Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

ట్రంప్ కుంపటి

 

trimp

ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంకు గుర్తింపు

టెల్ అవీవ్ నుంచి అమెరికా రాయబార
కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించడానికి నిర్ణయం
చిరకాల వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లు ప్రకటన
అది యూదుల రాజధాని అని వివరణ
ముస్లిం మనోభావాలకు వ్యతిరేకమని, ఈ మార్పు
తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని పాలస్తీనా
సహా అరబ్ ప్రపంచం హెచ్చరిక
పాలస్తీనాలో మూడు రోజుల నిరసన
ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన సెనెటర్
బెర్నీ సాండర్స్, ఐరాస, చైనా, ఫ్రాన్స్

వాషింగ్టన్ : జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా అమెరికా గుర్తించనుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జెరూసలెంను రాజధానిగా గుర్తిం చే ప్రక్రియలో భాగంగా అమెరికా ఎంబసీని ఇప్పుడున్న టెల్ అవీవ్ నుంచి మారుస్తారు. పవిత్ర నగరం జెరూసలెంను రాజధానిగా గుర్తించాలని చాలా కాలంగా అమెరికా సిద్ధాంతపరంగా భావిస్తోంది. అయితే అమెరికా నిర్ణయం మధ్యప్రాచ్యంలో మ రింత ఉద్రిక్తతకు దారితీస్తుందని పలు అరబ్ దేశాల నేతలు హెచ్చరిస్తూ వస్తున్నారు. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా అమెరికా గుర్తించే అధికారిక ప్రకటన, సంబంధిత కార్యాచరణ ప్రణాళికను అధ్యక్షులు ట్రంప్ అధికారికంగా ప్రకటించనున్నా రు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. జెరూసలెంకు రాజధానిగా గుర్తింపు ఇవ్వడం చారిత్రక వాస్తవానికి ప్రతీ క అవుతుందని ట్రంప్ భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ‘జెరూసలెం అనాదిగా యూదుల రాజధానిగా ఉంటూ వచ్చింది. దీనికి అనుగుణంగానే అక్కడ ప్రభుత్వ పీఠం, మంత్రిత్వశాఖలు, చట్టసభ, న్యాయస్థానం ఉండాలి’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి చెప్పారు. అధ్యక్ష పదవి ఎన్నికల ప్రచార సమయంలో జెరూసలెం అంశాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించారని, ఇంతకు ముందటి అధ్యక్షులు జెరూసలెం ప్రతిపత్తి గురించి కేవలం మాటలు చెప్పారని, అయితే ట్రంప్ తమ వాగ్దానం నిలబెట్టుకుంటున్నారని అధికారి వివరించారు. సాధ్యమైనంత త్వర గా టెల్ అవీవ్ నుంచి జెరూసలెంకు అమెరికా రాయబార కార్యాలయం మార్చే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ట్రంప్ ఆదేశించారు. జెరూసలెంలో కొత్త అసెంబ్లీ భవనం కోసం స్థలం, నిర్మాణానికి కొంత సమయం పడుతుంది. ఈ దశలో ఇజ్రాయెల్‌కు అమెరికా రాయితీలు కొనసాగించే ఏర్పాట్లు జరుగుతాయి. జెరూసలెంపై ట్రంప్ నిర్ణయం పట్ల అమెరికా కాంగ్రెస్‌లో విస్తృ త స్థాయిలో పార్టీలకు అతీతంగా మద్దతు లభించిందని అధికారులు తెలిపారు. మధ్యప్రాచ్యంలోని దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య సమగ్ర శాంతి ఒప్పందం కుదరాలనే విషయంలో ట్రంప్ కట్టుబడి ఉన్నారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.
ముస్లింల మనోభావాలకు వ్యతిరేకం : ట్రంప్ నిర్ణయం పట్ల సౌదీ అరేబియా, ఈజిప్టులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. జెరూసలెంను రాజధానిగా గుర్తించడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని సౌదీ రాజు సల్మాన్ హెచ్చరించారు. అదే విధంగా అమెరికాకు సన్నిహిత దేశం అయిన ఈజిప్టు అధ్యక్షులు అబ్దెల్ ఫతా అల్ సిసి కూడా దీనిని వ్యతిరేకిస్తూ ప్రకటనలు వెలువరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల విశ్వాసాలను ట్రంప్ నిర్ణయం దెబ్బతీస్తుందని సౌదీ రాజు పేర్కొన్నారు. ఇక ఈజిప్టు నేత స్పందిస్తూ అమెరికా చర్యతో మధ్య ప్రాచ్యంలో శాంతి అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. జెరూసలెంపై చాలా కాలంగా వివాదంసాగుతోంది. అంతర్జాతీయ సమాజం అత్యధికంగా తూర్పు జెరూసలెంను ఇజ్రాయెల్ ఆక్రమించుకుందని భావిస్తోంది. అందుకే టెల్‌అవీవ్‌లోనే పలు దేశాల ఎంబస్సీలు ఉన్నాయి. అయితే తమ కీలక నిర్ణయానికి ముందు ట్రంప్ పలు దేశాల నేతలతో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడైంది.ఇజ్రాయెల్ ప్రధాని జెంజమిన్ నెతాన్యాహూ, పాలస్తీనా అధ్యక్షులు మహమౌద్ అబ్బాస్‌తో వేరుగా మాట్లాడారు. జోర్డాన్ రాజు అబ్దుల్లాతో, ఈజిప్టు, సౌదీ నేతలతో కూడా విషయం చర్చించారు. ట్రంప్ నిర్ణయం చారిత్రకం అని సెనెటర్ టెడ్ క్రజ్ చెప్పారు. మరో సెనెటర్ బెర్నీ సాండర్స్ స్పందిస్తూ ఇది ఆందోళనకు దారితీసే అంశం అన్నారు. జెరూసలెంను పాలస్తీనియన్లు, ఇజ్రాయెలీయులు తమ సొంతంగా భావిస్తూ వస్తున్నారు. ఇరు వర్గాలకు ఇది పవిత్ర ప్రాంతం. తమకు జెరూసలెం రాజధాని అని ఇజ్రాయెల్ ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే ఈ ప్రాంతాన్ని అత్యధికంగా ఆక్రమించుకున్న ఇజ్రాయెల్ పట్ల పాలస్తీనియన్లు ఆగ్రహంతో ఉన్నారు. భవిష్యత్తులో ఏర్పడే పాలస్తీనాకు తూర్పు జెరూసలెంను రాజధానిగా ప్రకటించుకుని తీరుతామని పాలస్తీనియన్లు స్పష్టం చేస్తున్నారు.
భగ్గుమంటోన్న పాలస్తీనా : జెరూసలెంపై హక్కుల విషయంలో చిరకాలంగా తమ వాదనలు కొనసాగుతున్నాయని ఈ దశలో అమెరికా నిర్ణయం తగదని పాలస్తీనియన్లు మండిపడుతున్నారు. జెరూసలెంను రాజధానిగా గుర్తించాలన్న నిర్ణయాన్ని ట్రంప్ ఫోన్‌లో పాలస్తీనియన్ అథారీటి అధ్యక్షులు మహమూద్ అబ్బాస్‌కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నిరసన వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. ఈ నిర్ణయాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక పాలస్తీనియన్లు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా మూడు రోజుల ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమాన్యుయెల్ మాక్రాన్ కూడా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టారు.
చైనా ఆందోళన …ఐరాస హెచ్చరిక : ట్రంప్ నిర్ణయంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత రాజుకుంటుందని చైనా హెచ్చరించింది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఘర్షణలు పెరుగుతాయని చైనా ప్రతినిధి జెంగ్ షౌవాంగ్ బీజింగ్‌లో స్పందించారు. సంబంధిత పక్షాలు అన్ని సంయమనంతో వ్యవహరించాల్సి ఉంది. తమ చేతలు, మాటలతో శాంతి స్థాపనకు చేటు కల్గించరాదని తెలిపారు. ఇక జెరూసలెం భవిష్య ప్రతిపత్తి ఏమిటనేది సంప్రదింపుల ద్వారా ఖరారు కావాల్సి ఉంటుందని మిడిల్ ఈస్ట్‌పై ఐరాస ప్రతినిధి నికోలాయ్ మ్లడెనోవ్ స్పష్టం చేశారు. వివాదాస్పద నగరంపై ఎలాంటి చర్య అయినా ప్రకటన అయినా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందన్నారు. జెరూసలెం భవితపై నిర్ణయం తీసుకోవల్సింది కేవలం ఇజ్రాయెల్ మరో వైపు పాలస్తీనియా అని ఇరు పక్షాలు నేరుగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు.

Comments

comments