Search
Friday 20 April 2018
  • :
  • :

అంపశయ్యపై అన్నదాతలు

farmer* ప్రకృతి వైపరీత్యాలతో కలసిరాని కాలం
* ఈ ఏడాది 42 మంది రైతుల ఆత్మహత్యలు
* పంట చేతికొచ్చే సమయానికి ముంచిన అకాలవర్షం
* ఇప్పటికి రైతుల ఆత్మహత్యలపై స్పందించని ప్రభుత్వం
* రైతుల కుటుంబాలకు అందని పరిహారం
* పెట్టుబడులకు తగినట్లుగా లభించని మద్ధతు ధర
* అప్పులు తీర్చలేక కొనసాగుతున్న ఆత్మహత్యలు

మన తెలంగాణ/మంచిర్యాలప్రతినిధి : ఆరుగాలం శ్రమించి పంటలను పండిస్తున్న అన్నదాతలకు ఈ ఏడాది కలసి రాలేదు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పెట్టుబడులు కూడా వెళ్లని పరిస్థితులు దాపురించాయి. ఫలితం గా రైతులు ఆత్మహత్యలు చేసుకోగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ ఏడాది మంచిర్యాల, కొమ్రంభీం జిల్లాల్లో 42 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే విధంగా మరో 36 మంది ఆత్మహత్యాయత్నాలకు పాల్పడి కోలుకోలేని స్థితికి చేరారు. వరిధాన్యం చేతికొచ్చే సమయంలో అకాలవర్షం కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిచిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. పత్తి పంట సమయంలో అకాలవర్షం రైతుల కొంపముంచింది. వర్షం కారణంగా పత్తి మసకబారడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాలవర్షం వలన వరి పంటలు నీట మునిగాయి.

పంటలను నమ్ముకొని జీవనాన్ని గడుపుతున్న రైతులు వరుస నష్టాలతో ఆర్థికంగా చికితిపోతున్నారు. అతివృష్టి అనావృష్టిల కారణంగా ప్రతియేటా ఆశించిన మేరకు దిగుబడులు రాకపోవడంతో మానసిక ఆందోళనకు గురై చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత మూడేళ్లలో 123 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా ప్రభుత్వ అధికారులు గుర్తించగా ఇందులో కేవలం 69 కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. జిల్లాలో రైతులు ప్రధానంగా పత్తి పంటలపై ఆధారపడి ఉండగా ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయి పంటలకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. అయితే పెట్టుబడులకు తగినట్లుగా ప్రభుత్వ పరంగా మద్దతుధర లభించకపోవడంతో రైతులు ప్రతి సంవత్సరం నష్టాలను ఎదుర్కొంటున్నారు. పత్తి పంటల సాగుకు ప్రభుత్వం రుణ సాయం అందిస్తున్నప్పటికీ దిగుబడి అధికంగా సాధించాలనే ఉద్దేశంతో రైతులు సాగువిస్తీర్ణాన్ని పెంచు తూ మధ్య దళారులను ఆశ్రయించి అప్పులు పొందుతున్నా రు. ఆత్మహత్య చేసుకున్న రైతు ల కుటుంబాలను ఆదుకునేందుకు గతంలో రూ.1.50 లక్ష లు ఇచ్చేపరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.6 లక్షలకు పెం చుతూ జిఓ నెం. 194 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.

ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించి వారి ఆర్థిక పరిస్థితులపై మండల స్థాయి అధికారుల కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీని ఆధారంగా త్రిసభ్యకమిటీ విచారణజరిపి పరిహారం మంజూరుకు ప్రభుత్వానికి సిఫారస్సులు పంపుతుంది. ఈ ప్రక్రియలో తీవ్రమైన జాప్యం చోటు చేసుకోవడంతో అత్యధిక శాతం రైతుల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. రైతులకు చెల్లించే పరిహారంలో రూ.6 లక్షల నుంచి రూ.లక్ష అప్పు ఇచ్చేందుకు వెంటనే రైతు కుటుంబానికి చెల్లించాలి. మిగిలిన రూ.5 లక్షలు బాధిత కుటుంబానికి తిరిగి వ్యవసాయం చేసుకునేలా అందించాలి. ప్రభుత్వ పరంగా పరిహారం అందకపోవడంతో రైతుల కుటుంబాలు కూలీనాలి చేసుకుంటూ జీవనాన్ని గడుపుతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల్లో వితంతు పింఛన్లు కూడా మంజూ రు చేయకపోవడంతో వారి జీవితాలు దుర్బరంగా మారాయి. లక్షెట్టిపేట ఇటిక్యాలకు చెందిన బుద్దె బానయ్య గత సంవత్సరం డిసెంబర్ 29న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా ఇప్పటి వరకు పరిహారం అందలేదు. భార్య భువనేశ్వరి కూలీ పని చేసుకుంటూ పిల్లలను చదివించుకుంది. వారికి ఉన్న ఒకటిన్నర ఎకరాల చేనులో పత్తి పంటలు వేసుకోగా ప్రతి సంవత్సరం నష్టాలను ఎదుర్కొంటున్నారు. అదే విధంగా దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన చుంచు తిరుపతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ భూమి లేకపోవడంతో 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయగా వరుస నష్టాలను భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. అదే విధంగా కన్నెపల్లి వెలుగునూర్‌కు చెందిన అక్కల లచ్చన్న అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయిన్పటికీ కూడా వీరి కుటుంబాలకు నష్టపరిహారం అందలేదు.

Comments

comments