Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

క్లౌడ్ కంప్యూటింగ్ ఉరిమే అవకాశాలు

life2

ఐటి రంగంలో విశేషమైన ఉపాధి అవకాశాలు క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో కలుగుతున్నాయి. ప్రస్తుతం దీనిదే హవా ప్రముఖంగా నడుస్తోంది. అయితే దీని హవా ఎంత కాలం నిలుస్తుంది? దీని భవిష్యత్తు ఏమిటి? ఉపాధి అవకాశాలు ఎంత వరకు స్థిరంగా ఉంటాయి అన్నది ప్రధాన ప్రశ్న. ఆకాశంలో మేఘాలు మాదిరిగా క్లౌడ్ కంప్యూటింగ్ చాలా త్వరగా మారిపోతున్న రంగం. ఈ రంగంలో అవకాశాలు ఏ రూపంలో ఎలా వస్తాయో ముందుగా ఊహించడం నిష్ణాతులైన వారికి కూడా కష్టంగా ఉంది. కనుకనే ఇది ఐటిలో హాట్ టాపిక్ అవుతోంది. దీని తీరు తెన్నుల పై అవగాహన తెచ్చుకోవాలంటే ఏకైకమార్గం ప్రతి నిత్యం దీన్ని గమనిస్తూ ఉండడమే. కనుక ఈ రంగంపై తాజా పరిస్థితి ఎలా ఉందో పరిశీలిద్దాము.

ఇ-మేఘాలు అంటే?
అంతర్జాలంలో బ్రాడ్ బాండ్ సమస్యలు తీరిన తరువాత క్లౌడ్ కంప్యూటింగ్ అభివృద్ధి చెందింది. ఐటిరంగంలో మైక్రోసాఫ్ట్, యాహూ, గూగుల్ వంటి ఉద్దండుల సరసన నిలిచిన అమెజాన్ డాట్ కాం సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్ కు ఆద్యురాలు. మేఘాల దారుల్లో బిలియన్ల డాలర్ల సామ్రాజ్యం నిర్మించిన విధానం అర్థం చేసుకోవడం చాలా తేలిక. నేడు ఎంత చిన్న వ్యాపారానికైనా ఆధునిక సాంకేతిక ఉపయోగాలు అందచేయడానికి ఉద్దేశించిన వ్యవస్థే క్లౌడ్ కంప్యూటింగ్. ఈ రోజున ఒక చిన్నపట్టణంలో హోటల్ నడుపుతున్న వ్యక్తి రైళ్ళలో, బస్సుల్లో వెళుతున్న వారికి తేలికగా ఫలహారాలు, భోజనాలు అందివ్వగలడు. ఇదే పని గతంలో చేయాలంటే అతడు ఒక వెబ్ సైట్ ఓపెన్ చేసి, సర్వర్లు రన్ చేసి, ఆర్డర్లు బుక్ చేసుకుని ప్రయాణికులకు సకాలంలో ఫలహారాలు అందిచాల్సి ఉండేది. అతని వ్యాపారం ప్రధానంగా హోటల్ వ్యాపారం. దాన్ని వదిలి పెట్టి వెబ్ సైట్ రన్ చేయడం అంటే అతనికి సాధ్యమయ్యే పనికాదు. వ్యాపార రంగంలో ఇటువంటి చిన్న, మధ్యతరగతి నుంచీ పెద్ద వ్యా పార సంస్థలు మాత్రమేకాకుండా అంతర్జాతీయ సంస్థలకు, ప్రభుత్వ సంస్థల కు కూడా సేవ చేసే ఐటి సంస్థలు వచ్చాయి. అవే క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలు. ఇవి అన్ని రకాల వ్యాపార సంస్థల నెట్ వర్క్ సమస్యలు, ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్ నిర్వాహణలు, డేటాబేస్, సర్వర్ లను నిర్వహిస్తాయి.
ఎవరెవరికి ఉపయోగం?
ఇక్కడ ఇచ్చిన చిరువ్యాపారికి మాత్రమే కాదు కొన్ని రకాల అతి పెద్ద సం స్థలకు, ప్రభుత్వాలకు కూడా క్లౌడ్ కంప్యూటింగ్ సహాయకారి కాగలదు. ఇది అర్థం చేసుకోవాలంటే 10వ తరగతి ఇంటర్మీడియేట్ పరీక్షాఫలితాలు ఉదా హరణగా తీసుకోవచ్చు. రాష్ట్రప్రభుత్వ ఉన్నత విద్య, ఇంటర్మీడియేట్ విద్యాశా ఖలు ఈ వెబ్ సైట్లను నిర్వహిస్తూ ఉంటాయి. ఈ వెబ్ సైట్లను సాధారణంగా విద్యార్థులు మాత్రమే బ్రౌజింగ్ చేస్తుంటారు. కానీ, పరీక్షాఫలితాల కాలంలో విద్యామంత్రి పరీక్షా ఫలితాలు విడుదలు చేయగానే ఒక్కసారిగా విద్యాశాఖ సర్వర్ల మీద సునామీలా విద్యార్థులు విరుచుకుపడతారు. కేవలం విద్యార్థులే కాకుండా వారి బంధువులు కూడా విద్యాశాఖ సర్వర్ల మీద దండయాత్ర చేస్తా రు. దీంతో హఠాత్తుగా వచ్చిన సునామీని తట్టుకోలేక విద్యాశాఖ సర్వర్లు క్రాష్ అవుతాయి. అవి క్రాష్ అయ్యే కొద్దీ వాటి మీద ఒత్తిడి మరింత పెరిగిపోతుంది. దీనికి తోడుగా సర్వర్లకు అదనపు పనిభారం కూడా ఆ సమయంలో పడు తుంది. ఉదాహరణకు విద్యార్థులు తాము రిజిస్టర్ చేసుకున్న సెల్ ఫోన్‌కు ఎస్ ఎం ఎస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఒత్తిడి ప్రముఖ సెల్ ఫోన్ ఆపరేటర్ల మీద కూడా పడుతుంది. విద్యార్థులు ఎవరికి వారు తమ ఫలితాలు తెలుసుకునే ఉద్దేశంతో సర్వర్ల మీద ఒత్తిడి విపరీతంగా పెంచేస్తారు. ఇటువంటి సేవా సునా మీలు ఎలా ఎదుర్కోవాలి? అనే దానికి సమాధానమే క్లౌడ్ కంప్యూటింగు. అసాధారణంగా ఒక్క రోజులో కేవలం కొద్ది గంటల్లో వచ్చే ఉప్పెన తట్టు కోవడానికి ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం కోట్ల రూపాయలతో నెట్ వర్క్ వ్యవ స్థలు నిర్మించుకోవు. ఒక రోజు పెళ్ళికి ముఖమంతా కాటుక అనే సామెత దీని కి బాగా అతుకుతుంది. ఇటు వంటి సునామీలను తట్టుకోవడానికి అనేక మా ర్గాలు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. మొత్తం వత్తిడి ప్రభుత్వ సర్వర్ల మీద పడకుండా చాలా తేలికైన మార్గం అవి అవలంబిస్తున్నాయి. వివిధ పత్రి కలకు, వెబ్ పత్రికలకు, సెల్ ఫోన్ కంపెనీలకు పరీక్షాఫలితాల విడుదలను సిడి రూపంలో డేటాలుగా అందిస్తున్నాయి. దీంతో విద్యార్థులు, వారి బంధు వుల బ్రౌజింగ్ సునామీలు కొంత వరకూ తగ్గాయి. అయితే ఇవి కూడా సత్ఫ లితాలు ఇవ్వడం లేదు. దానికి కూడా కారణాలు ముఖ్యమైనవే ఉన్నాయి. ప్రతీ వార్తాపత్రికలు, వెబ్ పత్రికలు కేవలం తమ సాధారణ నెట్ ట్రాఫిక్ ను అనుసరించి క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు కొనుక్కుంటాయి. కనుక అవి కూడా ఈ అసాధారణ ఒత్తిడిని తట్టుకోలేక క్రాష్ అవుతూ ఉంటాయి. ఈ ఉదాహరణ బట్టీ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాధాన్యతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరో ఉదా హరణ రైల్వే శాఖగా చెప్పుకోవచ్చు. ఉదయం 10 గంటలకు తత్కాల్ బుకిం గ్‌లు ప్రారంభమవుతాయి అనగానే దేశ వ్యాప్తంగా అసాధారణ రీతిలో రైల్వే సర్వర్ల మీద ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. అవి క్రాష్ అవుతూ ఉంటా యి. ఇది రైల్వేకు నిత్యకృత్యమే. ఈ రెండు ఉదాహరణలతో కేవలం చిరు వ్యాపారులకు మాత్రమే కాక పెద్ద పెద్ద సంస్థలకు కూడా క్లౌడ్ కంప్యూటింగ్ అవసరాలు స్పష్టంగా తెలుసుకోవచ్చు.
ఇవి ఎలా పని చేస్తాయి?
పైన చెప్పిన ఒక హోటల్ కు ఇవి వెబ్ సైట్ కల్పించి, దానికి సంబంధించిన డేటాబేస్లు నిర్వహించి, నగదు లావాదేవీలు సులభతరం చేసి, ప్రయాణీకుల ఆర్డర్లు ప్రాసెస్ చేసి వ్యాపారాన్ని పెంచుకునే అవకాశం కల్పిస్తాయి. అంటే హోటల్ యజమాని ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలతో అనుసంధానం అయితే హార్డువేర్ సాఫ్ట్ వేర్ సమస్యలన్నీ సదరు సంస్థలు భరించి హోటల్ వ్యాపారాన్ని రైల్వే, బస్ ప్రయాణీకులకు అందిస్తాయన్నమాట. హోటల్ యజమాని కౌంటర్‌లో కూర్చుని విశాఖపట్టణంలో బయల్దేరే ప్రయాణీకుడు ఏలూరులో లంచ్ చేయాలనుకుంటే ఇంటర్నెట్ ద్వారా లంచ్ ఆర్డర్ చేస్తే భోజనాన్ని అందించగలడు. హోటల్ కు వచ్చి భోజనం టికెట్ కొనుక్కున్న వ్యక్తికీ, వైజాగ్ లో ప్రయాణం మొదలుపెట్టబోయే వ్యక్తికీ తేడా లేకుండా సేవ చేయగలడు. ఈ విధంగా చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా ఐటి ప్రయోజనాలు అందించే సంస్థలివి. కంప్యూటింగ్ సంస్థల సేవలను చిరు వ్యాపారులు తమ అవసరం మేరకు కొనుక్కోగలగడం వీటి విజయానికి కారణం అయింది. వీటి వల్ల ప్రతి వ్యాపారి తన వ్యాపారం మీదే కేంద్రీకరించుకుని హార్డువేరు, సాఫ్ట్ వేరు నెట్ వర్కు సమస్యలు లేకుండా వ్యాపారాలు చేసుకోగలుగుతాడు. ఇవి అపారమైన సంఖ్యలోని చిన్న వ్యాపారస్తులను ఉద్దేశించి ప్రారంభించినా నేడు అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు కూడా సేవలు చేసే దశకు చేరుకోవడంతో క్లౌడ్ కంప్యూటింగ్ రంగం పటిష్టమైన పునాదులు ఏర్పడ్డాయి. అందువలన చాలా తక్కువ కాలంలో ఈ రంగం ఆకాశహర్మ్యాలు నిర్మించేసుకుంది. నేడు ఇవి లేకుంటే ఐటి రంగమే లేనంతగా పాతుకుపోయాయి. నేడు మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఐఎంబి వంటి సంస్థలు కూడా క్లౌడ్ కంప్యూటింగ్ రంగంపై దృష్టి పెట్టాయి. తొలిదశలో ఈ విధంగా ప్రారంభం అయిన మేఘాల గుర్రాల కంపెనీలకు దినదినం అందుబాటులోకి వస్తున్న వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ సేవలు, తగ్గిపోతున్న కంప్యూటర్ ఖరీదులు, స్టోరేజీ పరికరాల ధరలు, నెట్ వర్క్ వినియోగంలో వస్తున్న సులభతరమైన మార్గాలు ఈ రంగానికి సుస్థిరమైన ప్రగతిని కలిగించాయి.
ఇమేఘాలలోని రకాలు:
క్లౌడ్ సేవల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిలో ప్రైవేటు, పబ్లిక్, హైబ్రీడ్ క్లౌడ్స్ ముఖ్యమైనవి. ఇవి కాక కమ్యూనిటీ క్లౌడ్, డిస్ట్రిబ్యూడెట్ క్లౌడ్, మల్టీ క్లౌడ్ లు పెరిగాయి. వీటిలో అతి ముఖ్యమైనవి హైబ్రీడ్ క్లౌడ్లు, మల్టీ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థలు. వీటిదే ప్రస్తుతం హవా నడుస్తోంది. కేవలం కంప్యూ టర్లలోనే కాకుండా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో కూడా వస్తున్న మార్పులను బట్టీ ఇ-మేఘాల రంగం తన పరిథి మరింత పెంచుకొని విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఒకప్పుడు ఇది కేవలం కంప్యూటర్ల కే పరిమితం అయినా నేడు అందుబాటులోకి వచ్చిన లాప్ టాప్లు, టాబ్లెట్లు, ఆఖరికి సెల్ ఫోన్లను కూడా ఉపయోగించి తమ సేవా మార్గాలకు సిమెంటు రోడ్లు వేసుకుంటున్నాయి. కేవలం వెబ్ బ్రౌజర్ ఉండే ఏ పరికరంతో అయినా ఇవి అందుబాటులోకి వచ్చేయడంతో ఇవి నేడు ఐటి రంగాన్నే శాసించే స్థాయికి చేరుకున్నాయి. ఇవి ప్రాంతానికి, పరికరాలకు అతీతంగా మారిపోయి అందుబాటులోకి వచ్చాయి. అంటే ఏ వ్యాపారి ఎక్కడ నుంచైనా ఏ రకం పరికరంతోనైనా తన వ్యాపారం నడుపుకోగలగడం వలన వీటి ప్రాధాన్యత మరింత పెరిగిపోయింది. అంటే పైన ఇచ్చిన ఉదాహరణలోని హోటల్ వ్యాపారి తాను హోటల్ లో లేకపోయినా, వేరే ఊరిలో ఉన్నా, కేవలం సెల్ ఫోన్ తో తన వ్యాపారాన్ని చేసుకోగలడు. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
ముఖ్యలక్షణాలు
క్లౌడ్ కంప్యూటింగ్ కు కొన్ని ముఖ్య లక్షణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఆన్ డిమాండ్ సర్వీసులు. వినియోగదారులు తమకు ఎప్పుడు ఏ సేవ కావలసి వచ్చినా క్లౌడ్ సంస్థల ఉద్యోగుల ప్రమేయం లేకుండా రుసుము చెల్లించి వెంటనే సేవలు పొందే సదుపాయం ఉండాలి. ఇది మొదటి లక్షణం. అంటే ఉదాహరణకు తన వ్యాపార అవసరాలకు గాను బ్యాండ్ విడ్త్ పెంచుకోవాలనుకుంటే అతను నిర్ణీత రుసుము చెల్లించిన వెంటనే అతని బ్యాండ్ విడ్త్ పెరగాలి. అలాగే వివిధ రకాల ఇపరికరాలతో పనిచేసే సత్తా కలిగి ఉండాలి. వ్యాపారికి సేవ చేసే క్లౌడ్ సంస్థలు తమ సేవలు హోటల్ కస్టమర్లకు అన్ని విధాలుగా అందుబాటులోకి తేగలగాలి. అంటే సెల్ ఫోన్, లాప్ టాప్, డెస్క్ టాప్, టాబ్లెట్ వంటివి వినియోగదారులు ఉపయోగిస్తే వాటి ద్వారా హోటల్ ను అనుసంధానించగలగాలి. రిసోర్సు పూలింగ్ అనేది మరో ముఖ్య లక్షణం. వ్యాపారి అవసరాలకు అనుగుణంగా మారగలిగే ఎలాస్టిసిటీ ఉండాలి. తాను చేసే సేవలకు ఏవిధంగా రుసుము వసూలు చేస్తున్నాడో ఆ పార దర్శకత కూడా ఉండాలి. ఉదాహరణకు స్టోరేజీని మెగాబైట్ల నుంచీ గిగా బైట్ల కొలమానంలో అమ్మడం వంటివి. ఈ విధంగా క్లౌడ్ కంప్యూటింగ్ కి కూడా కొన్ని ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
మేఘాల సేవల రకాలు
క్లౌడ్ కంప్యూటింగ్ లో కొన్ని ముఖ్యమైనవి తెలుసుకు తీరాలి. ఇవి తరచూ వినియోగించే పదాలు. ఎవ్రీథింగ్ యాజ్ ఎ సర్వీస్ ( EaaS). ఇందులో మూడు మోడల్స్ ఉంటాయి. అవి మొదటిది ఇన్ ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ (IaaS), ప్లాట్ ఫాం యాజ్ ఎ సర్వీస్ (PaaS), సాఫ్ట్ వేర్ యాజ్ ఎ సర్వీస్ (SaaS). ప్రతీ సేవలోనూ ఇవి ఉండవచ్చు. లేదా ఇవే ప్రధానంగా కూడా ఉండవచ్చు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ (IaaS) ఈ సేవలో హైలెవెల్ ఎపిఐ లు ఉపయోగిస్తారు. దీని వల్ల ఫిజికల్ కంప్యూటింగ్ రిసోర్సులు, లొకేషన్, డేటా పార్టీషనింగ్, సెక్యూరిటీ బ్యాక్ అప్ వంటివాటి రిఫరెన్సులు నియంత్రిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీలు ఏఏ వ్యవస్థలతో పనిచేసినా వాటితో నిమిత్తం లేకుండా తనకు కావలసిన వ్యవస్థలు పొందడంగా అని చెప్పుకోవచ్చు. ప్లాట్ ఫాం యాజ్ ఎ సర్వీస్ (PaaS)లో సాధారణంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలు, లైబ్రరీలు, టూల్స్ ఉంటాయి. ఇవి తాను ఉపయోగించే వాటిమీద అతనికి అధికారం ఇస్తాయి. సాఫ్ట్ వేర్ యాజ్ ఎ సర్వీస్ (SaaS)లో క్లైంటుకు ఏఏ సాఫ్టు వేర్లు అందుబాటులో ఉంటాయో చెప్పే వివరాలు ఈ విభాగంలో ఉంటాయి. అంటే వెబ్ బేస్డ్ ఇమెయిల్ వంటివి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీటి తరువాత చెప్పుకోవలసింది విశేషంగా ప్రైవేటు క్లౌడ్లు, పబ్లిక్ క్లౌడ్లు, హైబ్రీడ్ క్లౌడ్లు. క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీలు తమ వినియోగదారులైన వారికి ప్రత్యేకంగా క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ నిర్వహిస్తాయి. పబ్లిక్ క్లౌడ్ల రూపంలో చేసే నెట్వర్కు సేవ అందరికీ అందుబాటులో ఉంటుంది. నిజానికి ఈ రెండింటికీ భేదం చాలా తక్కువ. కేవలం సెక్యూరిటీ అంశంలోనే తేడా. హైబ్రీడ్ క్లౌడ్లు ప్రైవేటు, పబ్లిక్ క్లౌడ్ల మిశ్రమ వ్యవస్థ. ఇందాక చెప్పిన విద్యాశాఖ తాత్కాలిక అవసరాలను తీర్చేది హైబ్రీడ్ క్లౌడ్ వ్యవస్థగా చెప్పుకోవచ్చు. కేవలం ఫలితాలు ప్రకటించే వారం రోజులు ఇవి క్లౌడ్ కంపెనీల సేవలు పొంది ట్రాఫిక్ సాధారణ దశకు రాగానే సేవలుపొందడం నిలిపివేస్తే అది మిశ్రమ క్లౌడ్ వ్యవస్థగా చెప్పుకోవచ్చు. దీని తరువాత ముఖ్యంగా చెప్పుకోవలసింది మల్టీ క్లౌడ్ గురించి. మల్టిపుల్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులు అనేక మంది నుంచీ పొందడం.
రేపటి భవితవ్యం
రేపు అధికంగా హైబ్రీడ్ క్లౌడ్ లకే ప్రాధాన్యం రాబోతోంది. వీటిలో ట్రూ హైబ్రీడ్ క్లౌడ్లు ఒకటి. ఇవి అనేక వర్కు లోడ్లతో అనేక క్లౌడ్లను ప్రత్యేకంగా నిర్వహిస్తూ మల్టీ క్లౌడింగ్ కు ప్రాధాన్యత పెంచుతాయి. కుబెర్నేట్స్ కు ప్రాముఖ్యం వస్తుంది. బిగ్ డేటా ఎనలిటిక్స్ లో కృత్రిమ మేధస్సు ఒక ఊపు అందుకునే అవకాశాలు 2018లో పుష్కలంగా కనిపిస్తున్నాయి. క్లౌడ్ వ్యవస్థలో నిన్నటి వరకూ నెలకొన్న రక్షణ సమస్యలకు పరిష్కారాలు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రముఖ కంపెనీలు అయిన మైక్రోసాఫ్టు, ఎస్ ఎ పి కంపెనీలు కూడా తమ క్లౌడ్ కంప్యూటింగ్ భాగస్వామ్యాలు విస్తరిస్తున్నాయి. SAP సంస్థకు చెందిన S/4 HANA డేటాబేస్ ను మైక్రో సాఫ్ట్ సంస్థ తమ అంతర్గత ఆర్థిక వ్యవహారాలకు ఉపయోగించబోతోంది. అలాగే SAP సంస్థ కూడా మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన అజుర్ క్లౌడ్ ను మరింతగా ఉపయోగించబోతోంది. ఈ రెండింటి కలయిక క్లౌడ్ రంగానికి రాబోతున్న స్థిరమైన ఉనికిని తెలుపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ కేర్ రంగంలో 60 వేల కోట్ల రూపాయల మార్కెట్ క్లౌడ్ కంప్యూటింగ్ రంగానికి రానుందని అనుభవజ్ఞులు అంచనా వేస్తున్నారు. మరో నాలుగు ఏళ్ళలో వైద్యఆరోగ్యరంగాల్లోని రియల్ వరల్డ్ క్రమరహిత డేటాను క్రమబద్ధం చేయవలసిన అవసరం వల్ల అవకాశాల వెల్లువ రానుంది. ముఖ్యంగా వైద్యశాలలు, వైద్యులు, ఈ రంగానికి చెందిన ఇతర ఉపరంగాలు క్లౌడ్ కంప్యూటింగ్ పై భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. టెలీ మెడిసిన్ రంగం కూడా మంచి మార్కెట్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీలు పొందబోతున్నాయి. అంటే ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా రానున్నాయని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం సంస్థల మధ్య నెలకొన్న వ్యాపార పోటీలు పరిశీలించినా క్లౌడ్ కంప్యూటింగుకు ఉన్న భవితవ్యం దివ్యంగా ఉంటుంది.

Comments

comments