Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

అస్తిత్వానంతర తెలంగాణ

telangana

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్న కాలంలో కోటి ఆశలతో ప్రజలు పోరాడి, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నారు. ఈ సమయంలోనే డా.బి.ఆర్. అంబేడ్కర్ చిన్న రాష్ట్రాలపై రాసిన వ్యాసాన్ని చదివి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత క్రింది కులాలకు మేలు జరుగుతుందని ఆధిపత్య కులాల పట్టు తగ్గుతుందని నమ్మాము. అస్తిత్వ పోరాటం ఫలించిన తర్వాత ఏం జరుగుతుంది అనేదానికి ప్రస్తుత తెలంగాణ మంచి ఉదాహరణ. సామాజిక అస్తిత్వాల పోరాటాలు ఇంకా నడుస్తూనే వున్నాయి, వీటి భవిష్యత్తు ఇంకా తేలవలసి వుంది. తెలంగాణ అస్తిత్వ పోరాటంలో ముందుండి పోరాడిందీ, త్యాగాలు చేసింది మెజార్టీ క్రింది కులాలు. రాజకీయ అధికారం మాత్రం అగ్ర వర్ణాల చేతిలోకి పోయి ‘బంగారు తెలంగాణ’ అయింది. మళ్ళీ ఇప్పుడు చర్చ తెలంగాణలోని రెండు అగ్రకులాల్లో ఏ కులం రాజకీయాధికారాన్ని చేజిక్కించుకుంటుందీ అని మరో విచిత్రమైన మార్పు రాజ్యం రచయిత కలిసి పోయి విచిత్రమైన వ్యక్తులుగా రూపాంతరం చెందారు.
ఇందులో కొందరు మౌనంగా వుంటూ రాజ్యానికి మద్దతు తెలియజేస్తున్నారు. ఇంకొందరు బహిరంగంగానే రాజ్య భజనపరులుగా తయారయ్యారు. కనీసం ప్రభుత్వం చేస్తున్న పనులును విమర్శనాత్మకంగానైనా చూడటానికి ఇష్టపడటం లేదు. ప్రభుత్వం ఏం చేసినా అది ప్రజల మేలు కొరకే అన్నట్లు వీళ్ళకి కనిపించడం ఒక విచిత్రమైతే! అస్తిత్వానంతరం కొంత మందికి మాత్రమే ప్రయోజనం కల్గుతుందని ఆ కొంత మందిలో క్రింది కులాల వాళ్ళు కూడా చేరి రాజ్యానికి అనుకూలురుగా మారిపోతారని బహుశా అస్తిత్వ సిద్ధ్దాంతాలను ప్రవేశపెట్టిన వారు కూడా ఉహించి వుండరు. ప్రజల సంక్షేమం పేరు మీద పెట్టిన స్కీంలలో అందులో ఎన్ని లొసుగులున్నా మాట్లాడటానికి భయపడుతున్నారు. ఇద్దరు దళిత యువకులు ప్రభుత్వ భూమి పంపణీలో తమకు న్యాయంగా రావల్సిన భూమి రాలేదని ఆత్మహత్యకు పాల్పడితే, అందులో ఒక వ్యక్తి చనిపోయినా ఎవరికీ కనపడదు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురూ చూసి ఆత్మహత్య చేసుకుంటే మాట్లాడరు.
ఒకప్పుడు చీమ చిటుకుమన్నా తమ రాతలతో ప్రజలలో చైతన్యం నింపిన రచయితలు, మేధావులు, రాజ్యాన్ని ఎట్లా కాపాడాలో ఆలోచిస్తున్నారు. రాజ్యం అనేది ఇప్పుడు ‘దైవంతో’ సమానమైపోయి ఈ ప్రభుత్వ గుర్తింపు కోసం ఆరాటపడుతున్నారు. ప్రభుత్వం చేసే పండుగల్లో భాగస్వామ్యం దొరికితే చాలు జన్మ ధన్యమైనంతగా సంతోషపడుతున్నారు. ఈ మూడు ఏండ్లలో ఎంత అప్పు ఈ రాష్ట్రం చేసిందో కనపడదు, పైగా ‘అప్పు అభివృద్ధికి చిహ్నం’ అని స్టేట్‌మెంట్‌లు ఇస్తుంటే మౌనంగా అవును అనే అంగీకారాన్ని తెలుపుతున్నారు. తెలంగాణ వచ్చింది ప్రజల జీవితాలలో మార్పు తేవడానికి, అదీ క్రింది కులాలకు మేలు జరిగే విధంగా న్యాయం గా, హక్కుగా వాళ్ళకు దక్కాల్సిన వాటా దక్కాలని తెలంగాణలోని అలోచనా పరులు మాట్లాడుతారని, మారుతారని ఆశిస్తూ.

Comments

comments