబిరాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలతో పిడుగులు పడే అవకాశమున్నట్లు ఆ దేశానికి చెందిన వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు తక్షణ సహాయం అందించాలని ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింగే ఆదేశించారు.

Comments

comments